పోలియో రహిత దేశంగా భారత్
న్యూఢిల్లీ : తరతరాలుగా పట్టి పీడిస్తోన్న పోలియో మహమ్మారి ఎట్టకేలకు భారత్‌లో కనుమరుగైంది. స్మాల్‌పాక్స్‌ను భారతదేశం నుంచి తరిమేసిన దాదాపు 37 సంవత్సరాల తర్వాత పోలియో వైరస్కూడా మన దేశం నుంచి వెళ్లిపోయినట్లే . గత మూడేళ్ల కాలం నుంచీ దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారమిక్కడ ప్రకటించింది. దాంతో నేటితో భారత్ పోలియో రహిత దేశంగా చరిత్రకెక్కింది. ఇప్పటికే భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.
2014నాటికి దక్షిణాసియాలో కూడా పోలియో నివారణకు తగిన చర్యలు చేపట్టనున్నట్టు దక్షిణాసియాకు చెందిన ప్రపంచ ఆరోగ్యశాఖ ప్రకటించింది. పోలియో నివారణకు భారత్ తీసుకున్న చర్యల వల్ల ఈ సత్పలితాలు వచ్చాయని ప్రపంచ ఆరోగ్యశాఖ ప్రకటించింది. గత కొన్నేళ్ల నుంచి పోలియో చుక్కల వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసి అందుకు అనుగుణంగా ప్రణాళికను కూడా అమలుపరడంలో సఫలీకృతమయ్యాయి. ఇది మన దేశానికి గొప్ప విజయంగా చెప్పొచ్చు. 2009లో 741 పోలియో కేసులు నమోదు కాగా, 2010లో ఆ సంఖ్య 42కు తగ్గింది. 2011 జనవరిలో పశ్చిమబెంగాల్లోని హౌరా జిల్లాలో వాక్సిన్ వేయించుకోని రెండేళ్ల బాలికకు పోలియో సోకింది.