భారతీయుల వేతనాలు ఎంత పెరిగాయో తెలుసా?
ఎనిమిదేళ్ల క్రితం నెలకొన్న ఆర్థిక సంక్షోభం కాలం నుంచి ఇప్పటివరకు భారతీయులు వేతనాలు ఎంత పెరిగాయో వింటే షాకవుతారు. అప్పటినుంచి ఇప్పటివరకు కేవలం 0.2 శాతం మాత్రమే భారతీయుల వేతనాలు పెరిగాయట. ప్రపంచ రెండో ఆర్థిక వ్యవస్థగా పేరున్న చైనా, ఓ వైపు తయారీరంగంలో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్పప్పటికీ వేతనాలను మాత్రం భారీగానే పెంచిందట. ఆ దేశ శాలరీ గ్రోత్ రికార్డు స్థాయిలో 10.6 శాతంగా నమోదైందని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కార్న్ ఫెర్రీ హే గ్రూపు డివిజన్ జరిపిన తాజా విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వాస్తవంగా వేతన వృద్ధి భారత్‌లో కేవలం 0.2 శాతం నమోదైనప్పటికీ, అదేకాలంలో జీడీపీ 63.8 శాతం పెరిగినట్టు పేర్కొంది.
2008 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే శాలరీ గ్రోత్‌లో చైనా తర్వాత ఇండోనేషియా(9.3శాతం), మెక్సికో(8.9శాతం) ఎగిసినట్టు ఈ అధ్యయనం తెలిపింది. అదేవిధంగా ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల వేతన వృద్ధి చాలా చెత్తగా ఉందని పేర్కొంది. టర్కీ వేతన వృద్ధి -34.4 శాతం, అర్జెంటీనాది -18.6శాతం, రష్యాది -17.1శాతం, బ్రెజిల్ ది -15.3శాతంగా ఉన్నట్టు వెల్లడించింది.
భారత్‌లో వేతన వృద్ధి ముందునుంచి చాలా అసమానంగా ఉంటుందని, 30 శాతం మంది చాలా తక్కువగా, 30 శాతం మంది కొంచెం ఎక్కువగా వేతనాలు పొందుతున్నారని కార్న్ ఫెర్రీ హే గ్రూపు గ్లోబల్ ప్రొడక్ట్ మేనేజర్ బెంజమిన్ ఫ్రాస్ట్ తెలిపారు. కేవలం సీనియర్ లెవల్ ఉద్యోగాలకు మాత్రమే వేతన వృద్ధి ఉందని,అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో వేతనాల వృద్ధి తక్కువగానే ఉందని ఫ్రాస్ట్ వివరించారు. భారత్‌లో నైపుణ్యాలు లేమి, మితిమిత జ్క్షానంతో వచ్చే ఉద్యోగుల శాతం పెరుగుతుండటంతో, వేతన వృద్ధి కూడా అంతతమాత్రంగానే ఉందని చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ముందస్తు కాలంలో ఉన్న ధరల పెరుగుదల, కరెన్సీ విలువలో మార్పులు వేతన వృద్ధిని అంతలా పెంచలేకపోయాయని కార్న్ ఫెర్రీ హే గ్రూపు విశ్లేషణ తెలిపింది.