హాలీవుడ్‌తో మనకు సవాలే!
న్యూఢిల్లీ: భారతీయ చిత్ర పరిశ్రమ గురించి ప్రముఖ విలక్షణ నటుడు భారత్‌లోనే కాకుండా హాలీవుడ్ చిత్రాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్న ఇర్ఫాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. భారత్‌లో హాలీవుడ్ ప్రాజెక్టులు శరవేగంగా దూసుకొస్తున్నాయని, అతి త్వరలోనే వీటితో భారతీయ చిత్ర పరిశ్రమకు కొంత నష్టం జరుగుతుందేమోనని అభిప్రాయపడ్డారు. 'భారత్ లో హాలీవుడ్ మార్కెట్ శరవేగంగా పెరుగుతోంది. భారతీయ చిత్రాలు దాని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి.
భారతీయ చిత్ర నిర్మాణ సంస్థలను హాలీవుడ్ మార్కెట్ ఆక్రమిస్తుందేమోనని నా ఆలోచన. ఇది భారతీయ చిత్ర పరిశ్రమకు ఒక సవాలే' అని ఇర్ఫాన్ అన్నారు. ఆయన త్వరలో రానున్న ఇన్ఫెర్నో అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన హాలీవుడ్ ట్రైలర్ ను ఇప్పటికే విడుదల చేయగా భారతీయ చిత్ర వెర్షన్ కోసం ప్రత్యేక ట్రైలర్ ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈయన ఏ మైటీ హార్ట్, లైఫ్ ఆఫ్ పై, స్పైడర్ మేన్, జురాసిక్ పార్క్ వంటి పలు హాలీవుడ్ చిత్రాల్లో ఇర్ఫాన్ నటించిన విషయం తెలిసిందే.