ఒక్క మ్యాచ్ గెలిస్తే వరల్డ్ కప్ మనదే
ఢాకా: ఒక్క అడుగు.. ఒకే ఒక్క మ్యాచ్ లో గెలిస్తే ఐసీసీ అండర్ 19 క్రికెట్ ప్రపంచకప్ మనసొంతం అవుతుంది. మంగళవారం ఢాకా షేర్ ఎ బంగ్లా స్టేడియంలో జరిగిన సెమీస్ లో 97 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుచేసిన భారత యువ జట్టు సగర్వంగా ఫైనల్స్ లోకి ప్రవేశించి టైటిల్ గెలుచుకునేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది.
బంగ్లాదేశ్, వెస్టిండీస్ ల మధ్య గురువారం (ఫిబ్రవరి 11న) రెండో సెమీస్ జరగనుంది. ఆ మ్యాచ్ విజేతతో ఆదివారం (ఫిబ్రవరి 14న) జరగనున్న ఫైనల్స్ లో యువ భారతజట్టు తలపడుతుంది.
నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో తొలి 10 ఓవర్లు లంక బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. మొదటి 10 ఓవర్లలో భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి కేవలం 27 పరుగులు మాత్రేమే చేయగలిగింది. అయితే వన్ డౌన్ బ్యాట్స్ మన్ అన్మోల్ ప్రీత్ సింగ్ (72), నాలుగో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (59) భారత ఇన్నింగ్ ను చక్కదిద్దారు. ఐదు, ఆరు స్థానాల్లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ (43), అర్మాన్ జాఫర్ (29)లు ధాటిగా ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 267 పరుగులు చేసింది. లంక బౌలర్లలో ఫెర్మాండో 4, కుమారా, నిమేశ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
268 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన లంక ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. ఓపెనర్లిద్దరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ దారి పట్టగా, వన్ డౌన్ లో వచ్చిన మెండిస్(39), ఐదో స్థానంలో వచ్చిన అశాన్(38)ను కాసేపు పోరాడారు. ఆ తర్వాత డిసిల్వ (28), బంద్న్ సిల్వా (24)లు చేసిన పరుగులు బూడిదలోపోసిన పన్నీరయ్యాయి. లంక జట్టును 42.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ చేయడం ద్వారా భారత్ 97 పరుగుల విజయాన్ని మూటగట్టుకుంది. మన బౌలర్లలో ఎంజే డగార్ 3, అవేశ్ ఖాన్ 2, అహ్మద్, బాతమ్, సుందర్ లు తలోవికెట్ సాధించారు.