నైపుణ్యం ఉంటేనే వృత్తిలో రాణింపు
సాక్షి,బెంగళూరు: నైపుణ్యం ఉంటేనే ఎంచుకున్న రంగంలో రాణించగలరని భారత్ యూనివర్శిటీ ప్రతినిథి రామచంద్రన్ పేర్కొన్నారు. బెంగళూరులో ‘విద్యా ఉపాధి అవకాశాలు - నైపుణ్యం’ అంశంపై ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.ఇంజనీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ తదితర వృత్తి విద్యా సంబంధ కోర్సులు చదువుతున్న విద్యార్థులు తరగతి గదులకే పరిమితమవుతున్నారన్నారు. అందువల్లే చదువు ముగిసిన వెంటనే వారికి ఉపాధి అవకాశాలు లభించడం లేదన్నారు.
ప్రపంచీకరణ నేపపథ్యంలో చాలా రకాల పరిశ్రమలు నెలకొల్పబడుతున్నా, అందుకు తగ్గ నైపుణ్యం ఉన్న మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోందన్నారు. ఈ పరిస్థితి ముఖ్యంగా ఐటీ, ఐటీ ఆధారిత, వైనరీ, బయోటెక్నాలజీ పరిశ్రమలల్లో ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు. దీనిని నివారించడానికి వృత్తి కోర్సులను అందిస్తున్న విద్యాసంస్థలు విద్యా ఏడాది ప్రారంభంలోనే ఆయా పరిశ్రలమతో ఒప్పందం కుదుర్చుకుని నెలకు కనీసం 10 గంటల పాటు తమ విద్యార్థులకు అక్కడ శిక్షణ ఇప్పించాలన్నారు.
వైద్య, దంత వైద్య, నర్సింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రస్తుతం ఈ విధానమే అమల్లో ఉందని రామచంద్ర గుర్తుచేశారు. ఈమేరకు ప్రభుత్వం కూడా నిబంధనలు రూపొందిస్తే అటు విద్యార్థులకు ఇటు పారిశ్రామిక వర్గాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. చివరి సెమిస్టర్‌లోనే ఇంటర్న షిప్ చేయాలనే ఆలోచన మాని వృత్తి విద్యా కోర్సుల్లో చేరిన మొదటి ఏడాది నుంచే ఎంచుకున్న సబ్జెక్ట్‌కు సరిపోయే పరిశ్రమల్లో పనిచేయడం మంచిదని రామచంద్రన్ విద్యార్థులకు సూచించారు.