6 తీస్తే 500 మనదే
భారత్ స్పిన్ వేట మళ్లీ మొదలైంది... ఒక వైపు అశ్విన్, మరోవైపు జడేజా చెలరేగుతుంటే... ఇటు పరుగులూ తీయలేక, అటు వరుసగా వికెట్లు కోల్పోతూ న్యూజిలాండ్ దాదాపుగా ‘సమర్పయామి’ అనేసింది. చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేని అసాధ్యమైన విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు నాలుగో రోజు ముగిసేసరికి తలవంచగా... చరిత్రాత్మక 500వ టెస్టులో విజయానికి భారత్ మరో 6 వికెట్ల దూరంలో నిలిచింది. వర్షసూచన కూడా లేకపోవడంతో చివరి రోజు కోహ్లి సేన గెలుపు లాంఛనమే.
అద్భుతమైన స్పిన్‌తో సొంతగడ్డపై ఎదురులేకుండా సాగుతున్న అశ్విన్ మరోసారి అదే జోరులో తొలి మూడు వికెట్లు తీసి కివీస్‌ను కుప్పకూల్చగా... తోడుగా నేనున్నానంటూ జడేజా కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తూ బ్యాట్స్‌మెన్ పూర్తిగా పరుగులు చేయకుండా నిరోధించాడు. తన తొలి 7 ఓవర్లలో ఒకే బౌండరీతో 8 పరుగులు ఇచ్చిన జడేజా... తర్వాతి 7 ఓవర్లను వరుసగా మెయిడిన్‌గా వేయడం విశేషం. అతను వేసిన 84 బంతుల్లో 81 బంతులకు కివీస్ పరుగు తీయలేకపోయిందంటే బౌలింగ్ ఎలా సాగిందో అర్థమవుతుంది.
విజయం దిశగా భారత్ vs న్యూజిలాండ్ లక్ష్యం 434
ప్రస్తుతం 93/4 200 వికెట్ల క్లబ్లో అశ్విన్
కాన్పూర్: గ్రీన్‌పార్క్ గ్రౌండ్లో బంతి మరోసారి గింగిరాలు తిరిగింది. ఈసారీ దానిని అడ్డుకోవడం న్యూజిలాండ్ వల్ల కాలేదు. ఫలితంగా తొలి టెస్టులో భారత్ విజయానికి చేరువైంది. తమ 500వ టెస్టును చిరస్మరణీయం చేసుకునే దిశగా కోహ్లి సేన మరో ముందడుగు వేసింది. 434 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 93 పరుగులు చేసింది. ఇప్పటికే ప్రధాన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరిన నేపథ్యంలో ఆ జట్టు మరో 341 పరుగులు చేయడం ఊహించలేనిది! వర్షం ఆటంకం కలిగిస్తే తప్ప ‘డ్రా‘ కోసం ప్రయత్నించినా కివీస్ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్ల ముందు నిలిచే అవకాశం దాదాపుగా లేదు. ప్రస్తుతం క్రీజులో రోంచీ (38 బ్యాటింగ్), సాన్‌ట్నర్ (8 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్‌సను 5 వికెట్ల నష్టానికి 377 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రోహిత్ శర్మ (68 నాటౌట్; 8 ఫోర్లు), రవీంద్ర జడేజా (50 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరో వికెట్‌కు 18.3 ఓవర్లలోనే అభేద్యంగా 100 పరుగులు జోడించడం విశేషం.
తొలి సెషన్: రాణించిన కివీస్ బౌలర్లు
నాలుగోరోజు భారత్ ఆట ప్రారంభించిన సమయం నుంచే చాలా సందర్భాల్లో బంతి అనూహ్యంగా టర్న్ అరుుంది. దాంతో బ్యాట్స్‌మెన్ పదే పదే ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్నారు. 159/1 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన జట్టు తక్కువ వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. సాన్‌ట్నర్ బంతికి విజయ్ (76; 8 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ల ముందు దొరికిపోవడంతో 133 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి (18) సోధి బౌలింగ్‌లో స్వీప్ చేయబోయి వెనుదిరగ్గా... కొద్ది సేపటికే పుజారా (78; 10 ఫోర్లు)ను కూడా సోధి అవుట్ చేశాడు. ఆ తర్వాత రహానే, రోహిత్ కలిసి భారత్ ఆధిక్యాన్ని 300 పరుగులు దాటించారు.
ఓవర్లు: 34, పరుగులు: 93, వికెట్లు: 3
రెండో సెషన్: రోహిత్, జడేజా జోరు
లంచ్ తర్వాత రహానే (40; 4 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే సాన్‌ట్నర్ బౌలింగ్‌లో టేలర్ అద్భుత క్యాచ్ పట్టడంతో అతని ఇన్నింగ్స ముగిసింది. ఈ దశలో జత కలిసిన రోహిత్, జడేజా ధాటిగా ఆడారు. బౌండరీలతో చకచకా పరుగులు సాధించిన రోహిత్, 75 బంతుల్లో అర్ధ సెంచరీతో పాటు టెస్టుల్లో వేయి పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరో వైపు జడేజా కూడా దూకుడును ప్రదర్శించాడు. సోధి బౌలింగ్‌లోనే అతను మూడు భారీ సిక్సర్లతో అలరించాడు. 58 బంతుల్లో జడేజా హాఫ్ సెంచరీ పూర్తి కాగానే కోహ్లి ఇన్నింగ్‌సను డిక్లేర్ చేశాడు.
ఓవర్లు: 26.2, పరుగులు: 125, వికెట్లు: 1
మూడో సెషన్: అశ్విన్ హవా
దాదాపు అసాధ్యమైన విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ అశ్విన్ దెబ్బకు కుదేలైంది. ఈ ఆఫ్ స్పిన్నర్ తన రెండో ఓవర్లోనే రెండు వికెట్లు తీశాడు. స్వీప్ చేయబోరుు గప్టిల్ (0) సిల్లీ పాయింట్లో క్యాచ్ ఇవ్వగా, మరో నాలుగు బంతుల తర్వాత లాథమ్ (2) చిక్కాడు. విలియమ్సన్ (25) కూడా ఎల్బీగా వెనుదిరగడంతో అశ్విన్ కెరీర్లో 200వ వికెట్ చేరింది. రెండో ఎండ్ నుంచి జడేజా బ్యాట్స్‌మెన్‌కు అసలు పరుగులు తీసే అవకాశమే ఇవ్వలేదు. ఈ మధ్యలో కివీస్ బ్యాట్స్‌మెన్ కొన్ని ఎల్బీ అప్పీళ్లు, క్యాచ్లనుంచి కూడా అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు. అరుుతే టీమ్‌లో అత్యంత అనుభవజ్ఞుడైన రాస్ టేలర్ (17) చేసిన తప్పు జట్టును మరింత కష్టాల్లో పడేసింది. అశ్విన్ బౌలింగ్‌లో రోంచీ షాట్ కొట్టగా, రెండో పరుగు కోసం ప్రయత్నించిన టేలర్ రనౌటయ్యాడు. డీప్ మిడ్ వికెట్ నుంచి ఉమేశ్ విసిరిన త్రో నేరుగా వికెట్లను తాకే సమయానికి టేలర్ క్రీజ్‌లోకి వచ్చినా... నిర్లక్ష్యంతో బ్యాట్‌ను కింద పెట్టలేదు! ఆ తర్వాత రోంచీ, సాన్‌ట్నర్ మరో 15.3 ఓవర్లు జాగ్రత్తగా ఆడారు.
ఓవర్లు: 37, పరుగులు: 93, వికెట్లు: 4
స్కోరు వివరాలు
భారత్ తొలిఇన్నింగ్స్: 318, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స: 262, భారత్ రెండో ఇన్నింగ్స: రాహుల్ (సి) టేలర్ (బి) సోధి 38; విజయ్ (ఎల్బీ) (బి) సాన్‌ట్నర్ 76; పుజారా (సి) టేలర్ (బి) సోధి 78; కోహ్లి (సి) సోధి (బి) క్రెరుుగ్ 18; రహానే (సి) టేలర్ (బి) సాన్‌ట్నర్ 40; రోహిత్ (నాటౌట్) 68; జడేజా (నాటౌట్) 50; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (107.2 ఓవర్లలో 5 వికెట్లకు డిక్లేర్డ్) 377.
వికెట్ల పతనం: 1-52; 2-185; 3-214; 4-228; 5-277.
బౌలింగ్: బౌల్ట్ 9-0-34-0; సాన్‌ట్నర్ 32.2-11-79-2; క్రెరుుగ్ 23-3-80-1; వాగ్నర్ 16-5-52-0; సోధి 20-2-99-2; గప్టిల్ 4-0-17-0; విలియమ్సన్ 3-0-7-0
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ : లాథమ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 2; గప్టిల్ (సి) విజయ్ (బి) అశ్విన్ 0; విలియమ్సన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 25; టేలర్ (రనౌట్) 17; రోంచి (బ్యాటింగ్) 38; సాన్‌ట్నర్ (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (37 ఓవర్లలో 4 వికెట్లకు) 93.
వికెట్ల పతనం: 1-2; 2-3; 3-43; 4-56.; బౌలింగ్: షమీ 4-2-6-0; అశ్విన్ 16-1-68-3; జడేజా 14-10-8-0; ఉమేశ్ 3-0-9-0.
అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన బౌలర్లలో అశ్విన్ రెండో స్థానంలో (37 టెస్టులు) నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన క్లారీ గ్రిమ్మెట్ 36 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు. భారత్ తరఫున ఈ మైలురారుు అందుకున్న 9వ ఆటగాడు అశ్విన్.
‘కెరీర్ ఆరంభంలోనే నాకు చాలా విషయాలు తెలిసొచ్చారుు. దాదాపు ఏడాదిన్నర పాటు జట్టుకు దూరమయ్యాను. అదే సమయం నాకు పాఠాలు నేర్పింది. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తీసిన గత వంద వికెట్లు ఎంతో సంతృప్తినిచ్చారుు. రికార్డుల గురించి పట్టించుకోకుండా నాతో నేను పోటీ పడటాన్నే ఇష్ట పడతాను. నా ఆట పట్ల గర్వంగా ఉన్నా. ఐదేళ్ల కెరీర్లో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి కొన్ని బాధాకర క్షణాల గురించి ఆలోచించడం అనవసరం. నా ఘనతల గురించి అప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది. దురదృష్టవశాత్తూ మన దేశంలో పిచ్‌లపైనే ఎక్కువగా చర్చ జరిగి, మా విజయాలను తక్కువగా చూస్తారు.’
- అశ్విన్