IND Vs NZ 2nd ODI 2023: Raipur Stadium To Host Its First International Cricket Match - Sakshi
Sakshi News home page

IND Vs NZ 2nd ODI: మరో హోరాహోరీకి రె‘ఢీ’

Published Sat, Jan 21 2023 4:50 AM | Last Updated on Sat, Jan 21 2023 1:09 PM

IND vs NZ 2023: Raipur stadium to host its first international cricket match - Sakshi

రాయ్‌పూర్‌లోని షహీద్‌ వీర్‌నారాయణ్‌ సింగ్‌ స్టేడియం... 60 వేలకు పైగా సామర్థ్యంతో దేశంలోని మూడో అతి పెద్ద క్రికెట్‌ మైదానం... ఇప్పుడు తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమైంది. అయితే భారత్, న్యూజిలాండ్‌ రెండో వన్డేపై ఆసక్తి పెరిగేందుకు ఇది మాత్రమే కారణం కాదు. బుధవారం హైదరాబాద్‌ మ్యాచ్‌ అందించిన వినోదం ఈ సిరీస్‌ను ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేసింది. భారత్‌ ఏకపక్ష విజయం సాధించి ఉంటే... కివీస్‌ 131/6 నుంచి గెలుపు అంచుల దాకా వెళ్లకుండా ఉంటే ఈ మ్యాచ్‌కు ఇంత ఆకర్షణ వచ్చి ఉండేది కాదేమో! ఈ నేపథ్యంలో మరోసారి ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లో అదే తరహాలో పరుగుల వరద పారుతుందా అనేది చూడాలి.   

రాయ్‌పూర్‌: సొంతగడ్డపై మరో వన్డే సిరీస్‌ను గెలుచుకునే లక్ష్యంతో భారత జట్టు తమ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగే రెండో వన్డేలో గెలిస్తే సిరీస్‌ టీమిండియా ఖాతాలో చేరుతుంది. మరోవైపు పట్టుదలకు మారుపేరైన కివీస్‌ గత మ్యాచ్‌లో చేజారిన విజయాన్ని అందుకొని సిరీస్‌ సమం చేయాలని భావిస్తోంది. తొలి వన్డేలో ఇరు జట్ల ఆట, బలాబలాలను చూస్తే హోరాహోరీ పోరు ఖాయం.  

ఉమ్రాన్‌కు చాన్స్‌!
ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఒకేసారి ముగ్గురు ‘డబుల్‌ సెంచూరియన్‌’లు భారత తుది జట్టులో ఆడబోతుండటం విశేషం. ఇది భారత బ్యాటింగ్‌ బలాన్ని చూపిస్తోంది. రోహిత్, గిల్‌ ఓపెనర్లుగా మెరుపు ఆరంభం అందిస్తే టీమిండియాకు తిరుగుండదు. గత మ్యాచ్‌లో విఫలమైనా... కోహ్లి ఎప్పుడైనా చెలరేగిపోగలడు కాబట్టి సమస్య లేదు. మిడిలార్డర్‌లో ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్‌ బాగా ఆడటం జట్టుకు కీలకం.  ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యా గత కొంత కాలంగా తగిన న్యాయం చేయలేకపోతున్నాడు. బౌలింగ్‌లో సిరాజ్‌ మినహా మిగతా వారంతా విఫలమవుతున్నారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పనికొస్తాడని తొలి వన్డేలో శార్దుల్‌ను తీసుకున్నారు. అయితే అది పెద్దగా ఫలితం చూపలేదు. దానికంటే రెగ్యులర్‌ బౌలర్‌కే అవకాశం ఇవ్వడం మంచిదని భావిస్తే మూడో పేసర్‌గా ఉమ్రాన్‌ జట్టులోకి తిరిగొస్తాడు.  

సోధి ఆడతాడా!
న్యూజిలాండ్‌ పోరాటపటిమ ఏమిటో తొలి వన్డేలోనే కనిపించింది. ప్రధాన బ్యాటర్లంతా విఫలమైనా... అనామకుడు అనుకున్న మైకేల్‌ బ్రేస్‌వెల్‌ తన విధ్వంసకర బ్యాటింగ్‌ను చూపించాడు. స్పిన్నర్‌ సాన్‌ట్నర్‌ కూడా బ్యాటింగ్‌తో జట్టుకు ఉపయోగపడగలనని నిరూపించుకున్నాడు. ఇదే ఆర్డర్‌ను చూసుకుంటే ఎనిమిదో స్థానం వరకు ఆ జట్టులో బ్యాటర్లకు కొదవ లేదు. గత మ్యాచ్‌లో విఫలమైనా... అలెన్, ఫిలిప్స్‌ మెరుపు షాట్లతో చెలరేగిపోగల సమర్థులు. కాన్వే, కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే న్యూజిలాండ్‌ గట్టి పోటీనివ్వగలదు. ఫాస్టెస్ట్‌ బౌలర్లలో ఒకడైన ఫెర్గూసన్‌ను గిల్‌ చితక్కొట్టాడు. ఇలాంటి స్థితిలో లెగ్‌స్పిన్నర్‌ ఇష్‌ సోధి గాయం  నుంచి కోలుకోవాలని జట్టు ఆశిస్తోంది.

పిచ్, వాతావరణం
స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌. పిచ్‌పై బౌన్స్‌ కొంత ఎక్కువగా కనిపిస్తోంది. అటు బ్యాటర్లు, ఇటు బౌలింగ్‌కూ అనుకూలం. వర్ష సూచన లేదు.

భారత జట్టుకు జరిమానా
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత సమయంలో మూడు ఓవర్లు తక్కువగా వేసింది. దాంతో ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 60 శాతం కోత విధిస్తున్నట్లు రిఫరీ జవగల్‌ శ్రీనాథ్‌ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement