international match
-
IPL 2025: ఐపీఎల్లో విలువ పెరిగింది
భారత క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలనేది ప్రతీ యువ క్రికెటర్ కల. ప్రతిభకు తోడు శ్రమ, పట్టుదల, పోరాటంతో సత్తా చాటి గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు కుర్రాళ్లకు ఆదివారం అలాంటి గొప్ప అవకాశం వచి్చంది. ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఢిల్లీ పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ బంగ్లాదేశ్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్ల టీమిండియా తరఫున ‘బ్లూ జెర్సీ’లో ఆడటం మాత్రమే కాదు... వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా తమ విలువను అమాంతం పెంచుకున్నారు. వీరిద్దరిని వచ్చే సీజన్ కోసం భారీ మొత్తం చెల్లించి ఆయా ఫ్రాంచైజీలు కొనసాగిస్తాయా అనేది ఆసక్తికరం. ఐపీఎల్–2025 వేలానికి ముందు ఫ్రాంచైజీలు తాము కొనసాగించే ఆటగాళ్ల పేర్లను వెల్లడించేందుకు ఈ నెల 31 వరకు గడువు విధించారు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. ఈ సిరీస్‌కు ముందు వరకు వీరిద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లే. ఇప్పుడు భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంతో ‘క్యాప్డ్’ ప్లేయర్లుగా మారిపోయారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం గత ఐపీఎల్లో ఆడి వచ్చే ఐపీఎల్ వేలానికి ముందు భారత్‌కు ఆడితే ‘క్యాప్డ్ ప్లేయర్’గా అతనికి సంబంధించిన వేలం నిబంధనలన్నీ మారిపోతాయి. 2024 సీజన్లో నితీశ్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున, మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడారు. నిబంధనలు ఇలా... ఐపీఎల్–2025 కోసం గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను టీమ్‌కు కొనసాగించేందుకు అవకాశం ఉంది. ఇందులో కనీసం ఒకరైనా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ అయి ఉండాలి. కొనసాగించే తొలి ముగ్గురు ప్లేయర్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ.11 కోట్లు చొప్పున ఫ్రాంచైజీలు చెల్లించాలి. ఆ తర్వాత నాలుగో, ఐదో ఆటగాడికి ఇదే వరస కొనసాగుతుంది. అంటే రూ. 18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాలి. ఈ ఐదుగురు అంతర్జాతీయ ప్లేయర్లు అయి ఉంటే ఆరో ఆటగాడు కచి్చతంగా ‘అన్క్యాప్డ్’ అవుతాడు. అతనికి కనీసం రూ.4 కోట్లు ఇవ్వాలి. ఐదుగురుని అట్టి పెట్టుకోకుండా ముగ్గురు చాలు అని భావించే ఫ్రాంచైజీలకు అవకాశం ఇచ్చేందుకు కూడా రెండు దశలుగా ఈ మొత్తాలను నిర్ణయించారు. వీరికి అవకాశం ఉందా... నితీశ్ రెడ్డి గత ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 142.92 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేసిన అతను ఏకంగా 21 సిక్సర్లు బాదాడు. దీని ప్రకారం చూస్తే ‘అన్క్యాప్డ్’గా అతడిని కనీసం రూ. 4 కోట్లకు హైదరాబాద్ కొనసాగించే అవకాశం కనిపించింది. అయితే ఇప్పుడు క్యాప్డ్ కావడంతో తొలి ఐదుగురు ఆటగాళ్లలో ఒకరిగా ఎంచుకోవాలి. కమిన్స్, హెడ్, క్లాసెన్, అభిõÙక్ శర్మవంటి ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో నితీశ్‌ను కనీసం ఐదో ఆటగాడిగా రూ. 11 కోట్లకు కొనసాగిస్తారా అనేది సందేహమే! అతడిని విడుదల చేసి వేలంలో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా సొంతం చేసుకునేందుకు సన్‌రైజర్స్‌కు మరో అవకాశం ఉంటుంది. మయాంక్ విషయంలో మాత్రం లక్నో సానుకూలంగా ఉండవచ్చు. గత సీజన్లో ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా అతను తన వేగంతో ఎంతో ప్రభావం చూపించాడు. కేవలం 12.14 సగటుతో 7 వికెట్లు తీశాడు. ఇప్పుడు భారత్ తరఫున ఆడిన తర్వాత అలాంటి ఆటగాడిని వదులుకునేందుకు సూపర్ జెయింట్స్ ఇష్టపడకపోవచ్చు. లక్నో మెంటార్‌గా ఉన్న జహీర్ ఖాన్ కూడా మయాంక్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కాబట్టి కనీసం ఐదో ప్లేయర్‌గా రూ.11 కోట్లు చెల్లించి తమతో కొనసాగించవచ్చు. ఇద్దరిలో ఎవరినీ ఇరు జట్లు కొనసాగించకపోయినా...వేలంలోకి వెళితే భారీ మొత్తం లభించేందుకు కూడా ఆస్కారం ఉంది. కల నిజమైంది: నితీశ్ రెడ్డి గ్వాలియర్: భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ సంతోషం వెలిబుచ్చారు. తమ కెరీర్లో ఇది అత్యుత్తమ క్షణంగా అభివర్ణించారు. తమపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఎంతో ప్రోత్సహించినట్లు ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు వెల్లడించారు. ‘భారత్‌లో క్రికెట్ ఆడే ఎవరికైనా ఇది అద్భుతంలాగే అనిపిస్తుంది. టీమిండియా తరఫున ఆడే అవకాశం రావడంతో నా కల నిజమైనట్లుగా భావించాను. సహజంగానే కొంత ఉత్కంఠ, ఆందోళన ఉన్నా ఆ తర్వాత మెల్లగా ఆటను ఆస్వాదించాను. నాకూ, నా కుటుంబానికి ఇది గర్వకారణమైన క్షణం. టీమ్‌లో చాలా మంది సీనియర్ ఆటగాళ్లతో పాటు కోచింగ్ బృందం నుంచి మంచి మద్దతు లభించింది. బౌలింగ్‌లోనూ నాకు మంచి సూచనలు లభించాయి. కెపె్టన్ సూర్య నాపై ఎలాంటి ఒత్తిడి దరి చేరకుండా ప్రశాంతంగా బౌలింగ్ చేసే అవకాశం కలి్పంచాడు. తొలి మ్యాచ్ అనిపించకుండా స్వేచ్ఛగా ఆడమని చెప్పాడు’ అని నితీశ్ రెడ్డి వివరించాడు. తొలి మ్యాచ్‌లో మయాంక్ కూడా భావోద్వేగభరితమయ్యాడు. ‘నేను మ్యాచ్ ఆడుతున్నానని తెలియగానే గత నాలుగు నెలలు నా కళ్ల ముందు మెదిలాయి. పైగా గాయం నుంచి కోలుకొని వస్తున్నాను కాబట్టి అదనపు ఒత్తిడి నాపై ఉంది. అయితే కెప్టెన్ సూర్య నేను రనప్ తీసుకుంటున్న సమయంలో నా వద్దకు వచ్చి నువ్వు ఎలా బౌలింగ్ చేయగలనని భావిస్తోవో అలాగే చేయి అతని ధైర్యం నింపాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో గతంలో పని చేసిన అనుభవం కూడా పనికొచి్చంది’ అని మయాంక్ చెప్పాడు. – సాక్షి క్రీడా విభాగం -
IND vs NZ 2023: మరో హోరాహోరీకి రె‘ఢీ’
రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్‌నారాయణ్ సింగ్ స్టేడియం... 60 వేలకు పైగా సామర్థ్యంతో దేశంలోని మూడో అతి పెద్ద క్రికెట్ మైదానం... ఇప్పుడు తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమైంది. అయితే భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేపై ఆసక్తి పెరిగేందుకు ఇది మాత్రమే కారణం కాదు. బుధవారం హైదరాబాద్ మ్యాచ్ అందించిన వినోదం ఈ సిరీస్‌ను ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేసింది. భారత్ ఏకపక్ష విజయం సాధించి ఉంటే... కివీస్ 131/6 నుంచి గెలుపు అంచుల దాకా వెళ్లకుండా ఉంటే ఈ మ్యాచ్‌కు ఇంత ఆకర్షణ వచ్చి ఉండేది కాదేమో! ఈ నేపథ్యంలో మరోసారి ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లో అదే తరహాలో పరుగుల వరద పారుతుందా అనేది చూడాలి. రాయ్‌పూర్: సొంతగడ్డపై మరో వన్డే సిరీస్‌ను గెలుచుకునే లక్ష్యంతో భారత జట్టు తమ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగే రెండో వన్డేలో గెలిస్తే సిరీస్ టీమిండియా ఖాతాలో చేరుతుంది. మరోవైపు పట్టుదలకు మారుపేరైన కివీస్ గత మ్యాచ్‌లో చేజారిన విజయాన్ని అందుకొని సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. తొలి వన్డేలో ఇరు జట్ల ఆట, బలాబలాలను చూస్తే హోరాహోరీ పోరు ఖాయం. ఉమ్రాన్‌కు చాన్స్! ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఒకేసారి ముగ్గురు ‘డబుల్ సెంచూరియన్’లు భారత తుది జట్టులో ఆడబోతుండటం విశేషం. ఇది భారత బ్యాటింగ్ బలాన్ని చూపిస్తోంది. రోహిత్, గిల్ ఓపెనర్లుగా మెరుపు ఆరంభం అందిస్తే టీమిండియాకు తిరుగుండదు. గత మ్యాచ్‌లో విఫలమైనా... కోహ్లి ఎప్పుడైనా చెలరేగిపోగలడు కాబట్టి సమస్య లేదు. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడటం జట్టుకు కీలకం. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా తగిన న్యాయం చేయలేకపోతున్నాడు. బౌలింగ్‌లో సిరాజ్ మినహా మిగతా వారంతా విఫలమవుతున్నారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పనికొస్తాడని తొలి వన్డేలో శార్దుల్‌ను తీసుకున్నారు. అయితే అది పెద్దగా ఫలితం చూపలేదు. దానికంటే రెగ్యులర్ బౌలర్‌కే అవకాశం ఇవ్వడం మంచిదని భావిస్తే మూడో పేసర్‌గా ఉమ్రాన్ జట్టులోకి తిరిగొస్తాడు. సోధి ఆడతాడా! న్యూజిలాండ్ పోరాటపటిమ ఏమిటో తొలి వన్డేలోనే కనిపించింది. ప్రధాన బ్యాటర్లంతా విఫలమైనా... అనామకుడు అనుకున్న మైకేల్ బ్రేస్‌వెల్ తన విధ్వంసకర బ్యాటింగ్‌ను చూపించాడు. స్పిన్నర్ సాన్‌ట్నర్ కూడా బ్యాటింగ్‌తో జట్టుకు ఉపయోగపడగలనని నిరూపించుకున్నాడు. ఇదే ఆర్డర్‌ను చూసుకుంటే ఎనిమిదో స్థానం వరకు ఆ జట్టులో బ్యాటర్లకు కొదవ లేదు. గత మ్యాచ్‌లో విఫలమైనా... అలెన్, ఫిలిప్స్ మెరుపు షాట్లతో చెలరేగిపోగల సమర్థులు. కాన్వే, కెప్టెన్ టామ్ లాథమ్ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే న్యూజిలాండ్ గట్టి పోటీనివ్వగలదు. ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడైన ఫెర్గూసన్‌ను గిల్ చితక్కొట్టాడు. ఇలాంటి స్థితిలో లెగ్‌స్పిన్నర్ ఇష్ సోధి గాయం నుంచి కోలుకోవాలని జట్టు ఆశిస్తోంది. పిచ్, వాతావరణం స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. పిచ్‌పై బౌన్స్ కొంత ఎక్కువగా కనిపిస్తోంది. అటు బ్యాటర్లు, ఇటు బౌలింగ్‌కూ అనుకూలం. వర్ష సూచన లేదు. భారత జట్టుకు జరిమానా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత సమయంలో మూడు ఓవర్లు తక్కువగా వేసింది. దాంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధిస్తున్నట్లు రిఫరీ జవగల్ శ్రీనాథ్ ప్రకటించారు. -
289 రోజుల తర్వాత...
భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. టీమిండియా ఎప్పుడెప్పుడా మైదానంలోకి దిగుతుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ నేటినుంచి మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ను ఆస్వాదించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఐపీఎల్ కావాల్సినంత వినోదం పంచినా... జాతీయ జట్టు మ్యాచ్‌లు ఆడేటప్పుడు ఉండే లెక్కే వేరు... కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం తల్లడిల్లిపోవడంతో ఆగిపోయిన భారత జట్టు ఆట ఇప్పుడు ఆసీస్ గడ్డపై మళ్లీ మొదలు కానుంది. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్ ఆడిన అనంతరం సుమారు తొమ్మిదిన్నర నెలల తర్వాత టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్ కోసం మళ్లీ మైదానంలోకి దిగుతోంది. ఆస్ట్రేలియా జట్టును వారి వేదికపైనే వన్డేలో ‘ఢీ’కొడుతోంది. అన్నింటికి మించి కోవిడ్–19 తర్వాత తొలిసారి ఈ మ్యాచ్‌తోనే మైదానంలోకి ప్రేక్షకులను అనుమతిస్తుండటం విశేషం. సిడ్నీ: కరోనా వైరస్ తెచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి సేన తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. రాబోయే బోర్డర్–గావస్కర్ ట్రోఫీ, వచ్చే రెండేళ్లలో జరిగే రెండు టి20 ప్రపంచ కప్‌ల నేపథ్యంలో వన్డే పోరుకు ప్రాధాన్యత తక్కువగా కనిపిస్తున్నా... రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య జరిగే పోరు అభిమానులకు ఎప్పుడూ ఆసక్తికరమే. కొత్తగా మొదలైన ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో ఈ సిరీస్ కూడా భాగం. సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టేడియంలోకి 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. మరోవైపు 1992 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు ధరించిన జెర్సీని పోలిన (రెట్రో) డ్రెస్‌లతోనే బరిలోకి దిగుతుండటం ఆకర్షణీయాంశం. మయాంక్‌కు అవకాశం భారత జట్టు ఆడిన ఆఖరి వన్డే తుది జట్టును చూస్తే రెండు మార్పులు ఖాయమయ్యాయి. వన్డేల్లో చోటు కోల్పోయిన పృథ్వీ షా స్థానంలో సీనియర్ శిఖర్ ధావన్ ఓపెనర్‌గా రానున్నాడు. అతనికి జోడీగా మయాంక్ అగర్వాల్ బరిలోకి దిగుతాడు. మరో ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ అందుబాటులో ఉన్నా... మయాంక్ దూకుడైన శైలి అతనికి అవకాశం కల్పించవచ్చు. తర్వాతి స్థానాల్లో కోహ్లి, అయ్యర్లు భారత బ్యాటింగ్ భారాన్ని మోయాల్సి ఉండగా... ఐదో స్థానంలో రాహుల్ ఖాయం. కాబట్టి వికెట్ కీపర్‌గా కూడా అతనే బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఆరో స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే బదులుగా హార్దిక్ పాండ్యా ఆడే అవకాశం ఉంది. అయితే ఐపీఎల్లో ఒక్క బంతి కూడా బౌలింగ్ చేయని పాండ్యాను ఆల్‌రౌండర్‌గా ఆడించాలా లేక పాండేను కొనసాగించాలా అనే విషయంలో టీమ్ మేనేజ్మెంట్కు ఇంకా స్పష్టత రాలేదు. పైగా 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత హార్దిక్ ఇప్పటి వరకు మరో వన్డే మ్యాచ్ ఆడలేదు. పేసర్లుగా బుమ్రా, షమీ ఖాయం కాగా... మూడో పేసర్ స్థానం కోసం శార్దుల్, సైనీ మధ్య పోటీ ఉంది. భారత జట్టు తాము ఆడిన చివరి వన్డే సిరీస్‌లో (న్యూజిలాండ్ చేతిలో) 0–3తో ఓటమి పాలైంది. ఐపీఎల్లో ఆడినా... చాలా రోజుల తర్వాత ఆడుతున్న వన్డే ఫార్మాట్‌కు అనుగుణంగా మారి మన ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన ఇస్తారనేది ఆసక్తికరం. స్మిత్ పునరాగమనం సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఎప్పుడైనా బలమైన జట్టే. ఇప్పుడు మళ్లీ కంగారూలు సమష్టిగా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్ కంటే ముందు ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపై ఆస్ట్రేలియా 2–1తో ఓడించి వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. టెస్టుల్లో ‘కన్కషన్’కు గురైన స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ ఆ మూడు వన్డేల్లోనూ ఆడలేదు. అతను ఇప్పుడు మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్లో ఘోరంగా విఫలమైనా జాతీయ జట్టు తరఫున మ్యాక్స్‌వెల్ ఆటను తక్కువగా అంచనా వేయలేం. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కూడా అతను రెండు అద్భుత ఇన్నింగ్స్‌లు (59 బంతుల్లో 77 – 90 బంతుల్లో 108) ఆడాడు. కాబట్టి ఏడో స్థానంలో వచ్చే మ్యాక్స్‌వెల్ వరకు ఆసీస్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. వార్నర్, కొత్త కెరటం లబ్‌షేన్‌లతో పాటు ఐపీఎల్లో అదరగొట్టిన స్టొయినిస్ జట్టు బలం. పేస్ త్రయం స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్‌లను ఎదుర్కోవడం భారత జట్టుకు అంత సులువు కాదు. అయితే గత పర్యటనలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు వన్డేల్లోనూ భారత్ నెగ్గడం విశేషం. ‘ముగిసిన సాఫ్ట్ క్వారంటైన్’ సిడ్నీలో భారత క్రికెటర్లకు కాస్త ఊరట లభించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్ ముగియడంతో గురువారం జట్టు సభ్యులంతా మరో హోటల్లోకి మారారు. ‘సాఫ్ట్ క్వారంటైన్’ నిబంధనల ప్రకారం ఆటగాళ్లంతా మైదానంలో కలిసి ప్రాక్టీస్ చేయడం మినహా హోటల్లో కూడా మరొకరిని కలవరాదు. ఎవరి గదుల్లో వారు ఒంటరి పక్షుల్లా ఉండాల్సిందే. ఇప్పుడు వీరికి కొన్ని సడలింపులు లభిస్తాయి. కొత్త హోటల్లో కూడా బయో సెక్యూర్ బబుల్‌లోనే ఉన్నా సహచర క్రికెటర్లతో కలిసి మాట్లాడుకునేందుకు, కలిసి భోజనం చేసేందుకు అవకాశం ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, మయాంక్, అయ్యర్, రాహుల్, హార్దిక్, జడేజా, షమీ, బుమ్రా, శార్దుల్/సైనీ, చహల్. ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), వార్నర్, స్మిత్, లబ్‌షేన్, స్టొయినిస్, క్యారీ, మ్యాక్స్‌వెల్, కమిన్స్, స్టార్క్, జంపా, హాజల్‌వుడ్. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. గత 7 వన్డేల్లో 6 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. వాతావరణం బాగుంది. వర్ష సూచన లేదు. సిడ్నీ మైదానంలో భారత జట్టు ఆస్ట్రేలియాపై 2 మ్యాచ్‌లు గెలిచి 14 ఓడింది. ఇక్కడ ఆడిన 5 మ్యాచ్‌లలో కలిపి కోహ్లి మొత్తం 36 పరుగులే చేశాడు. ఇటీవల మరణించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్‌కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు నిమిషం పాటు మౌనం పాటించడంతో పాటు భుజాలకు నలుపు రంగు బ్యాండ్లు ధరించి బరిలోకి దిగుతారు. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని మేం భావిస్తున్నాం. ఆస్ట్రేలియాలాంటి చోట ఆడాలని వారెంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తమ సత్తా చాటేందుకు, స్థాయిని పెంచుకునేందుకు వారికి ఇది సరైన వేదిక. బుమ్రా, షమీలకు తగినంత విశ్రాంతి ఇవ్వాలనేది టీమ్ మేనేజ్మెంట్ ఆలోచన. వారి స్థానాల్లో కుర్రాళ్లు ఆడతారు. ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తుంది. కాబట్టి సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయం. అయితే వారిని ఓడించేందుకు మాకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రేరణా అవసరం లేదు. మేం అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. టూర్లో శుభారంభం చేస్తే మంచిదే కానీ అదే సర్వస్వం కాదు. ప్రతీ మ్యాచ్ మాకు కీలకమే. –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
క్రికెట్‌కు నమో నమః
సరిగ్గా 116 రోజుల చదివింపుల తర్వాత సగటు క్రికెట్ అభిమానికి కూసింత ఆనందం. ఏ దేశం ఆడితేనేమి... జట్టులో ఎవరుంటేనేమి... కాస్త క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం గురించి మాట్లాడుకునే అవకాశం... స్కోరు ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి... ఇన్ని రోజులూ పాత చద్ది వార్తలే చదువుతూ, నాటి ఘనతల గురించే వింటూ వచ్చిన వారికి ఇదో ఊరట. ఎప్పుడో నమిలి మింగేసిన స్కోర్లనే గుర్తుకు తెచ్చుకుంటూ ఇంత కాలం గడిపిన వారికి ఇన్నాళ్లకు క్రికెట్‌ను ఆసక్తిగా చూసే అవకాశం వచ్చేసింది. అవును... అంతర్జాతీయ క్రికెట్ తిరిగొచ్చింది. కోవిడ్–19 కష్టకాలం తర్వాత తొలిసారి ఆటకు రంగం సిద్ధమైంది. ఇందుకు ఇంగ్లండ్ చొరవ చూపించగా... అతిథిగా వచ్చేందుకు వెస్టిండీస్ అంగీకారం తెలిపింది. ఫలితంగా చరిత్రలో ప్రత్యేకంగా మిగిలిపోయే మ్యాచ్‌కు ఆమోద ముద్ర పడింది. మైదానంలో టచింగ్‌లు లేవు. ఉమ్మితో బంతిని రుద్దటాలు కనిపించవు. అడుగేస్తే సోషల్ డిస్టెన్సింగ్, దగ్గరికొస్తే శానిటైజింగ్... ఇలా కరోనా కట్టుబాట్లతో క్రికెట్ మొదలవుతోంది. 143 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారి ఇలాంటి పరిస్థితుల్లో ఆట జరుగుతోంది. టెస్టు క్రికెట్ అంటే పడిచచ్చే ఇంగ్లండ్‌లో ప్రేక్షకులు లేకుండా జరిగే ఈ మ్యాచ్‌తో నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో ఆటగాళ్లకు అనుభవంలోకి రానుంది. సౌతాంప్టన్: కరోనా విరామం తర్వాత అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంతర్జాతీయ క్రికెట్‌కు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి ఇక్కడి రోజ్‌బౌల్ మైదానంలో జరిగే తొలి టెస్టులో ఇంగ్లండ్‌తో వెస్టిండీస్ తలపడనుంది. సొంతగడ్డపై రికార్డు, ప్రస్తుత బలబలాలు... ఎలా చూసుకున్నా విండీస్‌కంటే ఇంగ్లండ్‌దే అన్నింటా పైచేయి. అయితే ఈ మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనకంటే ఆట జరగడంపైనే అందరి దృష్టీ నిలవనుంది. కరోనా వైరస్ విజృంభణకు ముందు మార్చి 13న సిడ్నీలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య చివరి అంతర్జాతీయ మ్యాచ్ (వన్డే) జరిగింది. ఇంగ్లండ్ బలంగా... ఇంగ్లండ్ జట్టు జనవరిలో దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్‌లో టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ సిరీస్‌ను ఇంగ్లండ్ 3–1తో గెలుచుకుంది. ఇందులో ఆడిన వారిపైనే నమ్మకముంచిన బోర్డు 13 మందితో జట్టును ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో రెగ్యులర్ కెప్టెన్ జో రూట్ ఈ టెస్టుకు దూరం కాగా... తొలిసారి బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రూట్ స్థానంలో రోరీ బర్న్స్ తుది జట్టులోకి రావడం మినహా మరో మార్పునకు అవకాశం లేదు. అయితే బర్న్స్ ఓపెనర్‌గా ఆడితే క్రాలీ నాలుగో స్థానంలో బరిలోకి దిగుతాడు. మిడిలార్డర్లో ఓలీ పాప్, జోస్ బట్లర్ రూపంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. స్టోక్స్, స్యామ్ కరన్వంటి ఆల్‌రౌండర్లతో జట్టు బలం మరింత పెరిగింది. అత్యంత అనుభవజ్ఞులైన ఇంగ్లండ్ స్టార్ బౌలర్లు అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ చెలరేగితే విండీస్‌కు కష్టాలు తప్పవు. మూడో పేసర్‌గా జోఫ్రా ఆర్చర్‌కే ఎక్కువ అవకాశం ఉన్నా... వుడ్ నుంచి అతనికి పోటీ ఎదురవుతోంది. మొత్తంగా స్వదేశంలో ఇంగ్లండ్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. విండీస్ నిలిచేనా... వెస్టిండీస్ తమ చివరి టెస్టు మ్యాచ్‌ను గత ఏడాది డిసెంబరులో అఫ్గానిస్తాన్‌తో ఆడింది. అయితే భారత్‌తో పోలిస్తే ఇంగ్లండ్ పిచ్‌లు పూర్తిగా భిన్నం కాబట్టి ఇప్పటి తుది జట్టులో మార్పులు తప్పకపోవచ్చు. ఓపెనర్లుగా క్రెయిగ్ బ్రాత్‌వైట్, క్యాంప్‌బెల్ జోడీకి మంచి రికార్డే ఉంది. ఆ తర్వాత షై హోప్, బ్రూక్స్ జట్టు బ్యాటింగ్ భారాన్ని మోస్తారు. అఫ్గాన్ జట్టుపై సెంచరీతో బ్రూక్స్ తనలోని ప్రతిభను ప్రదర్శించాడు. దూకుడుగా ఆడే హెట్‌మైర్ ఈ సిరీస్‌కు దూరంగా ఉండనుండటంతో విండీస్ బ్యాటింగ్ కొంత బలహీనపడింది. అతని స్థానంలో బ్లాక్‌వుడ్‌కు అవకాశం ఇస్తారా చూడాలి. అలా అయితే ముగ్గురు రెగ్యులర్ పేసర్లకు చోటు కల్పించడం కష్టం. ఆల్‌రౌండర్లు హోల్డర్, ఛేజ్ జట్టుకు మంచి స్కోరు అందించగలరు. ఆఫ్‌స్పిన్నర్‌గా కార్న్‌వాల్‌కు చోటు ఖాయం. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌కు విండీస్ ఎంత వరకు పోటీనిస్తుందనేది ఆసక్తికరం. మ్యాచ్ తుది ఫలితం ఎలా ఉన్నా ‘బయో సెక్యూర్ బబుల్’లో ఈ జరగనున్న ఈ మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు రాకూడదని క్రికెట్ ప్రపంచం కోరుకుంటోంది. ‘బబుల్’ మధ్యలో బద్దలు కాకుండా సిరీస్ విజయవంతంగా ముగిసి ఈ ప్రయత్నం మరిన్ని టోర్నీలకు దారి చూపాలని ఆశిస్తోంది. ఇక యూ ట్యూబ్ పాత వీడియోలు, ఆటగాళ్ల ఇన్స్టాగ్రామ్ ముచ్చట్లను పక్కన పెట్టి ఇప్పుడు అసలైన ఆటను వీక్షించేందుకు అభిమానులు రెడీగా ఉన్నారు. పిచ్, వాతావరణం సహజంగా ఇంగ్లండ్‌లో ఉండే పరిస్థితులే రోజ్‌బౌల్ పిచ్‌లోనూ ఉన్నాయి. ఆరంభంలో స్వింగ్‌కు అనుకూలం. తర్వాత బ్యాటింగ్‌కు మంచి అవకాశముంది. అయితే తొలి రెండు రోజులు సౌతాంప్టన్‌లో వర్ష సూచన ఉంది. మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించడం ఖాయం. ప్రేక్షకులు లేకపోవడంతో మైదానంలో మ్యూజిక్ వినిపిస్తారని వార్తలు వచ్చినా... అదేమీ లేదని ఈసీబీ స్పష్టం చేసింది. తుది జట్ల వివరాలు (అంచనా) ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), బర్న్స్, సిబ్లీ, డెన్లీ, క్రాలీ, పోప్, బట్లర్, బెస్, ఆర్చర్, బ్రాడ్, అండర్సన్. వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), బ్రాత్‌వైట్, హోప్, క్యాంప్‌బెల్, బ్రూక్స్, ఛేజ్, డౌరిచ్, కార్న్‌వాల్, అల్జారి జోసెఫ్, రోచ్, గాబ్రియెల్. విశేషాలు ► ఇరు జట్ల ఆటగాళ్లు బ్లాక్స్ లైవ్స్ మ్యాటర్ లోగోను తమ జెర్సీల కాలర్‌పై ధరించి బరిలోకి దిగనున్నారు. ► రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 157 టెస్టుల్లో విండీస్ 57, ఇంగ్లండ్ 49 గెలిచాయి. మరో 51 ‘డ్రా’గా ముగిశాయి. ► కీమర్ రోచ్ మరో 7 వికెట్లు తీస్తే టెస్టుల్లో 200 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. -
అయ్యో.. హార్దిక్..!
భారత జట్టు ఎంపికకు సరిగ్గా ఒక రోజు ముందు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కచ్చితంగా జట్టులోకి రాగలడని భావించిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయాడు. బోర్డు నిబంధనల ప్రకారం తన ఫిట్నెస్ నిరూపించుకునేందుకు సిద్ధమైన పాండ్యా శనివారం జరిగిన ఈ పరీక్షలో విఫలమయ్యాడు. అంతర్జాతీయ మ్యాచ్ ప్రమాణాలకు తగిన విధంగా ఫిట్నెస్ టెస్టులో సాధించాల్సిన కనీస స్కోరును అతను అందుకోలేకపోయాడు. భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఇప్పటికే ఎంపికైన అతను శనివారమే న్యూజిలాండ్ బయల్దేరాల్సి ఉంది. పాండ్యా స్థానంలో మరో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టి20లో చివరిసారిగా భారత్‌కు ఆడిన హార్దిక్ వెన్ను గాయంతో ఆటకు దూరమయ్యాడు. అతని గాయానికి శస్త్ర చికిత్స కూడా జరిగింది. ఇటీవలే కోలుకోవడంతో కివీస్ టూర్‌కు వెళ్లడం ఖాయమనిపించింది. అయితే కోలుకున్న తర్వాత అతను మళ్లీ ఒక్కసారి కూడా మైదానంలోకి దిగకపోయినా సెలక్టర్లు ‘ఎ’ జట్టుకు ఎంపిక చేశారు. -
దక్షిణ కొరియాతో మ్యాచ్ డ్రా
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు ముందు దక్షిణ కొరియా కబడ్డీ జట్లు ప్రాక్టీస్ కోసం నగరానికి తరలివచ్చాయి. అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాచుపల్లిలోని కాసాని జె.ఎస్ గెహ్లాట్ కబడ్డీ అకాడమీలో తెలంగాణ పురుషుల, మహిళల, దక్షిణకొరియా పురుషుల, మహిళల జట్ల మధ్య ఈ నెల 18 వరకు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తెలంగాణ పురుషుల, దక్షిణ కొరియా పురుషుల జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్ 38–38 పాయింట్లతో డ్రాగా ముగిసింది. ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘తెలంగాణ క్రీడాకారులకు ఇది చక్కటి అవకాశం. అంతర్జాతీయ ఆటగాళ్లతో ఆడే అవకాశం లభించడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా తెలంగాణ కబడ్డీ సంఘం చైర్మన్, ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి, ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్రావు, జగ్మోహన్, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏడు నెలల తర్వాత బరిలోకి...
కింబర్లీ: గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత మహిళల జట్టు ఏడు నెలల తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగుతోంది. సఫారీ పర్యటనలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే సోమవారం ఇక్కడ జరుగనుంది. 2021లో జరిగే ఐసీసీ ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సంపాదించేందుకు భారత్, దక్షిణాఫ్రికా జట్లకు ఇది చక్కని అవకాశం. ఏడు నెలల క్రితం వీరోచిత ప్రదర్శనతో ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన మిథాలీ రాజ్ సేనకు కావాల్సినంత విశ్రాంతి దొరికింది. ఇప్పుడు తాజాగా బరిలోకి దిగేందుకు ఈ విరామం దోహదం చేస్తుంది. ఇక ఇప్పటి నుంచి తమకు ప్రతీ మ్యాచ్ పరీక్షలాంటిదేనని భారత సారథి మిథాలీ తెలిపింది. క్రికెట్ ప్రేమికులు ఇప్పుడు మహిళల ఆటపై కూడా ఆసక్తి పెంచుకున్నారని చెప్పింది. సఫారీ గడ్డపై కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ సహచర క్రీడాకారిణిలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పింది. ఈ జట్టులో 17 ఏళ్ల ముంబై విద్యార్థిని జెమీమా రోడ్రిగ్స్ ప్రధానాకర్షణ కానుంది. దేశవాళీ క్రికెట్లో అమె అసాధారణ ఫామ్‌తో ఏకంగా సీనియర్ జట్టులోకి ఎంపికైంది. ఇప్పుడు సఫారీ పిచ్‌లపై ఆమె ఏమేరకు రాణిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. -
మొండిగా వెళ్లా!
సచిన్‌తో పోల్చడం అదృష్టం బోర్డు ‘కాంట్రాక్ట్’ శుభపరిణామం సాక్షి, హైదరాబాద్: భారత మహిళా క్రికెట్‌కు పర్యాయపదం ఆమె. 16 ఏళ్ల అత్యుత్తమ కెరీర్, 200కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లలో నిలకడైన ప్రదర్శన... నాయకురాలిగా అరుదైన విజయాలు ఆమె సొంతం. దశాబ్దన్నర కాలంగా నిలకడైన బ్యాటింగ్‌తో భారత జట్టును ముందుండి నడిపించిన మిథాలీ రాజ్ తాజాగా న్యూజిలాండ్‌పై సిరీస్ గెలుపుతో కెప్టెన్‌గా మరో ఘనతను సొంతం చేసుకుంది. వన్డేల్లో 5 వేల పరుగులు సాధించిన రెండో బ్యాట్స్‌విమన్‌గా మైలురాయిని అందుకున్న మిథాలీ... ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే... మిథాలీ ఇంటర్వ్యూ ఏ రకంగా అయినా సచిన్‌తో నన్ను పోల్చడం ఎంతో అదృష్టం. లేడీ సచిన్ అనే బిరుదు అభిమానులివ్వడం గర్వంగా ఉంది కివీస్‌పై సిరీస్ విజయం సరైన సమయంలో మాకీ విజయం దక్కింది. బీసీసీఐతో పాటు అనేక మంది మహిళా క్రికెట్‌పై దృష్టి నిలిపారు. మాకూ కాంట్రాక్ట్‌లు ఇవ్వాలనే ప్రతిపాదన నడుస్తోంది. ఇలాంటప్పుడు విజయాల ద్వారా మమ్మల్ని మేం నిరూపించుకోవాలి. గత ఏడాది దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం నిరాశ కలిగించింది. ఇప్పుడు సిరీస్ గెలిచి బోర్డు నమ్మకం నిలబెట్టినందుకు సంతోషంగా ఉంది. అయితే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోవడం కొంత నిరాశ కలిగించింది. కానీ మాకు ఇంకా 12 మ్యాచ్‌లు ఉన్నాయి కాబట్టి నేరుగా అర్హత సాధిస్తామని నమ్మకంతో ఉన్నా. బోర్డు గ్రేడింగ్ పద్ధతి ఆలస్యంగానే అయినా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మహిళా క్రికెట్‌ను మలుపు తిప్పుతుంది. ఎంత మొత్తం ఇస్తారనేది పక్కనపెడితే ప్లేయర్లలో డబ్బు గురించి ఉన్న అభద్రతా భావం తొలగిపోతుంది. ఎంత ఆడినా ఏమిటనే స్థితినుంచి ఖాయంగా డబ్బు అందుతుందనే పరిస్థితి వస్తుంది. కాబట్టి మా ప్లేయర్లు ఇంకా స్వేచ్ఛగా ఆటపై దృష్టి పెడతారు. పైగా కొత్త తరం అమ్మాయిలను కూడా క్రికెట్ ఆకర్షిస్తుంది. కొత్తగా రాబోయే లీగ్‌లు ఉమన్ బిగ్‌బాష్ లీగ్, ఇంగ్లండ్‌లో ఉమన్ టి20 లీగ్ త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఇది కూడా మరో మంచి పరిణామం. సాధారణంగా మహిళా క్రికెటర్లకు ఏడాది పొడవునా ఎక్కువగా మ్యాచ్‌లు ఉండవు. ఆడినా గుర్తింపు దక్కే అవకాశాలు తక్కువ. అదే ఇలాంటి లీగ్‌లో అయితే ఇన్స్టంట్ గుర్తింపుతో పాటు మంచి డబ్బు కూడా వస్తుంది. ఐపీఎల్‌లాగే జూనియర్లు, పెద్ద ప్లేయర్లతో కలిసి ఆడితే చాలా నేర్చుకుంటారు. వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకోవడం అమ్మాయిల క్రికెట్‌ను ఎవరూ పట్టించుకోని రోజుల్లో అటు వైపు మొండిగా వెళ్లినప్పుడు ఇక్కడివరకు వస్తానని ఊహించలేదు. కానీ చాలా కష్టపడ్డాను. ఇన్నేళ్లు నిలకడను కొనసాగించగలగడం పట్ల ఆనందంగా ఉంది. ఇక ముందు ఎంత కాలం ఆడతానో తెలీదు. కానీ ఆడినంత వరకు ఇదే తరహాలో మెరుగ్గా రాణించాలనేదే నా కోరిక. 2005 ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై 91 నాటౌట్, 2012లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ చేసిన 94 నాటౌట్ స్కోర్లు నా అత్యుత్తమ ప్రదర్శన. ‘లేడీ సచిన్’ అంటూ వస్తున్న ప్రశంసలు ఇది సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అభిమానులు ప్రేమతో చేసిన ప్రచారం. సచిన్‌లాంటి దిగ్గజంతో ఏ రకమైన పోలిక అయినా అదృష్టమే. చాలా గర్వంగా ఉంది. 5 వేల పరుగులపై సచిన్ కూడా ట్వీట్ చేశారు. అయితే నా ధ్యాసంతా మహిళా క్రికెట్ గురించే. ఘనతల గురించి కాదు కానీ నా కెరీర్ అమ్మాయిలకు స్ఫూర్తినివ్వాలనేదే నా కోరిక. -
‘అక్షరా’లా పంజాబ్‌దే...
బార్బడోస్పై నాలుగు వికెట్ల విజయం మొహాలీ: పంజాబ్ లక్ష్యం 175 పరుగులు.... చివరి 12 బంతుల్లో 25 పరుగులు చేయాలి. రాంపాల్ బౌలింగ్‌కు దిగాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పెద్దగా అనుభవం లేని అక్షర్ పటేల్ (9 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) పూనకం వచ్చినట్లు రెచ్చిపోయాడు. మూడు బౌండరీలు, ఓ సిక్సర్‌తో కేవలం ఐదు బంతుల్లోనే 19 పరుగులు చేసి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. దీంతో సీఎల్టీ20లో శనివారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో బార్బడోస్ ట్రైడెంట్సపై విజయం సాధించింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన బార్బడోస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. రైఫర్ (42 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), మునవీరా (26 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో చెలరేగారు. అవానా 3, పెరీరా 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. మిల్లర్ (34 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. సెహ్వాగ్ (25 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్), మనన్ వోహ్రా (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. చివర్లో మిల్లర్, అక్షర్ కలిసి 19 బంతుల్లో అజేయంగా 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించారు. రాంపాల్, మెండిస్ చెరో రెండు వికెట్లు తీశారు. మిల్లర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు: బార్బడోస్ ట్రైడెంట్స్ ఇన్నింగ్స్: మునవీరా (సి) వోహ్రా (బి) అవానా 50; పెర్కిన్స్ ఎల్బీడబ్ల్యు (బి) అవానా 10; రైఫర్ నాటౌట్ 60; కార్టర్ (సి) మిల్లర్ (బి) అనురీత్ 20; ఫ్రాంక్లిన్ (సి) అవానా (బి) పెరీరా 10; చిగుంబురా (సి) అనురీత్ (బి) పెరీరా 3; హోల్డర్ (సి) మిల్లర్ (బి) అవానా 12; నర్స్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1-54; 2-61; 3-106; 4-124; 5-131; 6-159. బౌలింగ్: అనురీత్ సింగ్ 4-0-32-1; అవానా 4-0-46-3; అక్షర్ పటేల్ 4-0-42-0; మాక్స్వెల్ 3-0-22-0; సెహ్వాగ్ 1-0-10-0; కరణ్వీర్ 1-0-6-0; పెరీరా 3-0-15-2 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ ఎల్బీడబ్ల్యు (బి) మెండిస్ 31; వోహ్రా (సి) కార్టర్ (బి) రాంపాల్ 27; సాహా (సి) మునవీరా (బి) ఫ్రాంక్లిన్ 14; మాక్స్వెల్ (సి) నర్స్ (బి) రాంపాల్ 16; మిల్లర్ నాటౌట్ 46; బెయిలీ (సి) ఫ్రాంక్లిన్ (బి) మెండిస్ 7; తిసారా పెరీరా (సి) కార్టర్ (బి) నర్స్ 0; అక్షర్ పటేల్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1-41; 2-76; 3-95; 4-103; 5-127; 6-131 బౌలింగ్: హోల్డర్ 3.4-0-38-0; రాంపాల్ 4-0-50-2; ఎమ్రిట్ 2-0-17-0; ఫ్రాంక్లిన్ 2-0-17-1; జీవన్ మెండిస్ 4-0-18-2; నర్స్ 4-0-32-1. -
శ్రీలంక రనౌట్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: భారత జట్టు ఫీల్డింగ్ నైపుణ్యానికి శ్రీలంక తలవంచింది. స్వల్ప లక్ష్యఛేదనలో ఆ జట్టులోని నలుగురు బ్యాట్స్‌విమెన్ రనౌట్ కావడంతో రెండో టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత మహిళల జట్టుకు విజయం దక్కింది. ఆదివారం విజయనగరంలోని పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 9 పరుగుల తేడాతో శ్రీలంక మహిళల జట్టును ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగా, అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులకే పరిమితమైంది. రాణించిన అటపట్టు... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే అమితాశర్మ (17 బంతుల్లో 23; 4 ఫోర్లు), సోనియా దబీర్ (18 బంతుల్లో 23; 2 ఫోర్లు), జులన్ గోస్వామి (19 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) జాగ్రత్తగా ఆడి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. లంక బౌలర్లలో ప్రబోధిని (3/16) రాణించింది. శ్రీలంక కూడా 15 పరుగులకే 2 వికెట్లు నష్టపోయింది. ఈ దశలో చమరి అటపట్టు (40 బంతుల్లో 40; 5 ఫోర్లు), సిరివర్ధనే (29 బంతుల్లో 21; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. అయితే నాలుగు ఓవర్ల వ్యవధిలో భారత్ నాలుగు వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు బిగించింది. 16వ ఓవర్లో వరుస బంతుల్లో ఇద్దరు ఆటగాళ్లు రనౌట్‌గా వెనుదిరగడం లంకను దెబ్బతీసింది. తాజా ఫలితంతో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా నిలిచింది. చివరి టి20 మ్యాచ్ మంగళవారం విశాఖపట్నంలో జరుగుతుంది. -
ప్రతీ ఫార్మాట్‌కు వేర్వేరుగా హక్కులు
ముంబై : భారత్‌లో జరిగే అన్ని అంతర్జాతీయ, దేశవాళీ టోర్నీలకు టైటిల్ స్పాన్సర్షిప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టెండర్లు పిలిచింది. ఎయిర్టెల్ తప్పుకోవడంతో కొత్త స్పాన్సర్ కోసం బిడ్లను ఆహ్వానించాలని బోర్డు మార్కెటింగ్ కమిటీ నిర్ణయించింది. ఫరూక్ అబ్దుల్లా గైర్హాజరు కావడంతో శ్రీనివాసన్ నేతృత్వంలో కమిటీ గురువారం సమావేశమైంది. వచ్చే అక్టోబర్ 1నుంచి మార్చి 31, 2014 వరకు భారత్‌లో జరిగే మ్యాచ్‌ల కోసం టైటిల్ హక్కులు ఇవ్వనున్నారు. వీటిలో అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఇరానీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ తదితర దేశవాళీ టోర్నీలు, విదేశీ జట్ల ‘ఎ’ టీమ్ తదితర మ్యాచ్‌లు కూడా ఉంటాయి. గతంతో పోలిస్తే ఈ సారి కూడా ఒక్కో మ్యాచ్ కనీస ధరలో బోర్డు ఎలాంటి మార్పూ చేయలేదు. ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్ కోసం దానిని రూ. 2 కోట్లుగానే ఉంచింది. అయితే ఇప్పుడు ఒక్కో ఫార్మాట్ కోసం (టెస్టు, వన్డే, టి20) కోసం వేర్వేరుగా టెండర్లు వేసే అవకాశం కల్పిస్తోంది. ఒక సంస్థ టెస్టు, టి20లకు ఒకే మొత్తం కోట్ చేసినప్పుడు, మరో సంస్థ అంతకంటే ఎక్కువగా కేవలం టి20ల కోసమే టెండర్లు వేస్తే వారికి విడిగా టి20 మ్యాచ్‌ల స్పాన్సర్షిప్ హక్కులు అందజేస్తారు. ఇప్పటి వరకు ఎయిర్ టెల్ ఫార్మాట్ ఏదైనా మ్యాచ్‌కు రూ. 3.33 కోట్ల చొప్పున చెల్లించింది. ఈసారి బోర్డు ఈ హక్కులను కేవలం ఆరు నెలల కోసమే ఇస్తోంది. మాంద్యం కారణంగా హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉండటంతో ఆరు నెలల తర్వాత దానిని మరో సారి సవరించాలన్న శ్రీనివాసన్ ఆలోచనను కమిటీ ఆమోదించింది.