మొండిగా వెళ్లా! | Mithali raj interview with sakshi | Sakshi
Sakshi News home page

మొండిగా వెళ్లా!

Published Fri, Jul 10 2015 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

మొండిగా వెళ్లా!

మొండిగా వెళ్లా!

సచిన్‌తో పోల్చడం అదృష్టం
బోర్డు ‘కాంట్రాక్ట్’ శుభపరిణామం

 
 సాక్షి, హైదరాబాద్: భారత మహిళా క్రికెట్‌కు పర్యాయపదం ఆమె. 16 ఏళ్ల అత్యుత్తమ కెరీర్, 200కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లలో నిలకడైన ప్రదర్శన... నాయకురాలిగా అరుదైన విజయాలు ఆమె సొంతం. దశాబ్దన్నర కాలంగా నిలకడైన బ్యాటింగ్‌తో భారత జట్టును ముందుండి నడిపించిన మిథాలీ రాజ్ తాజాగా న్యూజిలాండ్‌పై సిరీస్ గెలుపుతో కెప్టెన్‌గా మరో ఘనతను సొంతం చేసుకుంది. వన్డేల్లో 5 వేల పరుగులు సాధించిన రెండో బ్యాట్స్‌విమన్‌గా మైలురాయిని అందుకున్న మిథాలీ...  ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే...
 
 మిథాలీ ఇంటర్వ్యూ
 
 ఏ రకంగా అయినా సచిన్‌తో నన్ను పోల్చడం ఎంతో అదృష్టం. లేడీ సచిన్ అనే బిరుదు అభిమానులివ్వడం గర్వంగా ఉంది
 
 కివీస్‌పై సిరీస్ విజయం
 సరైన సమయంలో మాకీ విజయం దక్కింది. బీసీసీఐతో పాటు అనేక మంది మహిళా క్రికెట్‌పై దృష్టి నిలిపారు. మాకూ కాంట్రాక్ట్‌లు ఇవ్వాలనే ప్రతిపాదన నడుస్తోంది. ఇలాంటప్పుడు విజయాల ద్వారా మమ్మల్ని మేం నిరూపించుకోవాలి. గత ఏడాది దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం నిరాశ కలిగించింది. ఇప్పుడు సిరీస్ గెలిచి బోర్డు నమ్మకం నిలబెట్టినందుకు సంతోషంగా ఉంది. అయితే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోవడం కొంత నిరాశ కలిగించింది. కానీ మాకు ఇంకా 12 మ్యాచ్‌లు ఉన్నాయి కాబట్టి నేరుగా అర్హత సాధిస్తామని నమ్మకంతో ఉన్నా.  
 
 బోర్డు గ్రేడింగ్ పద్ధతి
 ఆలస్యంగానే అయినా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మహిళా క్రికెట్‌ను మలుపు తిప్పుతుంది. ఎంత మొత్తం ఇస్తారనేది పక్కనపెడితే ప్లేయర్లలో డబ్బు గురించి ఉన్న అభద్రతా భావం తొలగిపోతుంది. ఎంత ఆడినా ఏమిటనే స్థితినుంచి ఖాయంగా డబ్బు అందుతుందనే పరిస్థితి వస్తుంది. కాబట్టి మా ప్లేయర్లు ఇంకా స్వేచ్ఛగా ఆటపై దృష్టి పెడతారు. పైగా కొత్త తరం అమ్మాయిలను కూడా క్రికెట్ ఆకర్షిస్తుంది.
 
 కొత్తగా రాబోయే లీగ్‌లు
 ఉమన్ బిగ్‌బాష్ లీగ్, ఇంగ్లండ్‌లో ఉమన్ టి20 లీగ్ త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఇది కూడా మరో మంచి పరిణామం. సాధారణంగా మహిళా క్రికెటర్లకు ఏడాది పొడవునా ఎక్కువగా మ్యాచ్‌లు ఉండవు. ఆడినా గుర్తింపు దక్కే అవకాశాలు తక్కువ. అదే ఇలాంటి లీగ్‌లో అయితే ఇన్‌స్టంట్ గుర్తింపుతో పాటు మంచి డబ్బు కూడా వస్తుంది. ఐపీఎల్‌లాగే జూనియర్లు, పెద్ద ప్లేయర్లతో కలిసి ఆడితే చాలా నేర్చుకుంటారు.
 
 వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకోవడం
 అమ్మాయిల క్రికెట్‌ను ఎవరూ పట్టించుకోని రోజుల్లో అటు వైపు మొండిగా వెళ్లినప్పుడు ఇక్కడివరకు వస్తానని ఊహించలేదు. కానీ చాలా కష్టపడ్డాను. ఇన్నేళ్లు నిలకడను కొనసాగించగలగడం పట్ల ఆనందంగా ఉంది.
 
 ఇక ముందు ఎంత కాలం ఆడతానో తెలీదు. కానీ ఆడినంత వరకు ఇదే తరహాలో మెరుగ్గా రాణించాలనేదే నా కోరిక. 2005 ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై 91 నాటౌట్, 2012లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ చేసిన 94 నాటౌట్ స్కోర్లు నా అత్యుత్తమ ప్రదర్శన.   
 
 ‘లేడీ సచిన్’ అంటూ వస్తున్న ప్రశంసలు
 ఇది సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో అభిమానులు ప్రేమతో చేసిన ప్రచారం. సచిన్‌లాంటి దిగ్గజంతో ఏ రకమైన పోలిక అయినా అదృష్టమే. చాలా గర్వంగా ఉంది. 5 వేల పరుగులపై సచిన్ కూడా ట్వీట్ చేశారు. అయితే నా ధ్యాసంతా మహిళా క్రికెట్ గురించే. ఘనతల గురించి కాదు కానీ నా కెరీర్ అమ్మాయిలకు స్ఫూర్తినివ్వాలనేదే నా కోరిక.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement