‘అన్‌క్యాప్డ్’ నుంచి ‘క్యాప్డ్’గా మారిన నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్
కొనసాగిస్తే కనీస విలువ రూ.11 కోట్లు
ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకుంటాయో లేదో!
భారత క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలనేది ప్రతీ యువ క్రికెటర్ కల. ప్రతిభకు తోడు శ్రమ, పట్టుదల, పోరాటంతో సత్తా చాటి గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు కుర్రాళ్లకు ఆదివారం అలాంటి గొప్ప అవకాశం వచి్చంది. ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఢిల్లీ పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ బంగ్లాదేశ్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్ల టీమిండియా తరఫున ‘బ్లూ జెర్సీ’లో ఆడటం మాత్రమే కాదు... వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా తమ విలువను అమాంతం పెంచుకున్నారు. వీరిద్దరిని వచ్చే సీజన్ కోసం భారీ మొత్తం చెల్లించి ఆయా ఫ్రాంచైజీలు కొనసాగిస్తాయా అనేది ఆసక్తికరం.
ఐపీఎల్–2025 వేలానికి ముందు ఫ్రాంచైజీలు తాము కొనసాగించే ఆటగాళ్ల పేర్లను వెల్లడించేందుకు ఈ నెల 31 వరకు గడువు విధించారు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టారు. ఈ సిరీస్‌కు ముందు వరకు వీరిద్దరు ‘అన్‌క్యాప్డ్’ ప్లేయర్లే. ఇప్పుడు భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంతో ‘క్యాప్డ్’ ప్లేయర్లుగా మారిపోయారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం గత ఐపీఎల్‌లో ఆడి వచ్చే ఐపీఎల్ వేలానికి ముందు భారత్‌కు ఆడితే ‘క్యాప్డ్ ప్లేయర్’గా అతనికి సంబంధించిన వేలం నిబంధనలన్నీ మారిపోతాయి. 2024 సీజన్‌లో నితీశ్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున, మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడారు.
నిబంధనలు ఇలా...
ఐపీఎల్–2025 కోసం గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను టీమ్‌కు కొనసాగించేందుకు అవకాశం ఉంది. ఇందులో కనీసం ఒకరైనా ‘అన్‌క్యాప్డ్’ ప్లేయర్ అయి ఉండాలి. కొనసాగించే తొలి ముగ్గురు ప్లేయర్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ.11 కోట్లు చొప్పున ఫ్రాంచైజీలు చెల్లించాలి. ఆ తర్వాత నాలుగో, ఐదో ఆటగాడికి ఇదే వరస కొనసాగుతుంది. అంటే రూ. 18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాలి. ఈ ఐదుగురు అంతర్జాతీయ ప్లేయర్లు అయి ఉంటే ఆరో ఆటగాడు కచి్చతంగా ‘అన్‌క్యాప్డ్’ అవుతాడు. అతనికి కనీసం రూ.4 కోట్లు ఇవ్వాలి. ఐదుగురుని అట్టి పెట్టుకోకుండా ముగ్గురు చాలు అని భావించే ఫ్రాంచైజీలకు అవకాశం
ఇచ్చేందుకు కూడా రెండు దశలుగా ఈ మొత్తాలను నిర్ణయించారు.
వీరికి అవకాశం ఉందా...
నితీశ్ రెడ్డి గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 142.92 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేసిన అతను ఏకంగా 21 సిక్సర్లు బాదాడు. దీని ప్రకారం చూస్తే ‘అన్‌క్యాప్డ్’గా అతడిని కనీసం రూ. 4 కోట్లకు హైదరాబాద్ కొనసాగించే అవకాశం కనిపించింది. అయితే ఇప్పుడు క్యాప్డ్ కావడంతో తొలి ఐదుగురు ఆటగాళ్లలో ఒకరిగా ఎంచుకోవాలి. కమిన్స్, హెడ్, క్లాసెన్, అభిõÙక్ శర్మవంటి ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో నితీశ్‌ను కనీసం ఐదో ఆటగాడిగా రూ. 11 కోట్లకు కొనసాగిస్తారా అనేది సందేహమే! అతడిని విడుదల చేసి వేలంలో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా సొంతం చేసుకునేందుకు సన్‌రైజర్స్‌కు మరో అవకాశం ఉంటుంది.
మయాంక్ విషయంలో మాత్రం లక్నో సానుకూలంగా ఉండవచ్చు. గత సీజన్‌లో ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా అతను తన వేగంతో ఎంతో ప్రభావం చూపించాడు. కేవలం 12.14 సగటుతో 7 వికెట్లు తీశాడు. ఇప్పుడు భారత్ తరఫున ఆడిన తర్వాత అలాంటి ఆటగాడిని వదులుకునేందుకు సూపర్ జెయింట్స్ ఇష్టపడకపోవచ్చు. లక్నో మెంటార్‌గా ఉన్న జహీర్ ఖాన్ కూడా మయాంక్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కాబట్టి కనీసం ఐదో ప్లేయర్‌గా రూ.11 కోట్లు చెల్లించి తమతో కొనసాగించవచ్చు. ఇద్దరిలో ఎవరినీ ఇరు జట్లు కొనసాగించకపోయినా...వేలంలోకి వెళితే భారీ మొత్తం లభించేందుకు కూడా ఆస్కారం ఉంది.
కల నిజమైంది: నితీశ్ రెడ్డి
గ్వాలియర్: భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ సంతోషం వెలిబుచ్చారు. తమ కెరీర్‌లో ఇది అత్యుత్తమ క్షణంగా అభివర్ణించారు. తమపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఎంతో ప్రోత్సహించినట్లు ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు వెల్లడించారు. ‘భారత్‌లో క్రికెట్ ఆడే ఎవరికైనా ఇది అద్భుతంలాగే అనిపిస్తుంది. టీమిండియా తరఫున ఆడే అవకాశం రావడంతో నా కల నిజమైనట్లుగా భావించాను. సహజంగానే కొంత ఉత్కంఠ, ఆందోళన ఉన్నా ఆ తర్వాత మెల్లగా ఆటను ఆస్వాదించాను. నాకూ, నా కుటుంబానికి ఇది గర్వకారణమైన క్షణం.
టీమ్‌లో చాలా మంది సీనియర్ ఆటగాళ్లతో పాటు కోచింగ్ బృందం నుంచి మంచి మద్దతు లభించింది. బౌలింగ్‌లోనూ నాకు మంచి సూచనలు లభించాయి. కెపె్టన్ సూర్య నాపై ఎలాంటి ఒత్తిడి దరి చేరకుండా ప్రశాంతంగా బౌలింగ్ చేసే అవకాశం కలి్పంచాడు. తొలి మ్యాచ్ అనిపించకుండా స్వేచ్ఛగా ఆడమని చెప్పాడు’ అని నితీశ్ రెడ్డి వివరించాడు. తొలి మ్యాచ్‌లో మయాంక్ కూడా భావోద్వేగభరితమయ్యాడు. ‘నేను మ్యాచ్ ఆడుతున్నానని తెలియగానే గత నాలుగు నెలలు నా కళ్ల ముందు మెదిలాయి. పైగా గాయం నుంచి కోలుకొని వస్తున్నాను కాబట్టి అదనపు ఒత్తిడి నాపై ఉంది. అయితే కెప్టెన్ సూర్య నేను రనప్ తీసుకుంటున్న సమయంలో నా వద్దకు వచ్చి నువ్వు ఎలా బౌలింగ్ చేయగలనని భావిస్తోవో అలాగే చేయి అతని ధైర్యం నింపాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో గతంలో పని చేసిన అనుభవం కూడా పనికొచి్చంది’ అని మయాంక్ చెప్పాడు.
– సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment