శ్రీలంక రనౌట్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: భారత జట్టు ఫీల్డింగ్ నైపుణ్యానికి శ్రీలంక తలవంచింది. స్వల్ప లక్ష్యఛేదనలో ఆ జట్టులోని నలుగురు బ్యాట్స్‌విమెన్ రనౌట్ కావడంతో రెండో టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత మహిళల జట్టుకు విజయం దక్కింది. ఆదివారం విజయనగరంలోని పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 9 పరుగుల తేడాతో శ్రీలంక మహిళల జట్టును ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగా, అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులకే పరిమితమైంది.
రాణించిన అటపట్టు...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే అమితాశర్మ (17 బంతుల్లో 23; 4 ఫోర్లు), సోనియా దబీర్ (18 బంతుల్లో 23; 2 ఫోర్లు), జులన్ గోస్వామి (19 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) జాగ్రత్తగా ఆడి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. లంక బౌలర్లలో ప్రబోధిని (3/16) రాణించింది. శ్రీలంక కూడా 15 పరుగులకే 2 వికెట్లు నష్టపోయింది.
ఈ దశలో చమరి అటపట్టు (40 బంతుల్లో 40; 5 ఫోర్లు), సిరివర్ధనే (29 బంతుల్లో 21; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. అయితే నాలుగు ఓవర్ల వ్యవధిలో భారత్ నాలుగు వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు బిగించింది. 16వ ఓవర్లో వరుస బంతుల్లో ఇద్దరు ఆటగాళ్లు రనౌట్‌గా వెనుదిరగడం లంకను దెబ్బతీసింది. తాజా ఫలితంతో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా నిలిచింది. చివరి టి20 మ్యాచ్ మంగళవారం విశాఖపట్నంలో జరుగుతుంది.