జూలై 8 నుంచి విశాఖ–కొలంబో విమాన సర్వీసులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి శ్రీలంక దేశ రాజధాని కొలంబోల మధ్య జూలై 8వ తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రవేశపెడుతున్నట్టు శ్రీలంక ఎయిర్‌లైన్స్ మేనేజర్ సంజీవ జయతిలకే వెల్లడించారు. శుక్రవారం విశాఖలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కొత్త రూట్ కోసం ఎయిర్ బస్ 300/321 ఎయిర్ క్రాఫ్ట్‌ను కొత్తగా ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు శ్రీలంక ఎయిర్‌లైన్స్ భారతదేశంలో న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూర్, కొచ్చిన్, మదురై, త్రివేండ్రం, తిరుచునాపల్లి, వారణాశి, బోధ్‌గయాల నుంచి కొలంబోకు విమాన సర్వీసులు నడుపుతున్నదన్నారు. రానుపోను ఒక్కో ప్రయాణికునికి టికెట్ ఫేర్ రూ.14,999 అని చెప్పారు.
బెల్లాజియో కాసినో శ్రీలంకలోనే ప్రసిద్ధి
శ్రీలంక టూరిజం వివరాలను తెలిపేందుకు శ్రీలంక ఎయిర్‌లైన్స్‌తో పాటు బెల్లాజియో కాసినో, సినమోన్ గ్రాండ్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రముఖ గేమింగ్ ఎరినా బెల్లాజయో కాసినో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు నైట్‌లైఫ్‌గా సుపరిచితమని బెల్లాజియో కాసినో మార్కెటింగ్ హెడ్ సిసిరా తెలిపారు. నృత్యాలు, పాటలే కాకుండా ప్రపంచ శ్రేణి రెస్టారెంట్లు, బార్లతో ఈ కాసినో ప్రపంచ ప్రసిద్ధి చెందిందని ప్రెసిడెంట్ ఇండియా ఆపరేషన్స్ నందీప్ కుమార్ తెలిపారు. సినామోన్ గ్రాండ్ శ్రీలంకలో అతిపెద్ద ఫైవ్‌స్టార్ హోటల్స్‌తో సేవలందిస్తుందని సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ సేల్స్ షావింద జినాదాసా తెలిపారు.