ముంబై : భారత్‌లో జరిగే అన్ని అంతర్జాతీయ, దేశవాళీ టోర్నీలకు టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టెండర్లు పిలిచింది. ఎయిర్‌టెల్ తప్పుకోవడంతో కొత్త స్పాన్సర్ కోసం బిడ్లను ఆహ్వానించాలని బోర్డు మార్కెటింగ్ కమిటీ నిర్ణయించింది. ఫరూక్ అబ్దుల్లా గైర్హాజరు కావడంతో శ్రీనివాసన్ నేతృత్వంలో కమిటీ గురువారం సమావేశమైంది.
వచ్చే అక్టోబర్ 1నుంచి మార్చి 31, 2014 వరకు భారత్‌లో జరిగే మ్యాచ్‌ల కోసం టైటిల్ హక్కులు ఇవ్వనున్నారు. వీటిలో అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఇరానీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ తదితర దేశవాళీ టోర్నీలు, విదేశీ జట్ల ‘ఎ’ టీమ్ తదితర మ్యాచ్‌లు కూడా ఉంటాయి. గతంతో పోలిస్తే ఈ సారి కూడా ఒక్కో మ్యాచ్ కనీస ధరలో బోర్డు ఎలాంటి మార్పూ చేయలేదు. ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్ కోసం దానిని రూ. 2 కోట్లుగానే ఉంచింది. అయితే ఇప్పుడు ఒక్కో ఫార్మాట్ కోసం (టెస్టు, వన్డే, టి20) కోసం వేర్వేరుగా టెండర్లు వేసే అవకాశం కల్పిస్తోంది.
ఒక సంస్థ టెస్టు, టి20లకు ఒకే మొత్తం కోట్ చేసినప్పుడు, మరో సంస్థ అంతకంటే ఎక్కువగా కేవలం టి20ల కోసమే టెండర్లు వేస్తే వారికి విడిగా టి20 మ్యాచ్‌ల స్పాన్సర్‌షిప్ హక్కులు అందజేస్తారు. ఇప్పటి వరకు ఎయిర్ టెల్ ఫార్మాట్ ఏదైనా మ్యాచ్‌కు రూ. 3.33 కోట్ల చొప్పున చెల్లించింది. ఈసారి బోర్డు ఈ హక్కులను కేవలం ఆరు నెలల కోసమే ఇస్తోంది. మాంద్యం కారణంగా హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉండటంతో ఆరు నెలల తర్వాత దానిని మరో సారి సవరించాలన్న శ్రీనివాసన్ ఆలోచనను కమిటీ ఆమోదించింది.
ప్రతీ ఫార్మాట్‌కు వేర్వేరుగా హక్కులు
Published Fri, Sep 20 2013 1:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
Advertisement