
భారత జట్టు ఎంపికకు సరిగ్గా ఒక రోజు ముందు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కచ్చితంగా జట్టులోకి రాగలడని భావించిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయాడు. బోర్డు నిబంధనల ప్రకారం తన ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు సిద్ధమైన పాండ్యా శనివారం జరిగిన ఈ పరీక్షలో విఫలమయ్యాడు. అంతర్జాతీయ మ్యాచ్ ప్రమాణాలకు తగిన విధంగా ఫిట్‌నెస్ టెస్టులో సాధించాల్సిన కనీస స్కోరును అతను అందుకోలేకపోయాడు. భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఇప్పటికే ఎంపికైన అతను శనివారమే న్యూజిలాండ్ బయల్దేరాల్సి ఉంది. పాండ్యా స్థానంలో మరో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టి20లో చివరిసారిగా భారత్‌కు ఆడిన హార్దిక్ వెన్ను గాయంతో ఆటకు దూరమయ్యాడు. అతని గాయానికి శస్త్ర చికిత్స కూడా జరిగింది. ఇటీవలే కోలుకోవడంతో కివీస్ టూర్‌కు వెళ్లడం ఖాయమనిపించింది. అయితే కోలుకున్న తర్వాత అతను మళ్లీ ఒక్కసారి కూడా మైదానంలోకి దిగకపోయినా సెలక్టర్లు ‘ఎ’ జట్టుకు ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment