డబ్లిన్: ఐర్లాండ్ గడ్డపై భారత్ శుభారంభం చేసింది. వర్షంతో 12 ఓవర్లకు కుదించిన తొలి టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని భారత్ 9.2 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి ఛేదించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడాడు. మరో ఓపెనర్ దీపక్ హుడా (29 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశాడు.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్సర్లు) భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. హుడా, పాండ్యా మూడో వికెట్‌కు చకచకా 64 పరుగులు జోడించారు. హార్దిక్ అవుటయ్యాక దినేశ్ కార్తీక్ (5 నాటౌట్)తో కలిసి హుడా మిగతా లాంఛనాన్ని పూర్తిచేశాడు. అంతకుముందు టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా... తొలుత ఐర్లాండ్ నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.
భారత సీమర్లు హార్దిక్, భువనేశ్వర్, అవేశ్ టాపార్డర్‌పై తలా ఒక దెబ్బ వేశారు. దీంతో ఓపెనర్లు స్టిర్లింగ్ (4), బల్బిర్నీ (0) సహా గ్యారెత్ (8) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అలా ఐర్లాండ్ 22 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో హ్యారీ టెక్టర్ (33 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరిగా పోరాటం చేశాడు. టక్కర్ (18; 2 సిక్సర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. అనంతరం డాక్ రెల్ (4)తో కలిసి జట్టు స్కోరును వంద దాటించాడు. భారత బౌలర్లలో భువీ, పాండ్యా, అవేశ్, చహల్ తలా ఒక వికెట్ తీశారు. రేపు రెండో టి20 మ్యాచ్ ఇక్కడే జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment