డబ్లిన్: భారత పేస్ తురుపుముక్క జస్‌ప్రీత్ బుమ్రా (2/24) తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన ఈ సీనియర్ సీమర్ వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత బౌలింగ్ దళానికి తాను వెన్నుదన్నుగా ఉంటానని భరోసా ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే అనుకున్నట్లే భారత్, ఐర్లాండ్ తొలి టి20ని వరుణుడు అడ్డుకున్నాడు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 2 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది.
ఈ మ్యాచ్‌తో రింకూ సింగ్, ప్రసిధ్ కృష్ణ భారత్ తరఫున టి20ల్లో అరంగేట్రం చేశారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బారీ మెకార్తీ (33 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ వర్షంతో ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (23 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), రుతురాజ్ గైక్వాడ్ (16 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడారు. పవర్‌ప్లేలో ఓపెనింగ్ జోడీ 45 పరుగులు చేసింది. ఏడో ఓవర్ వేసిన క్రెయిగ్ యంగ్ 5 బంతులేసి 2 వికెట్లు పడగొట్టాడు. తిలక్ వర్మ (0) డకౌటయ్యాడు.
వర్షంతో ఆట నిలిచే సమయానికి డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత విజయ సమీకరణం 45 పరుగులుగా ఉంది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం ఇదే వేదికపై రెండో మ్యాచ్ జరుగుతుంది.
బుమ్రా ధాటికి...
చాన్నాళ్ల తర్వాత మైదానంలోకి దిగిన భారత పేసర్, కెపె్టన్ బుమ్రా తన పేస్‌లో పదును ఏమాత్రం తగ్గలేదని తొలి ఓవర్లోనే చూపించాడు. అతని ధాటికి ఓపెనర్ బల్బిర్నీ (4) క్లీన్‌బౌల్డ్ కాగా, టక్కర్ (0) ఖాతానే తెరవలేదు. తర్వాత ప్రసిధ్ కృష్ణ కూడా ఐర్లాండ్ ఇన్నింగ్స్‌ను చావుదెబ్బ తీయడంతో 31 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. అయితే క్యాంఫర్ (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకోగా, మెకార్తీ డెత్ ఓవర్లలో చెలరేగడంతో ఐర్లాండ్ చెప్పుకోదగ్గ స్కోరు చేసింది.
స్కోరు వివరాలు
ఐర్లాండ్ ఇన్నింగ్స్: బల్బిర్నీ (బి) బుమ్రా 4; స్టిర్లింగ్ (బి) బిష్ణోయ్ 11; టక్కర్ (సి) సామ్సన్ (బి) బుమ్రా 0; టెక్టర్ (సి) తిలక్ (బి) ప్రసిధ్ కృష్ణ 9; క్యాంఫర్ (బి) అర్శ్‌దీప్ 39; డాక్‌రెల్ (సి) రుతురాజ్ (బి) ప్రసిధ్ కృష్ణ 1; మార్క్ అడైర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బిష్ణోయ్ 16; మెకార్తీ (నాటౌట్) 51; యంగ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–4, 2–4, 3–27, 4–27, 5–31, 6–59, 7–116. బౌలింగ్: బుమ్రా 4–0–24–2, అర్ష్దీప్ 4–0–35–1, ప్రసిధ్ కృష్ణ 4–0–32–2, రవి బిష్ణోయ్ 4–0–23–2, శివమ్ దూబే 1–0–6–0, వాషింగ్టన్ సుందర్ 3–0–19–0.
భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) స్టిర్లింగ్ (బి) యంగ్ 24; రుతురాజ్ (నాటౌట్) 19; తిలక్ వర్మ (సి) టక్కర్ (బి) యంగ్ 0; సామ్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (6.5 ఓవర్లలో 2 వికెట్లకు) 47. వికెట్ల పతనం: 1–46, 2–46. బౌలింగ్: మార్క్ అడైర్ 1–0–10–0, జోష్ లిటిల్ 3–0–20–0, మెకార్తీ 2–0–14–0, యంగ్ 0.5–0–2–2.
Comments
Please login to add a commentAdd a comment