India vs Ireland, 1st T20 Cricket Match Today - Sakshi
Sakshi News home page

IND vs IRE: ఐర్లాండ్‌తో తొలి పోరు.. శుభారంభం లక్ష్యంగా

Published Fri, Aug 18 2023 2:32 AM | Last Updated on Fri, Aug 18 2023 10:24 AM

Indias first T20 against Ireland today - Sakshi

డబ్లిన్‌: రాబోయే కాలానికి కాబోయే స్టార్లతో ఉన్న టీమిండియా మరో టి20 క్రికెట్‌ సమరానికి సిద్ధమైంది. ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నిరూపించుకునేందుకు కుర్రాళ్లు సై అంటున్నారు. ఇందులో భాగంగా నేడు తొలి పోరు జరుగనుంది. 11 నెలలుగా బరిలోకే దిగని బుమ్రా టీమిండియాకు నాయకత్వం వహించనుండటం మరో విశేషం. అయితే స్టార్ల కొరతే సిరీస్‌కు వెలతి! ఇటీవల వెస్టిండీస్‌తో ఆడిన జట్టులో తాత్కాలిక కెపె్టన్‌ హార్దిక్‌ పాండ్యా అయినా ఉన్నాడు.

ఈ సిరీస్‌కు తను కూడా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలాగే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అంతమాత్రాన ఈ క్రికెట్‌ ‘షో’కు సోకులేం తక్కువగా లేవు. ఎందుకంటే రుతురాజ్‌ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, జితేశ్‌ శర్మ తదితరులంతా ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన వారే! కలగలిపిన ప్రపంచ శ్రేణి బౌలర్లను ఎదుర్కొన్నవారే! ఇప్పుడు మాత్రం ఒక్క ఐర్లాండ్‌ బౌలర్లతో ‘ఢీ’ కొట్టేందుకు రెడీ అయ్యారు.  

అందరి కళ్లు బుమ్రా, తిలక్‌లపైనే... 
వెన్ను గాయం, శస్త్ర చికిత్స, పునరావస శిబిరం ఇలా చాన్నాళ్ల తర్వాత 29 ఏళ్ల బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌ బరిలోకి దిగుతున్నాడు. ఇదేమో టి20 సిరీస్‌... భారత్‌లో జరగబోయేది వన్డే వరల్డ్‌కప్‌... ఎలా చూసుకున్నా పరిమిత ఓవర్లలో బుమ్రా పవర్‌ఫుల్‌ బౌలర్‌. ఒకేసారి 10 ఓవర్ల కోటా ఉండే వన్డేల్లో కాకుండా 4 ఓవర్లతో సరిపెట్టుకునే టి20 మ్యాచ్‌లతో ఆడించడం ద్వారా అతనిపై పని ఒత్తిడి లేకుండా బోర్డు జాగ్రత్త పడింది.

మరోవైపు అవకాశం వచ్చిన ఐపీఎల్‌లో, బరిలోకి దించిన కరీబియన్‌ సిరీస్‌లో చెలరేగిన హైదరాబాదీ కుర్రాడు తిలక్‌ వర్మపై కూడా సెలక్టర్లు దృష్టి పడింది. ఈ సిరీస్‌లో వీరిద్దరిపైనే అందరి కళ్లుంటాయనేది వాస్తవం. ఇక ప్రత్యర్థి ఐర్లాండ్‌ విషయానికొస్తే బల్బిర్నీ సారథ్యంలో జట్టు నిలకడగా రాణిస్తోంది. కుర్రాళ్లున్నా... ఇంకెవరున్నా... టీమిండియాపై గెలుపు వారికి గొప్పదే అవుతుంది. అందుకే సిరీసే లక్ష్యంగా ఐర్లాండ్‌ దిగుతోంది. 


టికెట్లు హాట్‌కేకుల్లా..
మైదానంలో భారత జట్టు దిగితే ఏ జట్టుకైనా కాసుల రాశులు కురుస్తాయనే దానికి భారత్, ఐర్లాండ్‌ టి20 సిరీస్‌ మరో ఉదాహరణ. టీమిండియా వైపు నుంచి చూస్తే ప్రత్యర్తి పెద్దగా పోటీ జట్టు కాదు. ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్, బ్యాటింగ్‌ ‘కింగ్‌’ కోహ్లి... అంతెందుకు తాజా తాత్కాలిక కెపె్టన్‌ హార్దిక్‌ పాండ్యా కూడా లేడు. అంటే భారత స్టార్లెవరూ బరిలో లేకపోయినా... మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు టి20లకు టికెట్లన్నీ అమ్ముడయ్యాయని స్వయంగా ఐర్లాండ్‌ బోర్డే వెల్లడించింది. 11,500 సీట్ల సామర్థ్యమున్న స్టేడియం ‘హౌస్‌ఫుల్‌’ అయ్యింది. అయితే శుక్రవారం డబ్లిన్‌లో భారీ వర్ష సూచన ఉండటంతో మ్యాచ్‌ సజావుగా సాగుతుందో లేదో వేచి చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement