India Women Hockey Team
-
చైనాకు షాక్.. చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. అరుదైన రికార్డు
రాజ్‌గిర్(బిహార్): నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతం చేసింది. వుమెన్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చైనాను ఓడించి.. టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కాగా సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీ భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగింది.అద్భుత విజయాలతో సెమీస్‌కు చేరుకున్న సలీమా బృందం.. అక్కడ జపాన్ను ఓడించి.. ఫైనల్‌కు చేరుకుంది. వరుసగా ఆరో గెలుపు నమోదు చేసి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఫైనల్లో.. పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ విజేత, ఆసియా క్రీడల చాంపియన్ అయిన చైనాతో తలపడింది.చైనాను 1-0తో ఓడించిఆద్యంతం ఆసక్తి రేపిన ఈ మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు చైనాను 1-0తో ఓడించి.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలవడం ఇది మూడోసారి. ఈ క్రమంలో సౌత్ కొరియాతో కలిసి ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా అగ్రస్థానంలో నిలిచింది.ఇక చైనాతో ఫైనల్లో భారత్ తరఫున దీపికా చేసిన ఒకే ఒక్క గోల్‌తో విజయం సలీమా బృందం సొంతమైంది. మూడో క్వార్టర్లో ఆమె గోల్ కొట్టి భారత్‌ను విజయపథంలో నిలిపింది. దీంతో రాజ్‌గిర్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.ఇదిలా ఉంటే.. ఈ ప్రతిష్టాత్మ టోర్నీలో 2016, 2023లలో భారత మహిళా జట్టు చాంపియన్‌గా నిలిచింది విజేతగా నిలిచింది. అదే విధంగా.. 2013, 2018లలో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.వుమెన్స్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ-2024లో పాల్గొన్న భారత జట్టుగోల్ కీపర్స్- సవిత, బిచు దేవి ఖరీబామ్డిఫెండర్స్- ఉదిత, జ్యోతి, వైష్ణవి విట్టల్ ఫాల్కే, సుశీలా చాను పఖ్రంబం, ఇషికా చౌదరిమిడ్ఫీల్డర్స్- నేహా, సలీమా టెటె(కెప్టెన్), షర్మిలా దేవి, మనీషా చౌహాన్, సునేలిటా టొప్పో, లల్రేమిసియామి.ఫార్వర్డ్స్- నవనీత్ కౌర్(వైస్ కెప్టెన్), ప్రీతీ దూబే, సంగీతా కుమారి, దీపికా, బ్యూటీ డంగ్‌డంగ్.చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
తొలి అడుగు పడింది
భువనేశ్వర్: సొంతగడ్డపై అశేష అభిమానుల సమక్షంలో భారత మహిళల, పురుషుల హాకీ జట్లు గెలుపు బోణీ కొట్టాయి. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి అంచె మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 5–1తో అమెరికాను ఓడించగా... భారత పురుషుల జట్టు 4–2తో రష్యాపై గెలుపొందింది. నేడు రెండో అంచె మ్యాచ్‌లు జరుగుతాయి. నేటి మ్యాచ్‌లను భారత జట్లు కనీసం ‘డ్రా’ చేసుకుంటే వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. మరోవైపు తొలి అంచె మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ... అమెరికా, రష్యా జట్లకు ‘టోక్యో’ దారులు ఇంకా సజీవంగానే ఉన్నాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో అమెరికా ఐదు గోల్స్ తేడాతో... రష్యా మూడు గోల్స్ తేడాతో భారత్‌పై గెలిస్తే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ‘టోక్యో’కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఒకవేళ అమెరికా నాలుగు గోల్స్ తేడాతో... రష్యా రెండు గోల్స్ తేడాతో గెలిస్తే మాత్రం గోల్స్ సగటు సమానం అవుతుంది. అలా జరిగిన పక్షంలో ‘షూటౌట్’ను నిర్వహించి దాని ద్వారా విజేతను తేలుస్తారు. ఆరు నిమిషాల్లో మూడు గోల్స్... తొలి క్వార్టర్లో నిదానంగా ఆడిన భారత మహిళల జట్టు రెండో క్వార్టర్ నుంచి వేగం పెంచింది. 28వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను లిలిమా మింజ్ లక్ష్యానికి చేర్చడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్ మరింత జోరు పెంచింది. మూడో క్వార్టర్లో మన అమ్మాయిలు చెలరేగిపోయారు. ఆరు నిమిషాల వ్యవధిలో ఏకంగా మూడు గోల్స్ చేసి 4–0తో ఆధిక్యంలోకి వెళ్లారు. 51వ నిమిషంలో భారత్ ఖాతాలో ఐదో గోల్ చేరింది. మ్యాచ్ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా అమెరికా ఏకైక గోల్ సాధించింది. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం అమెరికాపై భారత మహిళల జట్టుకిదే అతి పెద్ద విజయం. తమ ర్యాంక్‌లకు తగ్గ ఆటతీరును ప్రదర్శించిన భారత మహిళల, పురుషుల హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్ దిశగా అడుగు ముందుకేశాయి. క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా తొలి మ్యాచ్‌ల్లో భారత జట్లు గెలుపొందాయి. భారత మహిళల జట్టు అంచనాలకు మించి రాణించగా... భారత పురుషుల జట్టు మాత్రం బోణీ కొట్టడానికి శ్రమించాల్సి వచ్చింది. చెమటోడ్చి.... ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 22వ స్థానంలో ఉన్న రష్యా పురుషుల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత బృందానికి గట్టిపోటీనే ఎదురైంది. భారత బృందం గోల్స్ వర్షం కురిపిస్తుందని భావించినా అలాంటిదేమీ జరగలేదు. రష్యా డిఫెన్స్‌ను ఛేదించడంలో భారత ఫార్వర్డ్స్ ఇబ్బంది పడ్డారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న మన్‌ప్రీత్ సింగ్ బృందం మ్యాచ్ ముగియడానికి 12 నిమిషాలు ఉన్నాయనగా 2–1తో కేవలం ఒక గోల్ ఆధిక్యంలో ఉంది. అయితే ఐదు నిమిషాల వ్యవధిలో సునీల్, మన్దీప్ సింగ్ చెరో గోల్ సాధించి భారత్‌ను 4–1తో ఆధిక్యంలో నిలిపారు. అయితే చివరి నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రష్యా లక్ష్యానికి చేర్చి తమ ఖాతాలో రెండో గోల్‌ను జమ చేసుకుంది. మహిళల విభాగం మహిళల విభాగం 5 ►లిలిమా మింజ్ (28వ ని.లో) ►షర్మిలా దేవి (40వ ని.లో) ►గుర్జీత్ కౌర్ (42వ ని.లో) ►నవనీత్ కౌర్ (46వ ని.లో) ►గుర్జీత్ కౌర్ (51వ ని.లో) అమెరికా 1 ►ఎరిన్ మాట్సన్ (54వ ని.లో) పురుషుల విభాగం భారత్ 4 ►హర్మన్‌ప్రీత్ సింగ్ (5వ ని.లో) ►మన్దీప్ సింగ్ (24వ ని.లో) ►ఎస్వీ సునీల్ (48వ ని.లో) ►మన్దీప్ సింగ్ (53వ ని.లో) రష్యా 2 ►ఆండ్రీ కురయెవ్ (17వ ని.లో) ►మత్కోవ్స్కీ (60వ ని.లో) -
చక్ దే ఇండియా..!
ధ్యాన్‌చంద్ జయంతి రోజునే భారత మహిళల జట్టు ఘనత 35 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌కు అర్హత జాతీయ క్రీడాదినం (మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి) ఆగస్టు 29న జాతీయ క్రీడ హాకీ అభిమానులకు శుభవార్త. మూడున్నర దశాబ్దాల తర్వాత భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. తద్వారా హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు ఘననివాళి అర్పించింది. భారత మహిళల హాకీ జట్టు చివరి సారిగా 1980లో ఒలింపిక్స్‌లో పాల్గొంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఘనమైన చరిత్ర ఉన్న హాకీకి మళ్లీ మహర్దశ రావాలని ఆశిద్దాం. గత జూలైలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్‌లో భారత్ ఐదో స్థానంలో నిలిచి ఒలింపిక్ బెర్తుకు మార్గం సుగమం చేసుకుంది. తాజాగా యూరో హాకీ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో స్పెయిన్.. ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవడంతో భారత్‌కు లైన్ క్లియరైంది. భారత పురుషుల జట్టు ఒకప్పుడు ప్రపంచ హాకీ రంగాన్ని శాసించిన సంగతి తెలిసిందే. ఇందులో హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ది కీలక పాత్ర. మూడు దశాబ్దాల పాటు భారత్ ప్రపంచ హాకీని మకుటంలేని మహారాజులా ఏలింది. భారత్ పురుషుల హాకీ జట్టు మొత్తం 8 ఒలింపిక్ స్వర్ణ పతకాలు సాధించింది. 1928 నుంచి 1956 వరకు వరసగా ప్రపంచ విజేతగా నిలిచింది. ఆ తర్వాత క్రమేణా ప్రాభవం కోల్పోయింది. 2008 ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోవడం భారత హాకీ చరిత్రలో చీకటి అధ్యాయం కాగా.. గత ఒలింపిక్స్‌లో చిట్టచివరన 12వ స్థానంలో నిలిచింది. పురుషుల జట్టుతో పోలిస్తే మహిళల జట్టుకు అంతటి చరిత్ర లేదు. ఒలింపిక్ పతకం అటుంచి.. ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించడమిది రెండోసారి మాత్రమే. 1980 ఒలింపిక్ గేమ్స్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 35 ఏళ్ల తర్వాత మరోసారి ఒలింపిక్స్‌లో ఆడబోతోంది. మునుపటితో పోలిస్తే హాకీకి ఆదరణ తగ్గడం (ప్రస్తుతం క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ గతంలో హాకీకి ఉండేది).. హాకీ సంఘాల్లో గొడవలు.. పురుషుల జట్టుతో పోలిస్తే అభిమానుల నుంచి తగ్గిన ప్రోత్సాహం లేకపోయినా.. భారత అమ్మాయిలు అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటుతున్నారు. వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం బరిలో నిలిచారు. మహిళల హాకీ జట్టు విజయం దేశానికి గర్వకారణమని హాకీ ఇండియా ప్రశంసించింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు భారత మహిళల జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. -
35 ఏళ్ల తర్వాత బెర్తు దొరికింది..
భారత మహిళల హాకీ జట్టు 35 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో 12 జట్ల హాకీ ఈవెంట్లో భారత్ బెర్తును ఖరారు చేసుకుంది. యూరో హాకీ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో స్పెయిన్.. ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవడంతో భారత్‌కు మార్గం సుగమమైంది. ర్యాంకింగ్ ఆధారంగా భారత్‌కు బెర్తు దక్కింది. భారత్ మహిళల హాకీ జట్టు చివరి సారిగా 1980 ఒలింపిక్స్‌లో ఆడింది. ఆ తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించలేకపోయింది. సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌లో ఆడబోతోంది.