భారత మహిళల జట్టు సంబరం
భువనేశ్వర్: సొంతగడ్డపై అశేష అభిమానుల సమక్షంలో భారత మహిళల, పురుషుల హాకీ జట్లు గెలుపు బోణీ కొట్టాయి. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి అంచె మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 5–1తో అమెరికాను ఓడించగా... భారత పురుషుల జట్టు 4–2తో రష్యాపై గెలుపొందింది. నేడు రెండో అంచె మ్యాచ్‌లు జరుగుతాయి. నేటి మ్యాచ్‌లను భారత జట్లు కనీసం ‘డ్రా’ చేసుకుంటే వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి.
మరోవైపు తొలి అంచె మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ... అమెరికా, రష్యా జట్లకు ‘టోక్యో’ దారులు ఇంకా సజీవంగానే ఉన్నాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో అమెరికా ఐదు గోల్స్ తేడాతో... రష్యా మూడు గోల్స్ తేడాతో భారత్‌పై గెలిస్తే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ‘టోక్యో’కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఒకవేళ అమెరికా నాలుగు గోల్స్ తేడాతో... రష్యా రెండు గోల్స్ తేడాతో గెలిస్తే మాత్రం గోల్స్ సగటు సమానం అవుతుంది. అలా జరిగిన పక్షంలో ‘షూటౌట్’ను నిర్వహించి దాని ద్వారా విజేతను తేలుస్తారు.
ఆరు నిమిషాల్లో మూడు గోల్స్...
తొలి క్వార్టర్‌లో నిదానంగా ఆడిన భారత మహిళల జట్టు రెండో క్వార్టర్ నుంచి వేగం పెంచింది. 28వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను లిలిమా మింజ్ లక్ష్యానికి చేర్చడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్ మరింత జోరు పెంచింది. మూడో క్వార్టర్‌లో మన అమ్మాయిలు చెలరేగిపోయారు. ఆరు నిమిషాల వ్యవధిలో ఏకంగా మూడు గోల్స్ చేసి 4–0తో ఆధిక్యంలోకి వెళ్లారు. 51వ నిమిషంలో భారత్ ఖాతాలో ఐదో గోల్ చేరింది. మ్యాచ్ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా అమెరికా ఏకైక గోల్ సాధించింది. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం అమెరికాపై భారత మహిళల జట్టుకిదే అతి పెద్ద విజయం.
తమ ర్యాంక్‌లకు తగ్గ ఆటతీరును ప్రదర్శించిన భారత మహిళల, పురుషుల హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్ దిశగా అడుగు ముందుకేశాయి. క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా తొలి మ్యాచ్‌ల్లో భారత జట్లు గెలుపొందాయి. భారత మహిళల జట్టు అంచనాలకు మించి రాణించగా... భారత పురుషుల జట్టు మాత్రం బోణీ కొట్టడానికి శ్రమించాల్సి వచ్చింది.
చెమటోడ్చి....
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 22వ స్థానంలో ఉన్న రష్యా పురుషుల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత బృందానికి గట్టిపోటీనే ఎదురైంది. భారత బృందం గోల్స్ వర్షం కురిపిస్తుందని భావించినా అలాంటిదేమీ జరగలేదు. రష్యా డిఫెన్స్‌ను ఛేదించడంలో భారత ఫార్వర్డ్స్ ఇబ్బంది పడ్డారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న మన్‌ప్రీత్ సింగ్ బృందం మ్యాచ్ ముగియడానికి 12 నిమిషాలు ఉన్నాయనగా 2–1తో కేవలం ఒక గోల్ ఆధిక్యంలో ఉంది. అయితే ఐదు నిమిషాల వ్యవధిలో సునీల్, మన్‌దీప్ సింగ్ చెరో గోల్ సాధించి భారత్‌ను 4–1తో ఆధిక్యంలో నిలిపారు. అయితే చివరి నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రష్యా లక్ష్యానికి చేర్చి తమ ఖాతాలో రెండో గోల్‌ను జమ చేసుకుంది.
మహిళల విభాగం
మహిళల విభాగం 5
►లిలిమా మింజ్ (28వ ని.లో)
►షర్మిలా దేవి (40వ ని.లో)
►గుర్జీత్ కౌర్ (42వ ని.లో)
►నవనీత్ కౌర్ (46వ ని.లో)
►గుర్జీత్ కౌర్ (51వ ని.లో)
అమెరికా 1
►ఎరిన్ మాట్సన్ (54వ ని.లో)
పురుషుల విభాగం
భారత్ 4
►హర్మన్‌ప్రీత్ సింగ్ (5వ ని.లో)
►మన్‌దీప్ సింగ్ (24వ ని.లో)
►ఎస్‌వీ సునీల్ (48వ ని.లో)
►మన్‌దీప్ సింగ్ (53వ ని.లో)
రష్యా 2
►ఆండ్రీ కురయెవ్ (17వ ని.లో)
►మత్కోవ్‌స్కీ (60వ ని.లో)
Comments
Please login to add a commentAdd a comment