India mens hockey team
-
ఉత్కంఠపోరులో జపాన్‌పై విజయం.. టీమిండియా హాకీ జట్టుకు కాంస్య పతకం
హాకీ ఆసియాకప్ 2022లో ఫైనల్ చేరడంలో విఫలమైన టీమిండియా పరుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. కాంస్య పతక పోరులో భాగంగా బుధవారం జపాన్‌తో జరిగిన హై వోల్టేజీ మ్యాచ్‌లో 1-0తో భారత్ జయకేతనం ఎగురవేసింది. టీమిండియా తరపున ఆట ఏడో నిమిషంలో రాజ్‌కుమార్ పాల్ గోల్ చేశాడు. ఆ తర్వాత మూడు క్వార్టర్ల పాటు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. జపాన్ పలుమార్లు గోల్‌పోస్ట్ వైపు దాడులు చేసినప్పటికి టీమిండియా డిఫెన్స్ బలంగా ఉండడంతో నిర్ణీత సమయంలోగా జపాన్ గోల్ చేయడంలో చతికిలపడింది. దీంతో భారత్ ఖాతాలో విజయంతో పాటు కాంస్య పతకం వచ్చి చేరింది. ఇక మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా 4-4తో డ్రా చేసుకోవడంతో ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక హాకీ ఆసియా కప్ విజేతగా దక్షిణ కొరియా నిలిచింది. మలేషియాతో జరిగిన ఫైనల్లో 2-1తో విజయం అందుకొని స్వర్ణ పతకం సాధించింది. చదవండి: బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషాసింగ్‌కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా Hockey Asia Cup 2022: టీమిండియా హాకీ జట్టును వెంటాడిన దురదృష్టం Let us applaud the young Indian Team for their outstanding performance in the Hero Asia Cup 2022, Jakarta, Indonesia for winning a Bronze. 🥉 We are proud of this team 💙#IndiaKaGame #HockeyIndia #MatchDay #INDvsJPN @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/ptTFDJo7Y5 — Hockey India (@TheHockeyIndia) June 1, 2022 -
టీమిండియా హాకీ జట్టును వెంటాడిన దురదృష్టం..
మెన్స్ హాకీ ఆసియాకప్‌లో టీమిండియా పురుషుల హాకీ జట్టును దురదృష్టం వెంటాడింది. గోల్స్ తేడా కారణంగా టీమిండియా ఫైనల్ చేరకుండానే సూపర్-4లోనే నిష్క్రమించింది. సూపర్-4లో భాగంగా మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 4-4తో డ్రా చేసుకుంది. దీంతో భారత్, కొరియా ఖాతాలో చెరో ఐదు పాయింట్లు చేరాయి. అయితే జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మలేషియా విజయం సాధించడం భారత్ అవకాశాలను దెబ్బ తీసింది. జపాన్‌పై విజయంతో మలేషియా ఖాతాలోనూ ఐదు పాయింట్లు చేరాయి. మూడు జట్లు ఐదు పాయింట్లతో సూపర్-4ను ముగించినప్పటికి మెరుగైన గోల్స్ ఉన్న కారణంగా మలేషియా, కొరియాలు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇక మూడో స్థానం కోసం భారత్.. జపాన్‌తో జూన్ 1న తలపడనుంది. అదే రోజు మలేషియా, దక్షిణ కొరియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. A scintillating game ends in a DRAW!! 💙 IND 4:4 KOR #IndiaKaGame #HockeyIndia #HeroAsiaCup #MatchDay #INDvsKOR @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/eor7QdAZuB — Hockey India (@TheHockeyIndia) May 31, 2022 -
ఆసియా కప్ ఫైనల్ రేసులో భారత్...
జకార్తా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. సూపర్–4 సెమీఫైనల్ లీగ్‌లో భాగంగా మలేసియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌ను భారత్ 3–3 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకుంది. ఒకదశలో భారత్ 0–2తో వెనుకబడి ఆ తర్వాత తేరుకొని 3–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ మ్యాచ్ ముగియడానికి నాలుగు నిమిషాలు ఉందనగా టీమిండియా గోల్ సమర్పించుకొని విజయం సాధించాల్సిన చోట ‘డ్రా’తో సంతృప్తి పడింది. మలేసియా ప్లేయర్ రజీ రహీమ్ (12వ, 21వ, 56వ ని.లో) ‘హ్యాట్రిక్’ గోల్స్‌తో తమ జట్టుకు ఓటమి తప్పించాడు. టీమిండియా తరఫున విష్ణుకాంత్ సింగ్ (32వ ని.లో), సునీల్ (53వ ని.లో), జెస్ నీలమ్ సంజీప్ (55వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 3–1తో జపాన్ను ఓడించింది. ప్రస్తుతం పట్టికలో కొరియా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. రెండింటిలో ఓడిన జపాన్ ఫైనల్ రేసుకు దూరమైంది. మంగళవారం జరిగే చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో జపాన్‌తో మలేసియా; కొరియాతో భారత్ తలపడతాయి. ఆఖరి మ్యాచ్‌లో జపాన్‌పై మలేసియా గెలిస్తే... భారత్–కొరియా మ్యాచ్‌లో నెగ్గిన జట్టు మలేసియాతో కలిసి ఫైనల్ చేరుతుంది. ఒకవేళ భారత్–కొరియా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే... భారత్, కొరియా, మలేసియా జట్లలో మెరుగైన గోల్స్ సగటు ఉన్న రెండు జట్లు ఫైనల్ చేరుకుంటాయి. -
ఆసియా కప్‌లో నేడు భారత్-పాకిస్తాన్ ‘ఢీ’
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జకార్తాలో నేడు జరిగే తొలి మ్యాచ్‌తో భారత హాకీ జట్టు ఆసియా కప్ టైటిల్ వేటను ప్రారంభించనుంది. బీరేంద్ర లాక్రా కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగనుంది. సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో భారత జట్టులో 10 మంది కొత్త ఆటగాళ్లకు తొలిసారి అవకాశం లభించింది. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ చానెల్లో, డిస్నీ–హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
తల్లి మెడలో కాంస్య పతకం.. ఒడిలో హాయిగా నిద్రపోయాడు
జలంధర్: టీమిండియా పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ చేసిన పని సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఒలింపిక్స్ నుంచి ఇటీవలే తన ఇంటికి చేరుకున్న మన్‌ప్రీత్ కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపాడు. ఒలింపిక్స్‌లో తాను సాధించిన కాంస్య పతకాన్ని తల్లికి చూపించి మురిసిపోయాడు. ఆ తర్వాత తన తల్లి మెడలో ఆ పతకాన్ని వేసి.. ఒడిలో హాయిగా నిద్రపోతున్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతం చేసింది. పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ లీగ్‌లో ఆస్ట్రేలియా మినహా మిగతా జట్లపై మంచి విజయాలను నమోదు చేసింది. ఇక సెమీస్‌లో బెల్జియం చేతిలో ఓడినప్పటికి.. జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో అద్భుతంగా ఆడిన మెన్స్ టీమ్ 5-4 తేడాతో విజయం సాధించి 41 ఏళ్ల పతక నిరీక్షణకు తెరదించింది. ఈ విజయంలో కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ కీలకం.. ఒత్తిడి సమయాల్లో జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. కాగా ఇటీవలే టోక్యో నుంచి స్వదేశానికి చేరుకున్న పురుషుల హాకీ జట్టు సభ్యులకు ఘన స్వాగతం లభించింది. View this post on Instagram A post shared by Manpreet Singh (@manpreetsingh07) -
కాంస్య పోరు: భారత్ వీరవిహార విజయం, 41 ఏళ్ల తర్వాత..
Tokyo Olympics 2020 Men Hockey Bronze Match: టగ్ ఆఫ్ వార్‌గా భావించిన పోరులో భారత్ జయకేతనం ఎగరేసింది. ఒలింపిక్స్ కాంస్యపు పోరులో మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ పురుషుల హాకీ టీం విజయం సాధించింది. ఆఖర్లో ఉత్కంఠను పెంచి 5-4 తేడాతో జర్మనీని ఓడించింది. తద్వారా దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్ పతకాన్ని ఖాతాలో వేసుకుంది ఇండియన్ మెన్స్ హాకీ టీం. ఇక పెనాల్టీ కార్నర్లు ఈ మ్యాచ్‌ను శాసించడం విశేషం. భారత కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం టోక్యోలోని ఒయి హాకీ స్టేడియం నార్త్ పిచ్‌లో జర్మనీ-భారత్ మధ్య కాంస్యం కోసం పోరు జరిగింది. ఆరంభంలో రెండో నిమిషంలోనే ప్రత్యర్థికి గోల్ కట్టబెట్టిన భారత్.. మొదట్లో తడబడినట్లు కనిపించింది. ఇక రెండో క్వార్టర్లో సిమ్రాన్‌జిత్ గోల్ కొట్టడంతో స్కోర్ 1-1తో సమంగా ముగిసింది. మూడో క్వార్టర్లో మాత్రం నువ్వా నేనా అన్నట్లు సాగింది మ్యాచ్. జర్మనీ రెండు గోల్స్ కొట్టగా.. ఆ వెంటనే భారత్ మరో గోల్ కొట్టింది. ఆపై పెనాల్టీ కార్నర్‌ను అందిపుచ్చుకుని హాఫ్ టైం ముగిసేసరికి 3-3తో సమం చేసింది భారత్. పూర్తి పైచేయి మూడో క్వార్టర్లో పూర్తిగా భారత్ డామినేషన్ కొనసాగింది. ఆరంభంలోనే ఓ గోల్ సాధించి.. 4-3తో ఆధిక్యం కనబరిచింది భారత్. ఆ వెంటనే మరో గోల్‌తో 5-3 ఆధిక్యంలో నిలిచి.. జర్మనీపై ఒత్తిడి పెంచింది. ఆపై ప్రత్యర్థికి మరో గోల్ దక్కకుండా డిఫెండింగ్ గేమ్ ఆడింది. మధ్యలో గోల్ అవకాశం దక్కినా.. ఇరు జట్లు తడబడడంతో మూడు క్వార్టర్ భారత్ వైపే ఆధిక్యంతో ముగిసింది. చివర్లో.. జర్మనీ గోల్‌తో స్కోర్ 4-5 అయ్యింది. ఇక అక్కడి నుంచి మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. మరో గోల్ దక్కకుండా చాలా ప్రయత్నించింది భారత్. ఆఖర్లో జర్మనీకి దక్కిన పెనాల్టీ కార్నర్ విఫలం కావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఆఖర్లో సెకన్ల వ్యవధిలో దక్కిన జర్మనీ షూట్ అవుట్ పెనాల్టీని అడ్డుకోవడంతో.. భారత్ విక్టరీ ఖాయమైంది. రియల్ హీరో.. హాకీ టీం గోల్ కీపర్ శ్రీజేష్.. చివర్లో షూట్ అవుట్ పెనాల్టీని అడ్డుకుని హీరో అనిపించుకున్నాడు. మన్‌ప్రీత్ సారథ్యంలో ఒలింపిక్ పతాక కలను సార్థకం చేశాడు. హాకీలో డిఫెండింగ్ దిగ్గజంగా కోచ్ గ్రాహం రెయిడ్.. సూచనలు భారత జట్టుకు ఎంతో ఉపకరించాయి. 17, 27, 29, 31, 34 నిమిషాల్లో గోల్స్ చేసిన భారత్జట్టులో 2 గోల్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు సిమ్రన్జీత్సింగ్. -
Tokyo Olympics: స్పెయిన్‌పై భారత్ ఘన విజయం; క్వార్టర్స్ ఆశలు సజీవం
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా స్పెయిన్‌తో జరిగిన గ్రూఫ్ మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు 3-0 తేడాతో ఘన విజయం సాధించింది.తొలి నుంచి స్పెయిన్‌పై పూర్తి ఆధిపత్యం చూపించిన భారత్ ఆటలో 14వ నిమిషంలో సిమ్రన్‌జిత్ సింగ్ తొలి గోల్‌తో మెరవగా.. 15వ నిమిషంలో రూపిందర్‌పాల్ సింగ్ రెండో గోల్‌తో మెరిశాడు. దీంతో తొలి క్వార్టర్ ముగిసేసరికి భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత జరిగిన రెండు, మూడు క్వార్టర్లలో భారత్ గోల్స్ చేయలేకపోయినా స్పెయిన్‌ను గోల్ చేయకుండా అడ్డుకుంది. ఇక చివరిదైన నాలుగో క్వార్టర్స్‌లో ఆట 51వ నిమిషంలో రూపిందర్‌పాల్ సింగ్ రెండో గోల్‌తో మెరవడంతో భారత్ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత నిర్ణీత సమయంలో స్పెయిన్ ఎలాంటి గోల్ చేయకపోవడంతో టీమిండియా విజయాన్ని సాధించింది. భారత్ తరపున రూపిందర్ పాల్ సింగ్ 2, సింగ్ సిమ్రన్‌జిత్ ఒక గోల్ చేశారు. కాగా ఈ విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కాగా టీమిండియా పురుషుల జట్టు తన తర్వాతి మ్యాచ్‌ను జూలై 29న అర్జెంటీనాతో ఆడనుంది. -
ప్రపంచ చాంపియన్‌కు భారత్ షాక్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ హాకీ లీగ్‌లో భారత పురుషుల జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. నెదర్లాండ్స్‌తో తొలి రౌండ్ రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన టీమిండియా... ప్రపంచ చాంపియన్ బెల్జియంతో శనివారం రెండో రౌండ్ తొలి మ్యాచ్‌లో 2–1తో సంచలన విజయం సాధించింది. ఆట రెండో నిమిషంలో మన్దీప్ సింగ్ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. 33వ నిమిషంలో బొకార్డ్ గోల్‌తో బెల్జియం స్కోరును సమం చేసింది. ఆ తర్వాత 47వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రమణ్‌దీప్ సింగ్ గోల్‌గా మలచడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు ఇదే వేదికపై ఈ రెండు జట్లు మళ్లీ తలపడతాయి. -
తొలి అడుగు పడింది
భువనేశ్వర్: సొంతగడ్డపై అశేష అభిమానుల సమక్షంలో భారత మహిళల, పురుషుల హాకీ జట్లు గెలుపు బోణీ కొట్టాయి. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి అంచె మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 5–1తో అమెరికాను ఓడించగా... భారత పురుషుల జట్టు 4–2తో రష్యాపై గెలుపొందింది. నేడు రెండో అంచె మ్యాచ్‌లు జరుగుతాయి. నేటి మ్యాచ్‌లను భారత జట్లు కనీసం ‘డ్రా’ చేసుకుంటే వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. మరోవైపు తొలి అంచె మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ... అమెరికా, రష్యా జట్లకు ‘టోక్యో’ దారులు ఇంకా సజీవంగానే ఉన్నాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో అమెరికా ఐదు గోల్స్ తేడాతో... రష్యా మూడు గోల్స్ తేడాతో భారత్‌పై గెలిస్తే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ‘టోక్యో’కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఒకవేళ అమెరికా నాలుగు గోల్స్ తేడాతో... రష్యా రెండు గోల్స్ తేడాతో గెలిస్తే మాత్రం గోల్స్ సగటు సమానం అవుతుంది. అలా జరిగిన పక్షంలో ‘షూటౌట్’ను నిర్వహించి దాని ద్వారా విజేతను తేలుస్తారు. ఆరు నిమిషాల్లో మూడు గోల్స్... తొలి క్వార్టర్లో నిదానంగా ఆడిన భారత మహిళల జట్టు రెండో క్వార్టర్ నుంచి వేగం పెంచింది. 28వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను లిలిమా మింజ్ లక్ష్యానికి చేర్చడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్ మరింత జోరు పెంచింది. మూడో క్వార్టర్లో మన అమ్మాయిలు చెలరేగిపోయారు. ఆరు నిమిషాల వ్యవధిలో ఏకంగా మూడు గోల్స్ చేసి 4–0తో ఆధిక్యంలోకి వెళ్లారు. 51వ నిమిషంలో భారత్ ఖాతాలో ఐదో గోల్ చేరింది. మ్యాచ్ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా అమెరికా ఏకైక గోల్ సాధించింది. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం అమెరికాపై భారత మహిళల జట్టుకిదే అతి పెద్ద విజయం. తమ ర్యాంక్‌లకు తగ్గ ఆటతీరును ప్రదర్శించిన భారత మహిళల, పురుషుల హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్ దిశగా అడుగు ముందుకేశాయి. క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా తొలి మ్యాచ్‌ల్లో భారత జట్లు గెలుపొందాయి. భారత మహిళల జట్టు అంచనాలకు మించి రాణించగా... భారత పురుషుల జట్టు మాత్రం బోణీ కొట్టడానికి శ్రమించాల్సి వచ్చింది. చెమటోడ్చి.... ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 22వ స్థానంలో ఉన్న రష్యా పురుషుల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత బృందానికి గట్టిపోటీనే ఎదురైంది. భారత బృందం గోల్స్ వర్షం కురిపిస్తుందని భావించినా అలాంటిదేమీ జరగలేదు. రష్యా డిఫెన్స్‌ను ఛేదించడంలో భారత ఫార్వర్డ్స్ ఇబ్బంది పడ్డారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న మన్‌ప్రీత్ సింగ్ బృందం మ్యాచ్ ముగియడానికి 12 నిమిషాలు ఉన్నాయనగా 2–1తో కేవలం ఒక గోల్ ఆధిక్యంలో ఉంది. అయితే ఐదు నిమిషాల వ్యవధిలో సునీల్, మన్దీప్ సింగ్ చెరో గోల్ సాధించి భారత్‌ను 4–1తో ఆధిక్యంలో నిలిపారు. అయితే చివరి నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రష్యా లక్ష్యానికి చేర్చి తమ ఖాతాలో రెండో గోల్‌ను జమ చేసుకుంది. మహిళల విభాగం మహిళల విభాగం 5 ►లిలిమా మింజ్ (28వ ని.లో) ►షర్మిలా దేవి (40వ ని.లో) ►గుర్జీత్ కౌర్ (42వ ని.లో) ►నవనీత్ కౌర్ (46వ ని.లో) ►గుర్జీత్ కౌర్ (51వ ని.లో) అమెరికా 1 ►ఎరిన్ మాట్సన్ (54వ ని.లో) పురుషుల విభాగం భారత్ 4 ►హర్మన్‌ప్రీత్ సింగ్ (5వ ని.లో) ►మన్దీప్ సింగ్ (24వ ని.లో) ►ఎస్వీ సునీల్ (48వ ని.లో) ►మన్దీప్ సింగ్ (53వ ని.లో) రష్యా 2 ►ఆండ్రీ కురయెవ్ (17వ ని.లో) ►మత్కోవ్స్కీ (60వ ని.లో) -
చక్ దే ఇండియా...
ప్రత్యర్థిగా దాయాది దేశం... ముఖాముఖి రికార్డూ అంతగా బాగాలేదు... లీగ్ దశలోనూ ఓటమి... ఎలాగైనా, ఈసారైనా గెలవాలనే ఒత్తిడి... ఈ నేపథ్యంలో భారత పురుషుల హాకీ జట్టు నరాలు తెగే ఉత్కంఠతను తట్టుకుంది. కొడితే కుంభస్థలం మీద కొట్టాలి అనే విధంగా అంతిమ సమరంలో అద్భుతం చేసింది. కీలక క్షణాల్లో సంయమనం కోల్పోకుండా ఆడింది. 48 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ‘షూటౌట్’లో బోల్తా కొట్టించి టీమిండియా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 16 ఏళ్ల తర్వాత ఏషియాడ్‌లో మళ్లీ పసిడి నెగ్గిన భారత్ 2016లో రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు నేరుగా అర్హత సాధించింది. ఫైనల్లో పాక్‌పై విజయం ►16 ఏళ్ల తర్వాత ఏషియాడ్‌లో స్వర్ణం ►2016 ఒలింపిక్స్‌కూ అర్హత ఇంచియాన్: ఆధిక్యంలో ఉండటం... ఆ తర్వాత వెనుకబడిపోవడం... ఇటీవల కాలంలో భారత హాకీ జట్టుకు అలవాటుగా మారింది. కానీ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా క్రీడల ఫైనల్లో మాత్రం భారత ఆటగాళ్లు శక్తివంచన లేకుండా పోరాడారు. తొలుత 0-1తో వెనుకబడినా... ఆ తర్వాత బెదరకుండా, నమ్మకం కోల్పోకుండా స్కోరును సమం చేశారు. నిర్ణీత సమయం పూర్తయ్యాక విజేతను నిర్ణయించే ‘షూటౌట్’లోనూ సంయమనం కోల్పోకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఫలితంగా 16 ఏళ్ల విరామం తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో మళ్లీ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా 2016 ఒలింపిక్స్ క్రీడలకు నేరుగా అర్హత సాధించింది. గురువారం జరిగిన ఫైనల్లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత్ ‘షూటౌట్’లో 4-2తో పాకిస్థాన్‌ను ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 1-1తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో ఫలితం తేలడానికి ‘షూటౌట్’ అనివార్యమైంది. ‘షూటౌట్’లో భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, బీరేంద్ర లాక్రా, ధరమ్వీర్ సింగ్ సఫలమయ్యారు. మన్‌ప్రీత్ సింగ్ విఫలమయ్యాడు. పాకిస్థాన్ తరఫున మహ్మద్ వకాస్, రసూల్ సఫలంకాగా... హసీమ్ ఖాన్, ఉమర్ విఫలమయ్యారు. ‘షూటౌట్’లో భారత గోల్‌కీపర్, వైస్ కెప్టెన్ శ్రీజేష్ చాకచక్యంగా వ్యవహరించి పాక్ ఆటగాళ్ల రెండు షాట్లను నిలువరించి ‘హీరో’గా అవతరించాడు. అంతకుముందు ఆట మూడో నిమిషంలో మహ్మద్ రిజ్వాన్ గోల్‌తో పాకిస్థాన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆట 27వ నిమిషంలో కొత్తాజిత్ సింగ్ గోల్‌తో భారత్ స్కోరును 1-1తో సమం చేసింది. లీగ్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో భారత ఆటగాళ్లు ఫైనల్లో బరిలోకి దిగారు. కానీ మూడో నిమిషంలోనే పాక్ గోల్ చేసి భారత్‌కు షాక్ ఇచ్చింది. అయితే భారత ఆటగాళ్లు వెంటనే ఈ పరిణామం నుంచి తేరుకున్నారు. సమన్వయంతో కదులుతూ పాక్‌పై ఒత్తిడిని పెంచారు. రెండో అర్ధభాగంలో భారత కృషి ఫలించింది. కొత్తాజిత్ గోల్‌తో భారత్ స్కోరును సమం చేసింది. ఆ తర్వాతి రెండు అర్ధ భాగాల్లో రెండు జట్లు మరో గోల్ చేయడంలో సఫలంకాలేదు. ►ఓవరాల్‌గా ఆసియా క్రీడల హాకీలో భారత్‌కిది మూడో స్వర్ణం. గతంలో టీమిండియా రెండుసార్లు (1966లో, 1998లో) బ్యాంకాక్‌లోనే జరిగిన క్రీడల్లో పసిడి పతకాలు గెలిచింది. ►ఆసియా క్రీడల ఫైనల్లో పాక్‌ను ఓడించడం భారత్‌కిది రెండోసారి మాత్రమే. చివరిసారి 1966 క్రీడల ఫైనల్లో భారత్ 1-0తో పాక్‌పై గెలిచింది. ‘‘ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గడం నా కెరీర్లోనే గొప్ప విజయంగా భావిస్తున్నాను. పసిడి సాధించి రియో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందాలనే ఏకైక లక్ష్యంతో ఇంచియాన్‌కు వచ్చాం. తుదకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాం. ఈ విజయంలో కోచ్ టెర్రీ వాల్ష్, సహాయక సిబ్బంది పాత్రను మరువలేం.’’ - సర్దార్ సింగ్, భారత కెప్టెన్