జకార్తా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. సూపర్–4 సెమీఫైనల్ లీగ్‌లో భాగంగా మలేసియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌ను భారత్ 3–3 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకుంది. ఒకదశలో భారత్ 0–2తో వెనుకబడి ఆ తర్వాత తేరుకొని 3–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ మ్యాచ్ ముగియడానికి నాలుగు నిమిషాలు ఉందనగా టీమిండియా గోల్ సమర్పించుకొని విజయం సాధించాల్సిన చోట ‘డ్రా’తో సంతృప్తి పడింది.
మలేసియా ప్లేయర్ రజీ రహీమ్ (12వ, 21వ, 56వ ని.లో) ‘హ్యాట్రిక్’ గోల్స్‌తో తమ జట్టుకు ఓటమి తప్పించాడు. టీమిండియా తరఫున విష్ణుకాంత్ సింగ్ (32వ ని.లో), సునీల్ (53వ ని.లో), జెస్ నీలమ్ సంజీప్ (55వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 3–1తో జపాన్‌ను ఓడించింది. ప్రస్తుతం పట్టికలో కొరియా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. రెండింటిలో ఓడిన జపాన్ ఫైనల్ రేసుకు దూరమైంది.
మంగళవారం జరిగే చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో జపాన్‌తో మలేసియా; కొరియాతో భారత్ తలపడతాయి. ఆఖరి మ్యాచ్‌లో జపాన్‌పై మలేసియా గెలిస్తే... భారత్–కొరియా మ్యాచ్‌లో నెగ్గిన జట్టు మలేసియాతో కలిసి ఫైనల్ చేరుతుంది. ఒకవేళ భారత్–కొరియా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే... భారత్, కొరియా, మలేసియా జట్లలో మెరుగైన గోల్స్ సగటు ఉన్న రెండు జట్లు ఫైనల్ చేరుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment