Tokyo Olympics 2020 Men Hockey Bronze Match: టగ్ ఆఫ్ వార్‌గా భావించిన పోరులో భారత్ జయకేతనం ఎగరేసింది. ఒలింపిక్స్ కాంస్యపు పోరులో మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ పురుషుల హాకీ టీం విజయం సాధించింది. ఆఖర్లో ఉత్కంఠను పెంచి 5-4 తేడాతో జర్మనీని ఓడించింది. తద్వారా దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్ పతకాన్ని ఖాతాలో వేసుకుంది ఇండియన్ మెన్స్ హాకీ టీం. ఇక పెనాల్టీ కార్నర్‌లు ఈ మ్యాచ్‌ను శాసించడం విశేషం.
భారత కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం టోక్యోలోని ఒయి హాకీ స్టేడియం నార్త్ పిచ్‌లో జర్మనీ-భారత్ మధ్య కాంస్యం కోసం పోరు జరిగింది. ఆరంభంలో రెండో నిమిషంలోనే ప్రత్యర్థికి గోల్ కట్టబెట్టిన భారత్.. మొదట్లో తడబడినట్లు కనిపించింది. ఇక రెండో క్వార్టర్‌లో సిమ్రాన్‌జిత్ గోల్ కొట్టడంతో స్కోర్ 1-1తో సమంగా ముగిసింది. మూడో క్వార్టర్‌లో మాత్రం నువ్వా నేనా అన్నట్లు సాగింది మ్యాచ్. జర్మనీ రెండు గోల్స్ కొట్టగా.. ఆ వెంటనే భారత్ మరో గోల్ కొట్టింది. ఆపై పెనాల్టీ కార్నర్‌ను అందిపుచ్చుకుని హాఫ్ టైం ముగిసేసరికి 3-3తో సమం చేసింది భారత్.
పూర్తి పైచేయి
మూడో క్వార్టర్‌లో పూర్తిగా భారత్ డామినేషన్ కొనసాగింది. ఆరంభంలోనే ఓ గోల్ సాధించి.. 4-3తో ఆధిక్యం కనబరిచింది భారత్. ఆ వెంటనే మరో గోల్‌తో 5-3 ఆధిక్యంలో నిలిచి.. జర్మనీపై ఒత్తిడి పెంచింది. ఆపై ప్రత్యర్థికి మరో గోల్ దక్కకుండా డిఫెండింగ్ గేమ్ ఆడింది. మధ్యలో గోల్ అవకాశం దక్కినా.. ఇరు జట్లు తడబడడంతో మూడు క్వార్టర్ భారత్ వైపే ఆధిక్యంతో ముగిసింది.
చివర్లో..
జర్మనీ గోల్‌తో స్కోర్ 4-5 అయ్యింది. ఇక అక్కడి నుంచి మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. మరో గోల్ దక్కకుండా చాలా ప్రయత్నించింది భారత్. ఆఖర్లో జర్మనీకి దక్కిన పెనాల్టీ కార్నర్ విఫలం కావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఆఖర్లో సెకన్ల వ్యవధిలో దక్కిన జర్మనీ షూట్ అవుట్ పెనాల్టీని అడ్డుకోవడంతో.. భారత్ విక్టరీ ఖాయమైంది.
రియల్ హీరో..
హాకీ టీం గోల్ కీపర్ శ్రీజేష్.. చివర్లో షూట్ అవుట్ పెనాల్టీని అడ్డుకుని హీరో అనిపించుకున్నాడు. మన్‌ప్రీత్ సారథ్యంలో ఒలింపిక్ పతాక కలను సార్థకం చేశాడు. హాకీలో డిఫెండింగ్ దిగ్గజంగా కోచ్ గ్రాహం రెయిడ్.. సూచనలు భారత జట్టుకు ఎంతో ఉపకరించాయి. 17, 27, 29, 31, 34 నిమిషాల్లో గోల్స్ చేసిన భారత్‌జట్టులో 2 గోల్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు సిమ్రన్‌జీత్‌సింగ్.
Comments
Please login to add a commentAdd a comment