వైమానిక రంగంలో పెట్టుబడులు పెట్టండి: సీఎం
సాక్షి, బెంగళూరు/హైదరాబాద్: విమానయానరంగ అభివృద్ధికి ఏపీలో విస్తృత అవకాశాలున్నందున.. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని విమానయానరంగ సంస్థలను రాష్ర్ట సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. బెంగళూరులో జరుగుతున్న భారత వైమానిక ప్రదర్శన-2015(ఏరో ఇండియా-15)కు గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏరోస్పేస్, డిఫెన్స్ విభాగాలకు చెందిన 11 ప్రముఖ సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలపైన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రష్యాకు చెందిన సుఖోయ్ సికోర్ స్కీ, యూటీసీ, రాఫెల్, బోయింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ తదితర సంస్థల ప్రతినిధులు బెంగళూరులో సీఎంను కలిసినట్టు ఓ అధికార ప్రకటన తెలియజేసింది.
రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమ
రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు జపాన్‌కు చెందిన మయేవక మాన్యుఫాక్చరింగ్ సంస్థ ఆసక్తి చూపింది. సంస్థ ప్రతినిధులు గురువారం సీఎంను ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రానికి రూ. 900 కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని తమ సంస్థ యోచిస్తోందని మయేవక సంస్థ చైర్మన్ యోషిరో తనకా చెప్పారని సీఎం సమాచార కార్యాలయం తెలిపింది.