ట్రంప్ గెలుస్తాడంటున్న ఎన్నారై
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావాలని కోరుకుంటున్నామని భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త శలభ్ కుమార్ తెలిపారు. ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా మారిన తీవ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా ట్రంప్ కు మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు. ఇమ్మిగ్రేషన్, వాణిజ్యం, ఇండియన్/హిందు, అమెరికన్స్, రక్షణ వంటి కీలక అంశాల్లో భారత్ కు అనుకూలంగా హిల్లరీ క్లింటన్ కు ఒక విధానమంటూ లేదని విమర్శించారు. హిల్లరీ అమెరికాకు ఒరిగింది ఏమీ లేదన్నారు.
ప్రపంచం ఇప్పుడు రాజకీయేతర వ్యక్తిని కోరుకుంటోందని, పొలిటిషయన్ ను కాదని వ్యాఖ్యానించారు. అందుకే తాము ట్రంప్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్టు చెప్పారు. 21వ శతాబ్దం ఇండో-అమెరికన్ శతాబ్దం కావాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. ట్రంప్ కు అమెరికా, మానవత్వం పట్ల ఎంతో ప్రేమ ఉందని శలభ్ కుమార్ తెలిపారు. కాగా, ట్రంప్ ఎన్నికల ప్రచారానికి శలభ్ కుమార్ అత్యధిక నిధులు ఇచ్చారు.