పిల్లాడి మరణం.. భారత సంతతి తల్లిదండ్రుల అరెస్టు
అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో 19 నెలల పిల్లాడు చనిపోవడంతో అతడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. బేబీ సిట్టర్ నేలకేసి కొట్టడంతో ఆ పిల్లాడి తల పగిలి, లోపల అంతర్గత రక్తస్రావం కూడా ఎక్కువగా అయ్యింది. దీంతో శస్త్రచికిత్స చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ కేసులో ముందుగానే బేబీ సిట్టర్ కింజల్ పటేల్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. పిల్లాడి మృతి అనంతరం తల్లిదండ్రులు శివకుమార్ మణి (33), తెనిమొళి రాజేంద్రన్ (24)లను కూడా అరెస్టు చేశారు.
పిల్లాడికి ప్రమాదం కలిగేలా ప్రవర్తించి, బేబీ సిట్టర్ వద్ద వదిలేసిన నేరానికి గాను తల్లిదండ్రులు ఇద్దరిపై అభియోగాలు నమోదు చేశారు. పిల్లవాడిపై తనకు బాగా కోపం వచ్చిందని, అందుకే అతడిని న్యూహావెన్ నగరంలోని తన ఇంట్లో నేలకేసి విసిరికొట్టానని కింజల్ పటేల్ పోలీసులకు తెలిపింది. దాంతో అతడి కపాలం పగిలిపోయింది.