ఆసియా కప్‌లో భారత్ శుభారంభం.. బంగ్లాదేశ్‌పై విజయం
ఫతుల్లా: ఆసియా కప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్లతో అలవోక విజయం సాధించింది. 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి మరో ఆరు బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. విరాట్ కోహ్లీ (122 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 136) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును విజయానికి చేరువ చేశాడు. వన్డేల్లో అతడికిది 19వ సెంచరీ కావడం విశేషం. 131 వన్డేల్లోనే అతడీ ఘనత సాధించాడు. రహానె (73) హాఫ్ సెంచరీ చేశాడు.
అంతకుముందు టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసింది. బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. 112 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 117 పరుగులు చేసి చివరి ఓవర్లో అవుటయ్యాడు. ఓపెనర్ అనాముల్ హక్(77) అర్థ సెంచరీ కొట్టాడు. మోమినల్ హక్ 23, నయీమ్ ఇస్లాం 14, జియావుర్ రెహమాన్ 18, షంసూర్ రెహమాన్ 7 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లు పడగొట్టాడు. ఆరోన్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు.