భారత కంపెనీలు..వ్యాక్సిన్ హీరోలు
దావోస్: భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని కంపెనీలు వ్యాక్సిన్లను తక్కువ ధరకు అందిస్తున్నాయని ప్రపంచ కుబేరుడు, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్మన్ బిల్ గేట్స్ కితాబిచ్చారు. ఒక్క డోస్ వ్యాక్సిన్ను ఒక్క డాలర్లోపు ధరలకు అందించడం ద్వారా చిన్నారులను ప్రాణాంతక వ్యాధులనుంచి ఈ కంపెనీలు రక్షిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశానికి వచ్చిన ఆయన డబ్ల్యూఈఎఫ్ బ్లాగ్లో ఈ విషయాలు వెల్లడించారు.
గతంలో మనమెన్నడూ వినని కొన్ని కంపెనీలు- సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ, చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్, తదితర కంపెనీలు అంతర్జాతీయంగా ఆరోగ్యాన్ని పెంపొందించే తమ భాగస్వామ్య కంపెనీల్లో కొన్నని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఆరోగ్యం పట్ల గతంలో కంటే ఎక్కువ భరోసాని ఈ వ్యాక్సిన్ కంపెనీలు కల్పిస్తున్నాయని బిల్గేట్స్ పేర్కొన్నారు. అధిక నాణ్యత గల వ్యాక్సిన్లను చౌక ధరలకే ఈ కంపెనీలు అందిస్తున్నాయని ఆయన ప్రశంసించారు.