ఆ ఫొటోలు ఏమిటి?
భారత క్రికెటర్లపై బోర్డు ఆగ్రహం
ముంబై: వెస్టిండీస్ పర్యటనలో భారత క్రికెటర్ల వేషాలు కాస్త శృతి మించడంతో బీసీసీఐ వెంటనే స్పందించింది. ప్రాక్టీస్ మ్యాచ్ల మధ్య విరామంలో భారత క్రికెటర్లు బీచ్లలో తిరుగుతూ సందడి చేస్తున్న అనేక ఫొటోలు నెట్లో దర్శనమిచ్చాయి. అయితే క్రికెటర్లు బీర్ బాటిల్స్ పట్టుకుని ఫొటోలు దిగి ట్విట్టర్లో ఉంచడంతో బోర్డు హెచ్చరికలు పంపింది. రెండు రోజుల క్రితం ప్రఖ్యాత సెయింట్ నెవిస్ బీచ్లో దిగిన ఫొటోలో కేఎల్ రాహుల్ చేతిలో బీరు బాటిల్ ఉండగా పక్కన బిన్నీ, ఉమేశ్ యాదవ్ ఉన్నారు.
ఈ విషయంపై వెంటనే టీమ్ మేనేజర్ రియాజ్ బగ్వాన్తో బోర్డు అధికారులు మాట్లాడారు. ‘సోషల్ మీడియాలో అలాంటి ఫొటోలు రావడంపై బోర్డులోని కొంత మంది అధికారులు సంతృప్తిగా లేరు. ఆన్లైన్లో పోస్టు చేసేటప్పుడు బాధ్యతగా మెలగాలి. దేశంలోని యువత గుడ్డిగా స్టార్ క్రికెటర్లను అనుసరిస్తారు. అభిమానులను దృష్టిలో ఉంచుకుని విజ్ఞతతో మెలగడంతో పాటు వారికి ఆదర్శంగా ఉండాలి’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. బోర్డు హెచ్చరికతో ఆటగాళ్లు వెంటనే తమ ట్విట్టర్ నుంచి ఆ ఫొటోను తొలగించారు.