జీవనోపాధికి వెళ్లి శవమై వచ్చాడు
సుల్తానాబాద్(కరీంనగర్) : కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ మండలంలో గర్రెపల్లి గ్రామానికి చెందిన కల్లెపల్లి మల్లేశం(48) అనే వ్యక్తి గతనెల 21వ తేదీన దుబాయ్‌లో మృతి చెందాడు. అతని మృతదేహం దుబాయ్ నుండి శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరింది. దుబాయ్‌లోని అబుదాబిలో రోజూ మాదిరిగానే విధులకు వెళ్లి వచ్చి రూమ్‌లో నిద్రిస్తుండగా షాట్ సర్య్కూట్ అయ్యింది. ఆ ప్రమాదంలో మల్లేశం అక్కడికక్కడే మృతిచెందాడు.
2011 మే నెలలో జీవనోపాధి కోసం గ్రామం వదిలి వెళ్లాడు మల్లేశం. మరికొద్ది రోజుల్లో ఇంటికి తిరిగి వస్తానని చెప్తూ ఉత్సాహంగా గడుపుతోన్న మల్లేశం.. ప్రమాదశాత్తూ విద్యుత్‌షాక్ తగిలి మృతిచెందడంతో అతని కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. మృతునికి భార్య రజని, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కాగా మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు గ్రామస్థులు చంద్రయ్యతో పాటు పలువురు సహకారం అందించారు. మల్లేశం మృతితో గర్రెపల్లి గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.