Indian Engineering Services
-
కర్మయోగి స్ఫూర్తితో...
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఐఇఎస్–2022)లో హైదరాబాద్‌కు చెందిన పవన్ స్వరూప్ రెడ్డి 5వ ర్యాంక్ సాధించాడు. సూరత్ ‘నిట్’ లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన పవన్ స్వరూప్‌రెడ్డి ఐఐటీ, కాన్పూర్‌లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చేశాడు. ‘మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన డా.శ్రీధరన్ ఆటోబయోగ్రఫీ ‘కర్మ యోగి’ చదివాడు పవన్ స్వరూప్. ఈ పుస్తకం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బలమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి కారణం అయింది. శ్రీధరన్ చేసిన ప్రతిష్ఠాత్మకమైనప్రాజెక్ట్లతో స్ఫూర్తి పొందిన పవన్ స్వరూప్ ఇంజనీరింగ్ సర్వీస్‌లలోకి రావాలనుకున్నాడు. తనను ఐ.ఇ.ఎస్ ఆఫీసర్‌గా చూడాలనేది తల్లి కల. తండ్రి ఆంజనేయులురెడ్డి ఇదే పరీక్షల్లో ఒకప్పుడు 13వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్‌లో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. బెంగళూరులోని అమెరికాకు చెందిన ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో స్ట్రక్చరల్ ఇంజనీర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు రోజుకు 5–6 గంటలు, సెలవు రోజు 8–10 గంటల పాటు ‘ఐఇఎస్’ పరీక్షల కోసం ప్రిపేరయ్యేవాడు. ‘ఒకవైపు ఉద్యోగబాధ్యతలకు వందశాతం న్యాయం చేయాలి. మరోవైపు ఆఫీస్ నుంచి వచ్చిన తరువాత పరీక్షలకు గట్టిగా ప్రిపేర్ కావాలి’ అనుకొని రంగంలోకి దిగాడు. స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పెట్టాడు. స్టడీ మెటీరియల్ మాత్రమే తన కళ్ల ముందు కనిపించేది. స్వరూప్ కష్టం వృథాపోలేదు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో 5వ ర్యాంకుతో విజయకేతనం ఎగరేశాడు. ‘ఒక్కసారి మీ ప్రయత్నంలో విఫలం అయితే ఎంతమాత్రం నిరాశ పడనక్కర్లేదు. మనం చేసిన తప్పుల నుంచి కూడా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఏంచేయకూడదో తెలుసుకోవచ్చు. మనం నిర్దేశించుకున్న లక్ష్యంపై గట్టి సంకల్పబలం ఉంటే విజయం దక్కడం కష్టమేమీ కాదు’ అంటున్న పవన్ స్వరూప్‌రెడ్డి తన వృత్తిజీవితంలో విజయాలు సాధించాలని ఆశిద్దాం. -
ఐఈఎస్ టాపర్ అమన్
సాక్షి, హైదరాబాద్ , కాజీపేట అర్బన్ : ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)–2018లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)–వరంగల్ విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టాపర్‌తో పాటు మరో రెండు అత్యుత్తమ ర్యాంకులతో రికార్డు సృష్టించారు. శనివారం ఐఈఎస్–2018 ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో నిట్–వరంగల్ విద్యార్థి అమన్‌జైన్ నేషనల్ టాపర్‌గా నిలిచాడు. అమన్ నిట్–వరంగల్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇదే కాలేజీ నుంచి అంకిత్ (ఎలక్ట్రికల్) 36వ ర్యాంకు, ప్రభాత్ పాండే (ఎలక్ట్రికల్) 46వ ర్యాంకు సాధించారు. గతేడాది ‘గేట్’లోనూ తమ విద్యార్థి నేషనల్ టాపర్‌గా నిలిచారని నిట్–వరంగల్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు ‘సాక్షి’తో తెలిపారు. క్యాట్, జీఆర్ఈల్లోనూ అత్యుత్తమ ఫలితాలు సాధించామన్నారు. మూడేళ్ల నుంచి వరుసగా రికార్డులు సాధిస్తున్నామని, ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. -
భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీక
న్యూఢిల్లీ: ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’(ఐక్యతా విగ్రహం) కేవలం సర్దార్ వల్లభ్‌భాయ్‌కి మాత్రమే ఘన నివాళే అని కాకుండా భారత ఇంజనీరింగ్ నైపుణ్యాలకూ గొప్ప ప్రతీక అని నిర్మాణరంగ దిగ్గజం ఎల్అండ్టీ పేర్కొంది. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందిన చైనా స్ప్రింగ్ దేవాలయాల్లో ఉన్న బుద్ధ విగ్రహం (153 మీ.) నిర్మాణానికి 11 ఏళ్లు పడితే..ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ ఎల్అండ్టీ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని కేవలం 33 నెలల్లోనే పూర్తి చేసినట్లు వెల్లడించింది. విగ్రహాన్ని రోడ్డు మార్గంలో నుంచి చూస్తే 182 మీటర్లు, నదీ మార్గం నుంచి చూస్తే 208.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (93 మీ.) కంటే ఇది రెట్టింపు ఎత్తు ఉంటుంది. రూ.2,989 కోట్లతో నిర్మితమైన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని అక్టోబర్ 31న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ స్టాట్యూను 5 జోన్లుగా విభజించారు. మొదటి జోన్లో మెమోరియల్ గార్డెన్, మ్యూజియం, రెండో జోన్లో 149 మీ. విగ్రహమే ఉంటుంది. మూడో జోన్లో 153 మీ. వరకు గ్యాలరీ, నాలుగో జోన్లో మెయింట నెన్స్ ఏరియా, ఐదో జోన్లో పటేల్ భుజాలు, తల ఉంటుందని ఎల్అండ్టీ పేర్కొంది. గ్యాలరీలో ఒకేసారి 200 మంది తిరగవచ్చు. -
ఐఈఎస్‌లో మెరిసిన రైతు పుత్రుడు
కేంద్రపడ: ఒడిశాలో ఓ పేదరైతు కుటుంబానికి చెందిన శిశిర్ కుమార్ ప్రధాన్ అనే విద్యార్థి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (ఐఈఎస్)కు ఎంపికై సత్తా చాటాడు. లక్షల మంది కలగనే విజయాన్ని తన కుమారుడు 25 ఏళ్లకే సాధించాడని చెబుతూ శిశిర్ తండ్రి బాబాజీ ఛరానా ప్రధాన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. కేంద్రపడ జిల్లాలోని నిగినీపూర్కు చెందిన శిశిర్ తండ్రి ఓ సాధారణ రైతు. తన తండ్రి కష్టపడి చదివిస్తూ తనను ప్రోత్సహించారని శిశిర్ తెలిపారు. గ్రామంలోని పాఠశాలలో హెచ్ఎస్సీ, కేంద్రపడ కాలేజీలో ప్లస్‌టూ చదివిన శిశిర్ తర్వాత ఎన్ఐటీ రూర్కెలాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం ఎన్ఐటీ భోపాల్‌లో సుస్థిర ఇంధనం (రిన్యూవెబుల్ ఎనర్జీ)లో ఎంటెక్ చేస్తున్నారు. -
సక్సెస్ స్పీక్స్: చేనేత ఇంట ఐఈఎస్ విజేత
‘‘ఇంజనీరింగ్ పూర్తవ్వగానే కార్పొరేట్ కొలువు సాధించటం ఒక్కటే లక్ష్యం కాకూడదు.. విస్తృతంగా ఆలోచిస్తే ఎన్నో విభిన్న అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.. వాటిని అందుకోవడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవడం సులువంటున్నారు’’ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) పరీక్షలో జాతీయ స్థాయిలో 7వ ర్యాంక్ సాధించిన అడెపు అనిల్ కుమార్. లక్షల మంది హాజరైన ఐఈఎస్ పరీక్షలో విజేతగా నిలిచిన క్రమం, అందుకు పడ్డ శ్రమ తదితర అంశాలపై అనిల్ అనుభవాలు... పరీక్ష రాసిన తర్వాత మంచి ర్యాంకు వస్తుందనుకున్నా కానీ... ఏడో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. దేశ పరిపాలన విభాగంలో సివిల్ సర్వీసెస్‌కు ఎంతటి ప్రాధాన్యత ఉందో.. టెక్నికల్ సర్వీసెస్‌లో ఐఈఎస్‌కు అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. ఇంజనీరింగ్ సర్వీసెస్‌లోని టాప్ 10 విభాగాల్లో రైల్వే సర్వీసెస్‌కు నా ఆప్షన్. అన్నయ్యే స్ఫూర్తి: మా స్వస్థలం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. నాన్న సుదర్శన్ చేనేత వ్యాపారి. అమ్మ నిర్మల గృహిణి. అన్నయ్య వంశీకృష్ణ సాఫ్ట్వేర్ ఇంజనీర్. చదువు, కెరీర్ విషయంలో అన్నయ్యే నాకు స్ఫూర్తి. అన్నయ్య ద్వారానే చదువు విలువ తెలిసింది. తాను చదువుతూ నన్ను ప్రోత్సహించేవాడు. కెరీర్‌ను ఎలా మలచుకోవాలో తన నుంచే నేర్చుకున్నా. చదువులో బెస్ట్: పాఠశాల స్థాయి నుంచే చదువులో చురుగ్గా ఉండేవాణ్ని. 10వ తరగతి 552 మార్కులతో పూర్తిచేశా. ఇంటర్మీడియెట్‌లో 967 మార్కులు వచ్చాయి. నిట్-వరంగల్ నుంచి 8.8 సీజీపీఏతో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. 10వ తరగతి వరకూ తెలుగు మీడియంలోనే చదివా. స్నేహితులతో సంభాషించడం, నవలలు చదవటం, ఇంగ్లిష్ పత్రిక పఠనంతో ఇంగ్లిష్ భాష, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగయ్యాయి. ఇంగిష్పై పట్టుసాధించేందుకు ‘వర్డ్ పవర్ మేడ్ ఈజీ’ పుస్తకం కూడా ఉపకరించింది. క్యాంపస్‌లో ఉన్నప్పుడే ఎల్ అండ్ టీలో ప్లేస్మెంట్ లభించింది. తర్వాత రైట్ అనే ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలోనే ఐఈఎస్ ప్రిపరేషన్‌కు ఆరు నెలల గ్యాప్ తీసుకున్నా. ఆరు నెలలు.. ఎనిమిది గంటలు: ఐఈఎస్ చాలా కఠినమైన పరీక్ష. అందులో అడిగే ప్రశ్నలు కూడా క్లిష్టంగానే ఉంటాయి. అందుకే ఆరు నెలలు పక్కా ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ సాగించా. ఉద్యోగ బాధ్యతల తర్వాత ఇంటికి వచ్చినప్పటి నుంచి రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు చదివే వాణ్ని. కాన్సెప్ట్‌ల వారీగా ప్రిపేర్ అయ్యేవాణ్ని. ఉద్యోగం చేస్తూండడంతో ఆ ఫీల్డ్ నాలెడ్జ్ సబ్జెక్ట్‌పై మరింత పట్టు పెంచుకునేందుకు దోహదం చేసింది. కోచింగ్ సమయంలో రాసే టెస్ట్ సిరీస్‌లో టాప్‌టెన్‌లో నిలిచేవాణ్ని. దాంతో తప్పకుండా మంచి ర్యాంక్ వస్తుందని భావించా. టెస్ట్ సిరీస్ రాసేటపుడు చేసిన తప్పులను సరిదిద్దుకునేవాణ్ని. మరోసారి వాటి జోలికివెళ్లకుండా జాగ్రత్తపడేవాణ్ని. ఇంటర్వ్యూ ఇలా: నా ఇంటర్వ్యూ 15 నిమిషాలపాటు సాగింది. హాబీస్‌గా పేర్కొన్న బ్యాడ్మింటన్‌కు సంబంధించి రెండు మూడు ప్రశ్నలు అడిగారు. తర్వాత ఇంటర్వ్యూ మొత్తం పూర్తిగా టెక్నికల్ అంశాలపైనే కేంద్రీకృతమైంది. ఈ క్రమంలో టెక్నికల్, నీటివనరులకు సంబంధించిన ప్రాజెక్టులు, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ తదితర అంశాలపై ప్రశ్నలు అడిగారు. మీరూ సాధించవచ్చు: సబ్జెక్ట్‌పై పట్టు.. ప్రణాళిక ప్రకారం ప్రిపేరైతే సాధారణ విద్యారులు కూడా ఐఈఎస్‌లో విజేతలుగా నిలవొచ్చు. ఐఈఎస్ వైపు రావాలని ఆసక్తి ఉంటే.. ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో పూర్తిస్థాయి పరిజ్ఞానం, ప్రతి రోజూ ఆన్లైన్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్ట్లను సాధన చేయటం కీలకం. సబ్జెక్ట్ పరంగా అప్డేట్గా ఉంటూ, ప్రశ్నలు ఏవిధంగా ఇచ్చినా రాసేలా ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్‌కు కనీసం ఆరు నెలల సమయమైనా కేటాయించాలి. ఐఈఎస్‌లో ప్రశ్నల తీరు కూడా మారుతోంది. టెక్నాలజీ అప్డేట్ అవుతున్న కొద్దీ తదనుగుణంగా ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఇంజనీరింగ్‌లోని అన్ని సబ్జెక్ట్‌లలో పట్టు సాధించాలి. ఐఈఎస్ ఎంపిక క్రమంలో రాతపరీక్ష 1000 మార్కులు, ఇంటర్వ్యూ 200 మార్కులకు ఉంటుంది. రాతపరీక్షలో 500 పైగా మార్కులు సాధిస్తే ఇంటర్వ్యూకు అవకాశం లభిస్తుంది.