సక్సెస్ స్పీక్స్: చేనేత ఇంట ఐఈఎస్ విజేత | Success Speaks about IES Victory | Sakshi
Sakshi News home page

సక్సెస్ స్పీక్స్: చేనేత ఇంట ఐఈఎస్ విజేత

Published Wed, Mar 12 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM

సక్సెస్ స్పీక్స్: చేనేత ఇంట ఐఈఎస్ విజేత

సక్సెస్ స్పీక్స్: చేనేత ఇంట ఐఈఎస్ విజేత

‘‘ఇంజనీరింగ్ పూర్తవ్వగానే కార్పొరేట్ కొలువు సాధించటం ఒక్కటే లక్ష్యం కాకూడదు.. విస్తృతంగా ఆలోచిస్తే ఎన్నో విభిన్న అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.. వాటిని అందుకోవడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవడం సులువంటున్నారు’’  ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) పరీక్షలో  జాతీయ స్థాయిలో 7వ ర్యాంక్ సాధించిన అడెపు అనిల్ కుమార్. లక్షల మంది హాజరైన  ఐఈఎస్ పరీక్షలో విజేతగా నిలిచిన క్రమం, అందుకు పడ్డ శ్రమ తదితర అంశాలపై అనిల్ అనుభవాలు...
 
 పరీక్ష రాసిన తర్వాత మంచి ర్యాంకు వస్తుందనుకున్నా కానీ... ఏడో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. దేశ పరిపాలన విభాగంలో సివిల్ సర్వీసెస్‌కు ఎంతటి ప్రాధాన్యత ఉందో.. టెక్నికల్ సర్వీసెస్‌లో ఐఈఎస్‌కు అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. ఇంజనీరింగ్ సర్వీసెస్‌లోని టాప్ 10 విభాగాల్లో రైల్వే సర్వీసెస్‌కు నా ఆప్షన్.
 
 అన్నయ్యే స్ఫూర్తి:
 మా స్వస్థలం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. నాన్న సుదర్శన్ చేనేత వ్యాపారి. అమ్మ నిర్మల గృహిణి. అన్నయ్య వంశీకృష్ణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. చదువు, కెరీర్ విషయంలో అన్నయ్యే నాకు స్ఫూర్తి. అన్నయ్య ద్వారానే చదువు విలువ తెలిసింది. తాను చదువుతూ నన్ను ప్రోత్సహించేవాడు. కెరీర్‌ను ఎలా మలచుకోవాలో తన నుంచే నేర్చుకున్నా.
 
 చదువులో బెస్ట్:
 పాఠశాల స్థాయి నుంచే చదువులో చురుగ్గా ఉండేవాణ్ని. 10వ తరగతి 552 మార్కులతో పూర్తిచేశా. ఇంటర్మీడియెట్‌లో 967 మార్కులు వచ్చాయి. నిట్-వరంగల్ నుంచి 8.8 సీజీపీఏతో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. 10వ తరగతి వరకూ తెలుగు మీడియంలోనే చదివా. స్నేహితులతో సంభాషించడం, నవలలు చదవటం, ఇంగ్లిష్ పత్రిక పఠనంతో ఇంగ్లిష్ భాష, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగయ్యాయి. ఇంగిష్‌పై పట్టుసాధించేందుకు ‘వర్డ్ పవర్ మేడ్ ఈజీ’ పుస్తకం కూడా ఉపకరించింది. క్యాంపస్‌లో ఉన్నప్పుడే ఎల్ అండ్ టీలో ప్లేస్‌మెంట్ లభించింది. తర్వాత రైట్ అనే ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలోనే ఐఈఎస్ ప్రిపరేషన్‌కు ఆరు నెలల గ్యాప్ తీసుకున్నా.
 
 ఆరు నెలలు.. ఎనిమిది గంటలు:
 ఐఈఎస్ చాలా కఠినమైన పరీక్ష. అందులో అడిగే ప్రశ్నలు కూడా క్లిష్టంగానే ఉంటాయి. అందుకే ఆరు నెలలు పక్కా ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ సాగించా. ఉద్యోగ బాధ్యతల తర్వాత ఇంటికి వచ్చినప్పటి నుంచి రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు చదివే వాణ్ని. కాన్సెప్ట్‌ల వారీగా ప్రిపేర్ అయ్యేవాణ్ని. ఉద్యోగం చేస్తూండడంతో ఆ ఫీల్డ్ నాలెడ్జ్ సబ్జెక్ట్‌పై మరింత పట్టు పెంచుకునేందుకు దోహదం చేసింది. కోచింగ్ సమయంలో రాసే టెస్ట్ సిరీస్‌లో టాప్‌టెన్‌లో నిలిచేవాణ్ని. దాంతో తప్పకుండా మంచి ర్యాంక్ వస్తుందని భావించా. టెస్ట్ సిరీస్ రాసేటపుడు చేసిన తప్పులను సరిదిద్దుకునేవాణ్ని. మరోసారి వాటి జోలికివెళ్లకుండా జాగ్రత్తపడేవాణ్ని.
 
 ఇంటర్వ్యూ ఇలా:
 నా ఇంటర్వ్యూ 15 నిమిషాలపాటు సాగింది. హాబీస్‌గా పేర్కొన్న బ్యాడ్మింటన్‌కు సంబంధించి రెండు మూడు ప్రశ్నలు అడిగారు. తర్వాత ఇంటర్వ్యూ మొత్తం పూర్తిగా టెక్నికల్ అంశాలపైనే కేంద్రీకృతమైంది. ఈ క్రమంలో టెక్నికల్, నీటివనరులకు సంబంధించిన ప్రాజెక్టులు, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ తదితర అంశాలపై ప్రశ్నలు అడిగారు.
 
 మీరూ సాధించవచ్చు:
 సబ్జెక్ట్‌పై పట్టు.. ప్రణాళిక ప్రకారం ప్రిపేరైతే సాధారణ విద్యారులు కూడా ఐఈఎస్‌లో విజేతలుగా నిలవొచ్చు. ఐఈఎస్ వైపు రావాలని ఆసక్తి ఉంటే.. ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో పూర్తిస్థాయి పరిజ్ఞానం, ప్రతి రోజూ ఆన్‌లైన్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్ట్‌లను సాధన చేయటం కీలకం. సబ్జెక్ట్ పరంగా అప్‌డేట్‌గా ఉంటూ, ప్రశ్నలు ఏవిధంగా ఇచ్చినా రాసేలా ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్‌కు కనీసం ఆరు నెలల సమయమైనా కేటాయించాలి. ఐఈఎస్‌లో ప్రశ్నల తీరు కూడా మారుతోంది. టెక్నాలజీ అప్‌డేట్ అవుతున్న కొద్దీ తదనుగుణంగా ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఇంజనీరింగ్‌లోని అన్ని సబ్జెక్ట్‌లలో పట్టు సాధించాలి. ఐఈఎస్ ఎంపిక క్రమంలో రాతపరీక్ష 1000 మార్కులు, ఇంటర్వ్యూ 200 మార్కులకు ఉంటుంది. రాతపరీక్షలో 500 పైగా మార్కులు సాధిస్తే ఇంటర్వ్యూకు అవకాశం లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement