Indian Gaming Start-Ups
-
ఇండియన్ ఎకానమీలో ఈ–గేమింగ్ హవా!
న్యూఢిల్లీ: డిజిటల్ ఎకానమీలో భాగంగా ఈ–స్పోర్ట్స్, ఈ–గేమింగ్ విభాగాలు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించగలవని ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్) పేర్కొంది. ఆన్లైన్ గేమింగ్‌ను నిషేధించాలన్న ప్రతిపాదనలను కొన్ని హైకోర్టులు తోసిపుచ్చిన నేపథ్యంలో ఈ రంగానికి సంబంధించి రాష్ట్రాల ప్రభుత్వాలు తగు మార్గదర్శకాలు రూపొందించాలని ఒక ప్రకటనలో కోరింది. ఇటీవలి అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ దేశీయంగా గేమింగ్ మార్కెట్ 2025 నాటికి 6–7 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుందని ఏఐజీఎఫ్ తెలిపింది. ప్రస్తుతం ఇది 1.8 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. ‘భారత్‌లో 200 పైగా ప్లాట్‌ఫామ్స్‌లో 20 కోట్ల మంది పైగా ఈ–గేమర్లు ఆడుతున్నారు. డిజిటల్ ఎకానామీ గొడుగు కింద ఈ–స్పోర్ట్స్, ఈ–గేమింగ్ విభాగాలు దేశ ఎకానమీ వృద్ధిలో కీలక పాత్ర పోషించగలవు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదిగే దిశగా.. ఈ–గేమింగ్ పరిశ్రమకు భారీ స్థాయిలో విధానపరమైన మార్గదర్శకాలు, డిజిటల్ ఇన్ఫ్రా అవసరం‘ అని ఏఐజీఎఫ్ ప్రెసిడెంట్ పి.కె. మిశ్రా తెలిపారు. అంతర్జాతీయంగా గుర్తింపు.. ఈ–స్పోర్ట్స్, ఈ–గేమింగ్ ప్లేయర్లు అంతర్జాతీ యంగా కూడా గుర్తింపు పొందుతున్నారని ఏఐజీఎఫ్ తెలిపింది. 2022 సెప్టెంబర్‌లో జరిగే ఏషియన్ గేమ్స్‌లో తొలిసారిగా ఈ–స్పోర్ట్స్ కేటగిరీని కూడా అధికారికంగా చేర్చినట్లు వివరించింది. కీలకమైన గ్లోబల్ మార్కెట్లలో భారత్ కూడా చేరబోతోందని మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) సహ వ్యవస్థాపకుడు, సీఈవో సాయి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
గేమింగ్ స్టార్టప్‌లలోకి రిలయన్స్
భారతదేశంలో మొబైల్ గేమింగ్ క్రమేపీ బలంగా పుంజుకుంటోంది. ఈ రంగంలో స్టార్టప్‌లూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న గేమింగ్ మార్కెట్‌పై రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఎక్కువగా దృష్టిసారించింది. ఈ ఏడాది 20 గేమింగ్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. వీటికి మార్కెటింగ్, టెక్నాలజీ పరంగా సాయపడేందుకు రూ. 33.28 లక్షల (50వేల డాలర్లు) పెట్టుబడులను రిలయన్స్ గేమ్స్ ప్రకటించింది. వచ్చే 18-24 నెలల్లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా భారత్ మారుతుందని రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ డిజిటల్ సీఈవో అమిత్ ఖండుజాని అన్నారు. ఈ క్రమంలో దేశీయ మొబైల్ గేమ్ మార్కెట్ వృద్ధిచెందడం గేమ్ డెవలపర్స్ కు చక్కని అవకాశమని తెలిపారు. కొన్నేళ్ల క్రితం కేవలం 40 గేమింగ్ స్టార్టప్ లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 250కు పైగా ఉన్నట్టు ఆయన చెప్పారు. భారత మార్కెట్ అభివృద్ధి చెందుతున్న గేమ్ హబ్ అని, వచ్చే 3-4 ఏళ్లలో దాదాపు 50వేల మంది నిపుణులు దీనిలో భాగస్వాములవ్వాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రిలయన్స్ అనిల్ ధీరూభాయి గ్రూపునకు చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ, ఐపీఎల్లో గుజరాత్ లయన్స్ టీమ్‌తో భాగస్వామి అవుతున్నట్టు అమిత్ ప్రకటించారు. దీంతో రాజ్‌కోట్‌కు చెందిన ఈ టీమ్ కు అధికారిక భాగస్వామిగా రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ మారింది. రిలయన్స్ గేమ్స్ ప్రపంచవ్యాప్తంగా 5 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ స్టూడియోలతో కలిసి రిలయన్స్ గేమ్స్ పనిచేస్తోంది.