బ్యాంకుల్లోనూ ఇండియన్ గోల్డ్ కాయిన్స్
ఒప్పందాలు కుదుర్చుకున్న ఎంఎంటీసీ
న్యూఢిల్లీ: ఇండియన్ గోల్డ్ కాయిన్ల భారీ విక్రయానికి ఎంఎంటీసీ (మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) వ్యూహ రచన చేసింది. ఈ విషయంలో పలు బ్యాంకులతో ఒడంబడికలు కదుర్చుకుంది. వీటిలో ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటివి ఉన్నాయి. ముఖ్యంగా శుక్రవారంనాటి ధంతేరాస్ లక్ష్యంగా ఈ చొరవ తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 383 ఎంఎంటీసీ షాపుల్లో మాత్రమే ఇండియన్ గోల్డ్ కాయిన్లు లభ్యం అవుతున్నాయి. ఇప్పుడు ఈ కాయిన్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, విజయాబ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌కు సంబంధించి నిర్దేశిత బ్రాంచీల్లో లభ్యం అవుతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కాయిన్లు 5, 10, 20 గ్రాముల్లో లభ్యమవుతాయి.
విస్తృత ప్రచారం: దీపావళి సందర్భంగా ఇండియన్ గోల్డ్ కాయిన్ల లభ్యతకు సంబంధించి ఎంఎంటీసీ, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విస్తృత ప్రాతిపదికన ప్రచార కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టాయి. వార్తా పత్రికలు, రేడియో, డిజిటల్, కొన్ని సినిమా హాళ్లలో వీటి విక్రయాలపై ప్రచారం జరుగుతోంది. 2015 నవంబర్ 5వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించిన ఈ నాణెం... భారత్ మొట్టమొదటి సావరిన్ గోల్డ్. స్వచ్ఛతకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెర్డ్స్ హాల్‌మార్క్‌తో ఈ కాయిన్లు లభ్యం అవుతాయి.
పసిడికి భారీ డిమాండ్: మరోవైపు ధంతేరాస్ సందర్భంగా ఆభరణ విక్రయాల వృద్ధిపై రిటైలర్లు భారీ అంచనాలను వ్యక్తం చేశారు. శుభాలను అందిస్తుందని భావించే రోజుగా అక్టోబర్ 28న గత ఏడాది ఇదే రోజు అమ్మకాలతో పోల్చితే దాదాపు 25 శాతం అమ్మకాల వృద్ధి ఖాయమని విశ్వసిస్తున్నారు.