Indian Institute of Packaging
-
ఉత్పత్తులకు ప్యా‘కింగ్’ జోష్!
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ డెరైక్టర్ ఎన్.సి. సాహా జీవిత కాలం పెంచేలా ప్యాకింగ్స్‌ను అభివృద్ధి చేసే సత్తా మాకుంది * నూతన ప్యాకింగ్‌తో ఉత్పత్తికి విలువ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొబ్బరి నీళ్లు కొన్ని గంటలు మాత్రమే నిల్వ చేస్తాం. ఎక్కువ సమయమైతే అవి పాడైపోతాయి. కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) ఒక అడుగు ముందుకేసి ఆరు నెలలపాటు నిల్వ ఉండేలా కొత్త రకం ప్యాకింగ్ విధానాన్ని అభివృద్ధి చేసింది. వేలాది కొబ్బరి రైతులకు కొత్త ఆశలను రేపింది. ఇప్పుడు ఇదే సంస్థ మరిన్ని ఉత్పత్తుల జీవిత కాలం పెంచేలా ప్యాకింగ్ విధానాలను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైంది. ప్యాకింగ్ ఏదైనా విజయవంతంగా రూపొం దించే సత్తా తమకు ఉందని అంటున్నారు ఐఐపీ డెరైక్టర్ డాక్టర్ ఎన్.సి.సాహా. సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. విశేషాలు ఇవీ.. ప్యాకింగ్‌తో ఉత్పత్తులకు విలువ చేకూర్చవచ్చంటున్నారు. కాస్త వివరించండి.. కర్జూర చెట్టు నుంచి వచ్చే ద్రావంతో నాలెన్ గుర్(బెల్లం) తయారు చేస్తారు. నాలెన్ గుర్ ధర కిలోకు రూ.150 ఉంటుంది. శీతాకాలంలో మాత్రమే ఇది లభిస్తుంది. మూడు నెలలు నిల్వ ఉండేలా ట్యూబ్ వంటి ప్యాకింగ్‌ను దీనికోసం అభివృద్ధి చేశాం. దీనికిగాను ఐఐపీకి పేటెంటు ఉంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి చెందిన ఖాదీ గ్రామోద్యోగ్ ఈ ప్రాజెక్టును ఐఐపీకి అప్పగించింది. ఈ ఉత్పత్తిని విశ్వ బంగ్లా రిటైల్ ఔట్లెట్లలో 100 మిల్లీలీటర్ల ప్యాక్‌ను రూ.100కు విక్రయిస్తున్నారు. ఉత్పాదన ఏదైనా జీవిత కాలం పెరిగితే అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు అనడానికి ఇదే ఉదాహరణ. ప్రస్తుతం ఐఐపీ చేపట్టిన ప్రాజెక్టులేమిటి? పశ్చిమ బెంగాల్లో జోయనగర్ మోవ అనే లడ్డూకు మంచి పేరుంది. నాలెన్ గుర్, మురమరాలతో మోవ తయారు చేస్తారు. ఈ లడ్డూతోపాటు బర్దోమా జిల్లాలో డిమాండ్ ఉన్న మిహిదానా లడ్డూకు సైతం మూడు నెలలపాటు నిల్వ ఉండేలా ప్యాకింగ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. మైనారిటీ శాఖ అప్పగించిన ప్రాజెక్టులో భాగంగా 40 రకాల పట్టు చీరలకు అందమైన డిజైన్లలో ప్యాకింగ్‌ను రూపొందిస్తున్నాం. మంచి ప్యాకింగ్ ఉంటే అమ్మకాలు అధికమవుతాయన్నది మైనారిటీ శాఖ ఆలోచన. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న టీ పౌడర్‌లో 80 శాతం బల్క్‌గా వెళ్తోంది. ఇలా కాకుండా అందమైన చిన్న ప్యాక్‌లలో వెళితే ఎక్కువ ఆదాయం వస్తుందని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశగా ప్యాక్‌లను డిజైన్ చేయాలని ఐఐపీని కోరింది. లవంగాలు, యాలకుల నుంచి తీసిన నూనె సహజత్వం కోల్పోకుండా ఎక్కువ రోజులు మన్నేలా ప్యాక్‌ను రూపొందిస్తున్నాం. తిరుపతి లడ్డూకు సైతం ప్యాకింగ్‌ను రూపొందిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉంది? లడ్డూ జీవిత కాలం రెండు నెలలు ఉండేలా చేయవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) 2013లోనే ప్రతిపాదన పంపాం. ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ.10 లక్షలు మాత్రమే. టీటీడీ నుంచి ఎటువంటి స్పందన లేదు. మేం అభివృద్ధి చేసే ప్యాకింగ్‌తో లడ్డూ ధర పెంచి విక్రయించుకోవచ్చు. ఎక్కువ రోజులు మన్నుతుందంటే ప్రీమి యం చెల్లించేందుకూ వినియోగదార్లు సిద్ధంగా ఉంటారు. మేము రూపొందించిన ప్యాకింగ్‌తో ఉన్న ఏ ఉత్పాదన అయినా రిఫ్రిజిరేటర్లో పెట్టక్కరలేదు. సాధారణ వాతావరణంలో ఉంచితే చాలు. ప్యాక్‌ను తెరిస్తేనే ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇక బిర్యానీ 7 రోజుల పాటు నిల్వ చేయవచ్చు. హోటళ్ల నిర్వాహకులు ముందుకు వస్తే టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు మేం సిద్ధం. -
వైజాగ్‌లో ఐఐపీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) వైజాగ్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. స్థలాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది కూడా. ఇప్పటికే ఐఐపీకి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతలో కేంద్రాలున్నాయి. బెంగళూరులో కొద్ది రోజుల్లో కేంద్రం రానుంది. అహ్మదాబాద్, గువహటిలోనూ సెంటర్లు నెలకొల్పనున్నట్టు ఐఐపీ సభ్యుడు ఏవీపీఎస్ చక్రవర్తి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్యాకింగ్ ప్రమాణాలను పెంచడం, పరిశోధన, అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలను ఐఐపీ నిర్వహిస్తోందని చెప్పారు. ఈ-కామర్స్ రాకతో ప్యాకింగ్ రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయని, ఈ విషయంలో ఇన్స్టిట్యూట్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే ఒక్కొక్కరికి రూ.5 లక్షల వార్షిక వేతనంతో ఎనిమిది మంది ఐఐపీ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకుందని వివరించారు. భారత్‌లో ఉన్న వ్యాపార అవకాశాలను తెలియజేసేందుకు అక్టోబరులో ముంబైలో వరల్డ్ ప్యాకేజింగ్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. -
తిరుపతి లడ్డు.. 90 రోజులు సేఫ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తిరుపతి లడ్డు.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ప్రసాదమంటే ఎవరికైనా ప్రీతి. సుదూర ప్రాంతాల్లో ఉన్న భక్తులకు ఇక లడ్డు త్వరగా పాడవుతుందన్న చింత అక్కర లేదు. లడ్డు 90 రోజుల పాటు మన్నేలా వాక్యూమ్ ప్యాకింగ్‌లో నూతన విధానాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) అభివృద్ధి చేసింది. ఒక్కో లడ్డూకు ప్యాక్‌నుబట్టి రూ.1-2 ఖర్చు అవుతుంది. ఈ టెక్నాలజీని అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులతో చర్చలు జరుపుతున్నామని ఐఐపీ డెరైక్టర్ ఎన్.సి.సాహా తెలిపారు. ఒక్కో మెషీన్‌కు రూ.50 లక్షల వ్యయం అవుతుందన్నారు. ఇతర స్వీట్లకు కూడా నూతన ప్యాకింగ్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. నవంబర్ 6-7 తేదీల్లో జరిగే జాతీయ ప్యాకేజింగ్ సదస్సు విశేషాలను వెల్లడించేందుకు మంగళవారం ఏర్పాటైన మీడియా సమావేశం అనంతరం ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. జీవిత కాలం పెంచేందుకు.. ఆహారోత్పత్తులు ఎక్కువ కాలం మన్నేలా నూతన ప్యాకింగ్ విధానాలపై పరిశోధనలు కొనసాగిస్తున్నామని సాహా వెల్లడించారు. ‘ఖర్జూర చెట్టు నుంచి తీసిన బెల్లం వంటి రసం జీవిత కాలం 5 గంటలు మాత్రమే. 75 రోజులు మన్నేలా మల్టీ లేయర్ కో ఎక్స్టెండెడ్ ప్లాస్టిక్ బాటిల్‌ను రూపొందించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అందించాం. రిఫ్రిజిరేటర్లో గొర్రె మాంసం 3 రోజులు నిల్వ చేయొచ్చు. దీనిని 9 రోజులకు పెంచేలా మాడిఫైడ్ అట్మాస్ఫియర్ ప్యాకేజింగ్ (ఎంఏపీ) ద్వారా పరిశోధన చేస్తున్నాం. అలాగే చికెన్ లెగ్స్ 20 రోజులు మన్నేలా కొత్త విధానాన్ని కనుగొనే పనిలో ఉన్నాం. కొన్ని రకాల స్వీట్స్ కోసం ప్లాస్టిక్ కంటైనర్లను తయారు చేస్తున్నాం’ అని చెప్పారు. ఎగుమతి అవుతున్న గుడ్లలో 1% పగిలిపోతున్నాయి. గుడ్లు ఒకదానికొకటి తగలకుండా నూతన రకం ప్యాక్‌ను అభివృద్ధి చేశామని వెల్లడించారు. -
విశాఖ వైపు ఐఐపీ చూపు!
సాక్షి, విశాఖపట్నం: ప్రఖ్యాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ విశాఖకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రాజధానిగా ఈ ప్రాంతం అవతరించిన నేపథ్యంలో ఇక్కడ కంపెనీలకు ప్యాకేజింగ్ కొరత తీవ్రంగా ఉంది. విమానాలు, నౌకలు, రోడ్డు, రైలు మార్గంలో వెళ్లే లక్షల టన్నుల కార్గో వస్తువులకు పకడ్బందీగా, ఆకర్షణీయంగా ప్యాకింగ్ తయారు చేసే నిపుణులు అసలు లేరు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రస్తు తం ఉన్న ఐఐపీ తరహాలోనే విశాఖలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన, డిమాండ్ ఎంతోకాలం నుంచి ఉంది. అయితే ఇటీవల కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ వచ్చినప్పుడు పలువురు పరిశ్రమల ప్రతినిధులు ఇదే విషయాన్ని ఆమెకు వివరించారు. ఈ సంస్థను ఏర్పాటు చేస్తే అటు పరిశ్రమలకు, ఇటు నిరుద్యోగ యువతకు మేలు చేకూరుతుందని ఆమె దృష్టికి తెచ్చారు. దీంతో నగరంలోని ప్రజాప్రతినిధులు, పరిశ్రమల తరఫున వినతి పత్రం ఇవ్వాలని ఆమె కోరారు. గత నెలలో విశాఖ ఎంపీ హరిబాబు లేఖ రాయగా, దానిని నిర్మలా సీతారామన్ ముంబైలోని ఐఐపీ డెరైక్టర్‌కు ఎన్.సి.షాకు పంపారు. విశాఖలో ఈ సంస్థ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, ప్రస్తుత పరిశ్రమల అవసరాలు అధ్యయనం చేయడానికి వచ్చే నెల 23న ఐఐపీ ప్రత్యేక బృందం ఇక్కడకు రాబోతోంది. అంతేకాకుండా నగరంలో అన్ని రంగాల కంపెనీలతో ప్రతినిధి బృందం ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించింది. ఇక్కడ ఐఐపీ ఏర్పాటు చేస్తే ప్యాకేజింగ్ పరంగా ఎన్ని పరిశ్రమలకు ఉపయోగపడుతుంది? విద్యార్థులకు శిక్షణ ఇస్తే ఉపాధి అవకాశాలు ఎలా పెరుగుతాయి? ఎలాంటి పరిశ్రమలకు ప్యాకేజింగ్ సంస్థ అవసరం ఉంది? అనే వాటిపై చర్చించనున్నారు. అనంతరం నగరంలో పలు పరిశ్రమలను సందర్శిస్తారు. ఈ మేరకు ఐఐపీ డెరైక్టర్ ఎన్.సి.షా నుంచి పరిశ్రమల అధిపతులు, ప్రజాప్రతినిధులకు లేఖ అందింది. నగరంలో ఐఐపీ ఏర్పాటైతే ప్యాకేజింగ్ రంగంలో ఆ సంస్థ మూడు, ఆరు నెలల కాలవ్యవధి కోర్సులతో రెండేళ్ల పీజీ కోర్సును కూడా అందించనుంది. శిక్షణ పొందిన వారికి రకరకాల పరిశ్రమల్లో ఆయా ఉత్పత్తులకు ప్యాకేజింగ్ రంగంలో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. -
ఐఐపీ భారీ విస్తరణ
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) విస్తరణ దిశగా అడుగులేస్తోంది. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌తోసహా దేశవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ కేంద్రాలున్నాయి. గువహటి లో రూ.5 కోట్లతో కేంద్రం రానుంది. గుర్గావ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ఐఐపీ డెరైక్టర్ ఎన్.సి.సాహా సోమవారం తెలిపారు. ఐఐపీ హైదరాబాద్ ఎనిమిదవ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. మౌలిక వసతుల కల్పనకు ఐఐపీకి కేంద్ర వాణిజ్య శాఖ రూ.250 కోట్లు ఖర్చు చేయనుందని, ఇందులో భాగంగా రూ.70 కోట్లను మంజూరు చేసిందని చెప్పారు. హైదరాబాద్ కార్యాలయం విస్తరణకు రూ.2 కోట్లు వ్యయం చేస్తామన్నారు. ‘భారత ప్యాకేజింగ్ పరిశ్రమ ప్రస్తుతం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది. రానున్న నాలుగైదేళ్లలో 12.3 శాతం వృద్ధితో నాల్గవ స్థానానికి చేరుకుంటుంది. ఆ సమయానికి మార్కెట్ పరిమాణం 42.7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది’ అని వెల్లడించారు. ఐఐపీ హైదరాబాద్ చైర్మన్ ఏవీపీఎస్ చక్రవర్తి మాట్లాడుతూ ఇంతకుముందు ఏ అవకాశాలూ దొరకని వారు ప్యాకేజింగ్ ఇన్స్టిట్యూట్లో తమ పేర్లను నమోదు చేసుకునేవారని, ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని అన్నారు. ఈ రంగంలో రాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఇన్‌ఛార్జి మాదబ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.