
వైజాగ్‌లో ఐఐపీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) వైజాగ్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. స్థలాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది కూడా. ఇప్పటికే ఐఐపీకి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతలో కేంద్రాలున్నాయి. బెంగళూరులో కొద్ది రోజుల్లో కేంద్రం రానుంది. అహ్మదాబాద్, గువహటిలోనూ సెంటర్లు నెలకొల్పనున్నట్టు ఐఐపీ సభ్యుడు ఏవీపీఎస్ చక్రవర్తి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్యాకింగ్ ప్రమాణాలను పెంచడం, పరిశోధన, అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలను ఐఐపీ నిర్వహిస్తోందని చెప్పారు.
ఈ-కామర్స్ రాకతో ప్యాకింగ్ రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయని, ఈ విషయంలో ఇన్‌స్టిట్యూట్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే ఒక్కొక్కరికి రూ.5 లక్షల వార్షిక వేతనంతో ఎనిమిది మంది ఐఐపీ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకుందని వివరించారు. భారత్‌లో ఉన్న వ్యాపార అవకాశాలను తెలియజేసేందుకు అక్టోబరులో ముంబైలో వరల్డ్ ప్యాకేజింగ్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.