విశాఖ వైపు ఐఐపీ చూపు! | indian institute of packagin focus in vizag | Sakshi
Sakshi News home page

విశాఖ వైపు ఐఐపీ చూపు!

Published Wed, Sep 10 2014 3:01 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

indian institute of packagin focus in vizag

సాక్షి, విశాఖపట్నం: ప్రఖ్యాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ విశాఖకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రాజధానిగా ఈ ప్రాంతం అవతరించిన నేపథ్యంలో ఇక్కడ కంపెనీలకు ప్యాకేజింగ్ కొరత తీవ్రంగా ఉంది. విమానాలు, నౌకలు, రోడ్డు, రైలు మార్గంలో వెళ్లే లక్షల టన్నుల కార్గో వస్తువులకు పకడ్బందీగా, ఆకర్షణీయంగా ప్యాకింగ్ తయారు చేసే నిపుణులు అసలు లేరు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రస్తు తం ఉన్న ఐఐపీ తరహాలోనే విశాఖలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన, డిమాండ్ ఎంతోకాలం నుంచి ఉంది. అయితే ఇటీవల కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ వచ్చినప్పుడు పలువురు పరిశ్రమల ప్రతినిధులు ఇదే విషయాన్ని ఆమెకు వివరించారు. ఈ సంస్థను ఏర్పాటు చేస్తే అటు పరిశ్రమలకు, ఇటు నిరుద్యోగ యువతకు మేలు చేకూరుతుందని ఆమె దృష్టికి తెచ్చారు. దీంతో నగరంలోని ప్రజాప్రతినిధులు, పరిశ్రమల తరఫున వినతి పత్రం ఇవ్వాలని ఆమె కోరారు.

గత నెలలో విశాఖ ఎంపీ హరిబాబు లేఖ రాయగా, దానిని నిర్మలా సీతారామన్ ముంబైలోని ఐఐపీ డెరైక్టర్‌కు ఎన్.సి.షాకు పంపారు. విశాఖలో ఈ సంస్థ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, ప్రస్తుత పరిశ్రమల అవసరాలు అధ్యయనం చేయడానికి వచ్చే నెల 23న ఐఐపీ ప్రత్యేక బృందం ఇక్కడకు రాబోతోంది. అంతేకాకుండా నగరంలో అన్ని రంగాల కంపెనీలతో ప్రతినిధి బృందం ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించింది.

ఇక్కడ ఐఐపీ ఏర్పాటు చేస్తే ప్యాకేజింగ్ పరంగా ఎన్ని పరిశ్రమలకు ఉపయోగపడుతుంది? విద్యార్థులకు శిక్షణ ఇస్తే ఉపాధి అవకాశాలు ఎలా పెరుగుతాయి? ఎలాంటి పరిశ్రమలకు ప్యాకేజింగ్ సంస్థ అవసరం ఉంది? అనే వాటిపై చర్చించనున్నారు. అనంతరం నగరంలో పలు పరిశ్రమలను సందర్శిస్తారు.

ఈ మేరకు ఐఐపీ డెరైక్టర్ ఎన్.సి.షా నుంచి పరిశ్రమల అధిపతులు, ప్రజాప్రతినిధులకు లేఖ అందింది. నగరంలో ఐఐపీ ఏర్పాటైతే ప్యాకేజింగ్ రంగంలో ఆ సంస్థ మూడు, ఆరు నెలల కాలవ్యవధి కోర్సులతో రెండేళ్ల పీజీ కోర్సును కూడా అందించనుంది. శిక్షణ పొందిన వారికి రకరకాల పరిశ్రమల్లో ఆయా ఉత్పత్తులకు ప్యాకేజింగ్ రంగంలో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement