Indian investments
-
విదేశీ స్టాక్స్‌లో రికార్డు పెట్టుబడులు
న్యూఢిల్లీ: విదేశాల్లో భారతీయుల పెట్టుబడులు ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతున్నాయి. 2022లో విదేశీ సెక్యూరిటీలు, ప్రాపర్టీ, డిపాజిట్లలో భారతీయులు చేసిన పెట్టుబడులు రికార్డు స్థాయిలో 2.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక 12 నెలల కాలంలో విదేశాల్లో భారతీయులు చేసిన అత్యధిక పెట్టుబడులు ఇవేనని ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విభాగం వారీగా చూసుకున్నా కానీ గతేడాది పెట్టుబడులు అత్యధికంగా ఉన్నాయి. ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్లను విదేశాలకు పంపించుకోవచ్చు. విదేశీ యాత్రలు, విదేశీ విద్య, వైద్యం, పెట్టుబడులకు ఈ పరిమితి వర్తిస్తుంది. బహుమతులు, విరాళాలకూ ఇదే పరిమితి అమలవుతుంది. 2009కి ముందు 12 నెలల కాలంలో విదేశీ షేర్లు, ప్రాపర్టీలు, డిపాజిట్లలో భారతీయుల పెట్టుబడులు 350 మిలియన్ డాలర్లుగానే ఉండడం గమనించొచ్చు. 2022 డిసెంబర్‌తో అంతమైన 12 నెలల కాలంలో విదేశీ ఈక్విటీ లేదా డెట్‌లో పెట్టుబడులు రికార్డు స్థాయిలో 969.50 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. డిసెంబర్ నెల వరకే చూసుకున్నా ఇలా విదేశాలకు వెళ్లిన పెట్టుబడులు 120 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. స్టాక్స్ పట్ల ఎక్కువ ఆసక్తి ముఖ్యంగా విదేశీ స్టాక్స్ పట్ల భారతీయులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బ్రోకరేజీ సంస్థలు విదేశీ బ్రోకరేజీలతో ఒప్పందాలు చేసుకుని పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ తదితర షేర్లలో దేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2022 డిసెంబర్ నాటికి మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పోర్ట్‌ఫోలియోలో రూ.27,055 కోట్ల విలువైన విదేశీ స్టాక్స్‌ను కలిగి ఉన్నాయి. అది ఈ ఏడాది జనవరి చివరికి రూ.29,012 కోట్లకు వృద్ధి చెందింది. విదేశీ పెట్టుబడుల పరంగా మ్యూచువల్ ఫండ్స్‌కు కొన్ని నియంత్రణపరమైన పరిమితులు ఉన్నాయి. ఫండ్స్ విదేశీ పెట్టుబడుల విలువ అనుమతించిన గరిష్ట స్థాయికి చేరిపోవడంతో.. తాజా పెట్టుబడుల స్వీకరణను సెబీ నిలిపివేసింది. పైగా విదేశాలకు పంపించే మొత్తం రూ.7 లక్షలకు మించితే మొదట్లోనే 20 శాతాన్ని టీడీఎస్ కింద మినహాయించాలంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన విదేశీ పెట్టుబడులకు పెద్ద ప్రతిబంధకం అవుతుందన్నది నిపుణుల అభిప్రాయంగా ఉంది. సాధారణంగా ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లోనే విదేశాలకు పంపించే మొత్తం ఎక్కువగా ఉంటుంది. -
పెట్టుబడులపై పరిమితులు ఎత్తివేయాలి
- అప్పుడే ఇతర దేశాలతో పోటీపడటం సాధ్యం - ప్రభుత్వానికి నిపుణుల ప్యానెల్ నివేదిక న్యూఢిల్లీ: ఆర్థిక రంగంలో అంతర్జాతీయంగా ఇతర దేశాలతో పోటీపడాలంటే భారత్ పెట్టుబడులపై పరిమితులను క్రమంగా ఎత్తివేయాలని స్టాండింగ్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సిఫార్సు చేసింది. అలాగే , నియంత్రణ.. పన్నుల వ్యవస్థలను మెరుగుపర్చాలని పేర్కొంది. అంతర్జాతీయంగా భారతీయ ఆర్థిక రంగం పోటీపడే సత్తాను అధ్యయనం చేసి, తగు పరిష్కార మార్గాలు సూచించేందుకు 2013 జూన్‌లో ఆర్థిక శాఖ ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇది తాజాగా తొలి నివేదికను ఆర్థిక శాఖకు సమర్పించింది. ఈ నివేదికపై సంబంధిత వర్గాలు అక్టోబర్ 6 దాకా ఆర్థిక శాఖకు తమ అభిప్రాయాలు పంపవచ్చు. ఇతర దేశాలతో పోటీపడాలంటే ప్రధానంగా పెట్టుబడులపై పరిమితులను క్రమబద్ధీకరించి.. క్రమంగా తొలగించాలని, సాంకేతికంగా పటిష్టమైన ఆర్థిక నియంత్రణ వ్యవస్థను రూపొందించుకోవాలని, స్థానికత ఆధారంగా పన్నుల విధించే విధానానికి మళ్లాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది. ఇందులో భాగంగా సంస్కరణల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కమిటీ సూచించింది. అలాగే, వీటి అమలు బాధ్యతలను కూడా స్పష్టంగా నిర్దిష్ట విభాగాలకు అప్పగించాలని పేర్కొంది. భారతీయ అసెట్స్‌పై ఆధారిత ఆర్థిక లావాదేవీలు విదేశాల్లో గణనీయంగా జరుగుతున్నాయని కమిటీ వివరించింది. రూపాయి డెరివేటివ్స్, మార్కెట్స్ సూచీ నిఫ్టీలో ట్రేడింగ్ భారీ స్థాయిలో దాదాపు 20 బిలియన్ డాలర్ల మేర రోజువారీ టర్నోవరు ఉంటోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పుష్కలంగా వనరులున్న భారత్‌కు .. మార్కెట్లో ఆధిపత్యం కోసం కృషి చేయాలని కమిటీ అభిప్రాయపడింది. -
ఆఫ్రికాపై భారత్ వృద్ధి ప్రభావం!
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అక్రా (ఘనా): భారత్ స్థిరమైన రీతిలో వృద్ధి బాటన పయనిస్తోందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ గ్లోబల్ పరిశోధనా బృందం ఒకటి తన నివేదికలో పేర్కొంది. ప్రపంచంలో ఇతర దేశాల్లోని పరిస్థితితో పోల్చితే భారత్‌లో కొన్ని ప్రత్యేక సానుకూల అంశాలు కనిపిస్తున్నాయని తెలిపింది. దీనితోపాటు వచ్చే ఏడాది భారత్‌లో చోటుచేసుకున్న వృద్ధి ప్రభావం ఆఫ్రికాపై కూడా పడుతుందని, ఆ దేశంలో భారత్ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయని విశ్లేషించింది. గత ఏడాది ఆఫ్రికాలో ఇండియన్ పెట్టుబడులు 14 రెట్లు పెరిగాయని, వచ్చే ఏడాది ఈ నిధుల పరిమాణం 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫిక్కీ మాజీ ప్రెసిడెంట్ ఆర్వీ కనోరియా గతంలో పేర్కొన్న అంశాన్ని కూడా నివేదిక ఈ సందర్భంగా ప్రస్తావించింది. భారత్‌తో పాటు ఆఫ్రికా కూడా వచ్చే ఏడాది ‘వృద్ధి జోన్’లో ఉంటుందని పేర్కొంది.