బాబుపై ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు
తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాపై కక్ష సాధింపునకు పాల్పడటం దారుణమని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఆందోళన వ్యక్తం చేసింది. తిరుపతిలో జరిగిన ఐజేయూ కార్యవర్గ సమావేశంలో ఎనిమిది తీర్మానాలు చేసింది. 'సాక్షి' దినపత్రిక, మీడియా పట్ల చంద్రబాబు వైఖరిని ఐజేయూ తీవ్రంగా పరిగణించింది.
ముఖ్యమంత్రి అధికారిక ప్రెస్మీట్లకు సాక్షి దినపత్రిక, సాక్షి ఛానల్ ప్రతినిధులను హాజరు కానీయకుండా భద్రతా సిబ్బంది ద్వారా అడ్డుకోవటం దారుణమని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు ఎస్ఎన్ సిన్హా, జాతీయ ప్రధాన కార్యదర్శి డి.అమర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ నుంచి సాక్షి ప్రతినిధులకు ఆహ్వానాలు అందుతున్నాయి, ఆహ్వానం ఉన్నా మీడియా ప్రతినిధుల్ని అడ్డుకోవటం సరికాదన్నారు. ఈ వైఖరిని మీడియాపై దాడిగా అభివర్ణిస్తున్నామన్నారు. ఐజేయూ సమావేశంలో మీడియా పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ల తీరును చర్చించినట్లు తెలిపారు. చంద్రబాబుపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.