'సాక్షి'పై కక్ష సాధింపు తగునా?
సమన్యాయం అంటూ సుద్దులు వల్లించే చంద్రబాబు ఆచరణలో మాత్రం సొంత ఎజెండానే అమలు చేస్తున్నారు. మాటలకు చేతలకు పొంతన లేకుండా ముందుకెళుతున్నారు. సాక్షి మీడియాపై పక్షపాత వైఖరిని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాధినేతగా అందరిని సమాన దృష్టితో చూడాల్సిన చంద్రబాబు సాక్షిపై సమయం దొరికినప్పుడల్లా అక్కసు వెళ్లగక్కుతున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు, ఆంగ్ల దినపత్రికల సంపాదకులకు చంద్రబాబు సోమవారం విందు ఇచ్చారు. ‘సాక్షి’ సంపాదకులను ఈ విందుకు ఆహ్వానించకుండా తన పక్షపాత వైఖరి ప్రదర్శించారు. టీడీపీ కార్యక్రమాలకు ఇప్పటికే సాక్షి మీడియాను ఆహ్వానించడం మానుకున్న ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకూ దూరంగా పెట్టడం శోచనీయం.
తమకు అనుకూలంగా వ్యహరించలేదన్న కారణంతో 'సాక్షి'పై పచ్చ పార్టీ అధినేత కక్ష సాధిస్తున్నారు. ఇందులో భాగంగా తమ పార్టీ కార్యక్రమాలను కవర్ చేయకుండా నిషేధం విధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వైఖరి మారలేదు. ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి ఈవిధంగా కక్ష సాధింపు చర్యలకు దిగడం తగునా? సాక్షి మీడియా పట్ల చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) తప్పుబట్టింది. ఇకనైనా చంద్రబాబు మారతారో, లేదో చూడాలి.