రాహుల్ ‘పసిడి సిక్సర్’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుకున్నాడు. మలేసియాలోని పెనాంగ్‌లో జరిగిన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రాహుల్ ఏకంగా ఆరు స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నాడు.
ఈ పోటీల్లో రాహుల్ యూత్, జూనియర్ విభాగాల్లో బరిలోకి దిగాడు. యూత్ 77 కేజీ విభాగంలో రాహుల్ స్నాచ్‌లో 140 కేజీలు... క్లీన్ అండ్ జెర్క్‌లో 161 కేజీలు బరువు ఎత్తాడు. మొత్తంగా 301 కేజీలతో ఈ అంశంలోనూ అగ్రస్థానంలో నిలిచి మూడు స్వర్ణాలు సాధించాడు. యూత్ కేటగిరిలో రాహుల్ నమోదు చేసిన ప్రదర్శనను జూనియర్ కేటగిరిలోనూ పరిగణనలోకి తీసుకోవడంతో అతనికి ఈ విభాగంలోనూ మరో మూడు స్వర్ణాలు ఖాయమయ్యాయి. దాంతో రాహుల్ ఖాతాలో మొత్తం ఆరు పసిడి పతకాలు చేరాయి. సీనియర్ పురుషుల 77 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన శివలింగం సతీశ్ కుమార్ మూడు పసిడి పతకాలను సాధించాడు.
ఓవరాల్‌గా ఈ పోటీల్లో భారత లిఫ్టర్లు 47 స్వర్ణాలు, 28 రజతాలు, 12 కాంస్యాలతో కలిపి మొత్తం 87 పతకాలను సాధించారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన రాహుల్ గత ఆగస్టులో చైనాలో జరిగిన ఆసియా యూత్ క్రీడల్లో... మూడు స్వర్ణ పతకాలను నెగ్గాడు. అంతకుముందు మేలో దోహాలో జరిగిన ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు... ఏప్రిల్‌లో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో రజత, కాంస్య పతకాలను సాధించాడు.