క్రీడల్లో రాణిస్తే ప్రోత్సాహం
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో రాణించిన తెలంగాణ క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించేలా చూస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. తమ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ ఫౌండేషన్, షాట్‌కాన్ కరాటే అకాడమీ, చిల్డ్రన్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్లు సంయుక్తంగా నిర్వహించిన తైక్వాండో గ్రేట్ కిక్స్ విన్యాసానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది.
శనివారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 50 మంది రికార్డు విజేతలకు డిప్యూటీ సీఎం సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తైక్వాండోకు క్రీడల్లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి మాట్లాడుతూ తెలంగాణ సమాజం రేపటి విశ్వంతో పోటీపడుతుందన్నారు.
విశ్వవ్యాప్తమైన మార్షల్ ఆర్ట్స్‌లో నగరవాసులు రాణించాలన్నారు. ఒక గంటలో కాళ్లతో 54,127 కిక్స్‌తో గిన్నిస్‌బుక్‌లో కొత్త రికార్డును నమోదు చేశారు. తైక్వాండో గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్ రెడ్డి మాట్లాడుతూ తమ క్రీడాకారులు నెలకొల్పిన రికార్డును నమోదు చేసినట్లు గిన్నిస్‌బుక్ ధ్రువీకరణ పత్రాలు పంపారని చెప్పాడు. సభ ప్రారంభంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వి.నరేందర్, బి. కృష్ణగౌడ్, ఎ. భరత్, ఫైట్‌మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.