మెకానిక్కు బుర్జ్ ఖలీఫాలో 22 అపార్టుమెంట్లు
దుబాయ్: ఒక్కోసారి ఓ మాట వ్యక్తిని ఉన్నతుడిని చేస్తుందంటారు. అతడికి లేని శక్తులు వచ్చేలా తయారుచేస్తుందని చెప్తుంటారు. సరిగ్గా ఓ భారతీయుడి విషయంలో ఇదే జరిగింది. తన స్నేహితుడు అపహాస్యం చేసినట్లుగా మాటలు అన్నందుకు ఆ వ్యక్తి దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. విన్నవారంతా అవాక్కయ్యే స్థాయికి వెళ్లాడు. అతడే మెకానిక్ నెరియాపరాంబిల్. నెరియాపరాంబిల్ ఓ భారతీయుడు. 1976 మధ్యాసియాకు వెళ్లిపోయాడు. స్వతహాగా మెకానిక్ అయిన అతడు అదే పనిచేసుకుంటూ గడపడంతోపాటు తండ్రి చేసే పనిలో సహాయంగా ఉండేవాడు.
ఒకసారి అతడి స్నేహితుడు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా భవనాన్ని చూపిస్తూ.. ఇందులోకి నీ జీవితంలో వెళ్లలేవు అంటూ అపహాస్యం చేసి వెకిలి నవ్వు నవ్వాడు. ఓ రోజు ఆ భవనంలో ప్లాట్ లు అద్దెకు ఉంటాయని పేపర్ లో చదివి సరిగ్గా 2010లో అందులో అద్దెకు దిగాడు. అనంతరం ఒక బిజినెస్మేన్గా మారి తన తెలివితేటలతో అనతికాలంలోనే ఏకంగా అందులో 22 అపార్టుమెంట్లు సొంతం చేసుకున్నాడు. 828మీటర్లు ఉండి మొత్తం 900 అపార్ట్మెంట్లు ఉన్న బుర్జ్ ఖలీఫాలో 22 అపార్ట్మెంట్లు మన మెకానిక్ నెరియాపరాంబిల్వే. అయితే, తన కలను ఇంతటితో ఆపనని, ఇలా కలకంటూనే మరెన్నో అపార్టు మెంట్లను కొనుగోలు చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈ అనితర మెకానిక్.