‘హాజీఅలీ దర్గాలోకి మహిళలను అనుమతించాలి’
సాక్షి, ముంబై: ప్రముఖ హాజీ అలీ దర్గాలోకి మహిళలను నిషేధించాలని హాజీ అలీ దర్గా ట్రస్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ భారతీయ ముస్లిం మహిళ ఆందోళన్ సంఘటన హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. దీనిపై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని సంఘటన తెలిపింది. గతంలో ఈ దర్గా లోపలివరకు మహిళలను అనుమతించేవారు. షరియత్ నియమ, నిబంధనల ప్రకారం వారిని నిషేధించాలని కొద్ది రోజుల కిందట నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్టు స్పష్టం చేసింది.
అయితే సంఘటన సభ్యులు నగరంలో ఉన్న 19 దర్గాలను అధ్యయనం చేయగా అందులో 12 చోట్ల మహిళలను లోపలికి అనుమతిస్తున్నట్లు వెల్లడైంది. హాజీ దర్గాలో మహిళ, పురుషులనే భేదాలెందుకుని భారతీయ ముస్లిం మహిళ ఆందోళన్ సంఘటన ప్రశ్నించింది. రాష్ట్ర మహిళ కమిషన్, రాష్ట్ర మైనార్టీ కమిషన్, దేవాదాయ శాఖ కమిషనర్ ఇలా వివిధ శాఖలను సంప్రదించినప్పటికీ న్యాయం జరగలేదు. దీంతో కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు సంఘటన తెలిపింది.