యెమెన్ నుంచి 350 మంది భారతీయులు తరలింపు
న్యూఢిల్లీ: యెమెన్‌లో నివసిస్తున్న దాదాపు 350 మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు రక్షణ శాఖ ఉన్నతాధికారులు బుధవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. గత అర్థరాత్రి దక్షిణ యెమెన్‌లోని అడెన్ నగరం నుంచి వారిని భారత నావిక దళానికి చెందిన ఐఎన్ఎస్ సుమిత్ర ద్వారా తరలించినట్లు తెలిపారు.
వారంతా యెమెన్ పొరుగున ఉన్న జిబౌతికు నౌక ద్వారా చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి విమానం ద్వారా భారత్ చేరుకుంటారని పేర్కొన్నారు. తరలించిన వారిలో 220 మంది పురుషులు, 101 మంది మహిళలు, 28 మంది చిన్నారులు ఉన్నారని ఉన్నతాధికారులు వివరించారు.
యెమెన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశం తరలించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఇప్పటికే జిబౌతి చేరుకున్న సంగతి తెలిసిందే. యెమెన్‌లో చిక్కుకున్న నాలుగువేల మంది భారతీయులను తరలించేందుకు భారత్ ఐదు నౌకలు, నాలుగు విమానాలను రంగంలోకి దింపింది.