శ్రీజకు స్వర్ణ, రజతాలు
ముంబై: ఇండియన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ ప్యాడ్లర్లు మెరిశారు. ఆదివారం ఇక్కడ ముగిసిన ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, నైనా జైస్వాల్ సత్తా చాటారు. పోటీల చివరి రోజు క్యాడెట్ (బాలికలు) వ్యక్తిగత విభాగంలో శ్రీజ స్వర్ణం, రజతం సాధించగా... నైనా రజత పతకం గెల్చుకుంది.
నాలుగు రోజుల క్రితం జరిగిన టీమ్ ఈవెంట్లో కూడా శ్రీజ, నైనా చెరో రజతం గెలుచుకున్నారు. జూనియర్ బాలికల వ్యక్తిగత కన్సొలేషన్ విభాగంలోనూ శ్రీజ విజయం సాధించడం విశేషం. క్యాడెట్ బాలికల డబుల్స్‌లో ఆకుల శ్రీజ-హర్షవర్ధిని జోడికి స్వర్ణం దక్కింది. ఫైనల్లో ఈ జంట 12-10, 11-8, 11-4 స్కోరుతో నైనా జైస్వాల్-శృతి అమృతేపై విజయం సాధించింది.
ఈ ఫలితంతో నైనా ఖాతాలో రజతం చేరింది. వ్యక్తిగత విభాగంలో మాత్రం శ్రీజ రజతం గెలుచుకుంది. ఫైనల్లో సాగరిక ముఖర్జీ (భారత్) 13-11, 11-13, 11-8, 17-19, 11-9 తేడాతో శ్రీజను ఓడించింది. కీలకమైన ఐదో గేమ్‌లో శ్రీజ ఒక దశలో 7-4తో ఆధిక్యంలో నిలిచింది. అయితే సాగరిక వరుసగా ఐదు పాయింట్లతో 9-7కు చేరింది. ఆ తర్వాత మరో రెండు పాయింట్లతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. జూనియర్ బాలికల కన్సొలేషన్ ఈవెంట్ ఫైనల్లో శ్రీజ, తన సహచరిణి నైనా జైస్వాల్‌ను 12-10, 11-7, 12-14, 10-12, 13-11తో ఓడించి విజేతగా నిలిచింది.