నిలకడతోనే చోటు సుస్థిరం: రహానే
ధర్మశాల: జాతీయ జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలంటే బ్యాటింగ్‌లో మరింత నిలకడగా రాణించాలని భారత ఓపెనర్ అజింక్యా రహానే కోరుకుంటున్నాడు. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మల్చడంపై ప్రధానంగా దృష్టిపెట్టానన్నాడు. ‘నా ఆటలో కొన్ని అంశాలను మెరుగుపర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా. ఇందుకోసం ప్రాక్టీస్ సెషన్‌ను బాగా ఉపయోగించుకుంటా.
చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటా. గత పర్యటనల నుంచి ఇప్పటి వరకు నేను గమనించింది ఒక్కటే... నిలకడగా ఆడటం చాలా ప్రధానమని. మెరుగైన ఆరంభం లభించినా వాటిని పెద్ద స్కోర్లుగా మల్చలేకపోయా. ఓపెనింగ్‌లో నేను భారీ స్కోరు చేస్తే అది జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. అందుకోసం మరింత నిలకడగా ఆడాలని భావిస్తున్నా’ అని ఈ ముంబై బ్యాట్స్‌మన్ పేర్కొన్నాడు. రిస్క్ షాట్లు లేకుండా క్రికెట్ ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు.
‘సరైన క్రికెట్ షాట్స్ ఆడటం నాకు చాలా ఇష్టం. బ్యాటింగ్ ఆర్డర్లో ఓపెనింగ్‌కు చాలా ప్రధాన్యం ఉంటుంది. లక్ష్యాన్ని ఛేదించాలన్నా... నిర్దేశించాలన్నా ఇది చాలా ముఖ్యం. పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రతను పెంచుకుంటున్నా. జట్టులో ఓపెనింగ్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. నా బలానికి అనుగుణంగా ఆడమని ధోని చెప్పాడు. అప్పట్నించీ నా సొంత ఆటతీరుపై దృష్టిపెడుతున్నా’ అని రహానే వెల్లడించాడు.