ఇంగ్లాండ్ లో 'ఇండియన్' దొంగలు
వర్కింగ్ టైమ్: మధ్యాహ్నం 2:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు
ప్లేస్: అత్యంత రద్దీగా ఉండే అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్లు
టార్గెట్: బిజీబిజీగా తమపని తాము చూసుకునేవాళ్లు
సంపాదన: రోజుకు 10 వేల పౌండ్లు
ఇప్పటివరకు పోగేసింది: 5 మిలియన్ పౌండ్లు (మన కరెన్సీలో దాదాపు రూ. 50 కోట్లు)
ఇలా ఒక్కో పాయింట్ చెప్పుకుంటూపోతే ఇంగ్లాండ్ లో ఓ భారతీయ సంతతి బృందం సాధించిన 'ఘనత' ఆ దేశ చరిత్రలో నిలిచేస్థాయికి చేరింది. ఇంతకీ ఈ గ్యాంగ్ చేసిన గొప్పపనేమంటారా? పిక్ పాకెటింగ్. మన భాషలో జేబులు కొట్టేయటం. లండన్ లోని అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్లలోని ప్రయాణికులే టార్గెట్ గా చోరీలకు పాల్పడ్డ 11 మంది భారత సంతతి వ్యక్తులు ఒక్కొక్కరికి 30 ఏళ్ల జైలు శిక్ష ఖరారుచేస్తూ లండన్ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది.
పక్కా ఆధారాలతో ఈ గ్యాంగ్ ను పట్టుకునేందుకు రెండేళ్లు కష్టపడాల్సి వచ్చిందని, సీసీటీవీ కెమెరాలు, బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనాలు.. అన్నింటిని క్రోడీకరించిన మీదట దొంగలను గుర్తించగలిగామని, ఆ 11 మంది ఇళ్లపై ఒకేసారి జరిపిన దాడుల్లో వేల సంఖ్యలో మొబైల్ ఫోన్లు, భారీగా నగదు లభ్యమయిందని బ్రిటిష్ ట్రాన్స్ పోర్ట్ పోలీస్ (బీటీపీ) అధికారులు తెలిపారు. అయితే వీళ్లు చిన్న చేపలు మాత్రమేనని, ఈ గ్యాంగ్ వెనుక భారీ తిమింగలాలు కూడా ఉన్నాయని, త్వరలోనే వాళ్లను కూడా ఆధారాలతో సహా పట్టుకుంటామని బీపీటీ చీఫ్ ఇన్స్ పెక్టర్ జాన్ జస్టిస్ చెప్పారు.
రెండు దఫాలుగా సాగిన విచారణ మంగళవారం ముగియడంతో 11 మందికి శిక్షల ఖరారయ్యాయి. కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించిన భారత సంతతి వ్యక్తుల్లో నవీద్ మొష్ఫిక్(గ్యాంగ్ లీడర్), ఓలిచా మొష్ఫిక్, పరమ్ జిత్ సింగ్ కల్రా, హర్మీత్ భాటియా, ప్రీత్ బాల్ భాటియా, నిర్మోహన్ భాటియా, రంజిత్ బంగార్, ముబారఖ్ ఖురేషి, అహ్మద్ రాజా, అరిజి సింగ్, నిర్మోహన్ సింగ్ లు ఉన్నారు.