Indian poet
-
ఆ భావదారిద్య్రం రచయితలకు ఉండదు
ఒకటి మాతృభూమి పాట.. మరొకటి మాతృమూర్తి పాట... ఒకే సినిమాలోæవినపడిన ఈ రెండు పాటలూ భావోద్వేగానికి గురి చేశాయి. ‘ఆర్ఆర్ఆర్’లో సుద్దాల అశోక్‌తేజ రాసిన ‘కొమురం భీముడో, కొమ్మా ఉయ్యాలా’ పాటలవి. ఇవే కాదు.. 28 ఏళ్ల కెరీర్లో 2600 సినిమా పాటల ద్వారా దేశభక్తి, ఆనందం, ప్రేమ, బాధ... ఇలా మనిషి తాలూకు ప్రతి ఎమోషన్ని ఆవిష్కరించారు సుద్దాల అశోక్ తేజ. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశోక్ తేజ చెప్పిన విశేషాలు. ► ఈ బర్త్ డే స్పెషల్ అంటే ముందుగా ‘ఆర్ఆర్ఆర్’ గురించే మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి మీరు రాసిన ‘కొమురం భీముడో, కొమ్మా ఉయ్యాలా’ రెండూ హిట్. ఈ పాటల గురించి మీ అనుభవం? సుద్దాల అశోక్ తేజ: నేనిప్పటి వరకూ రాజమౌళిగారి సినిమాలకు పాట రాయలేదు. విజయేంద్రప్రసాద్‌గారి ‘రాజన్న’ కి పాట రాశా. ఆ కథలో మా నాన్నకి (సుద్దాల హనుమంతు) సంబంధించిన జీవితం ఉంది. తెలంగాణ, నైజాం పోరాటంలో మా నాన్న, అమ్మ పాల్గొన్న ఘట్టాలు చెబుతూ ఒకానొక సన్నివేశం గురించి ఓ సందర్భంలో విజయేంద్ర ప్రసాద్‌గారికి చెప్పాను. దానికి ఆయన బాగా కనెక్ట్ అయిపోయి ఒక కథ తయారు చేశారు.. అదే ‘రాజన్న’ సినిమా. మా నాన్న జీవితంలో జరిగిన సన్నివేశానికి రాజమౌళిగారు ఓ పాట (వెయ్ వెయ్ దెబ్బకు దెబ్బ) నాతో రాయించారు. మా ఇద్దరి మధ్య ఉన్న తొలి పాట అనుబంధం అది. ‘ఆర్ఆర్ఆర్’ కోసం రాజమౌళిగారు పిలిపించి, ఎన్టీఆర్‌ని (కొమురం భీమ్ పాత్ర) ఆంగ్లేయులు శిక్షించే సందర్భంలో వచ్చే పాట రాయమన్నారు. ఈ పాటలో హీరో తనకు తానే ధైర్యం చెప్పుకుంటే బాగుంటుందన్నాను. కానీ, కీరవాణిగారు ‘మీరు పాట రాయండి.. ఆ తర్వాత ట్యూన్ ఇస్తాను’ అన్నారు. మూడు రిథమ్స్‌లో పాట రాసుకుని వెళ్లా. వాటిల్లో సినిమాలో ఉన్న పాట స్టైల్ అందరికీ నచ్చడంతో రాజమౌళిగారు అదే ఫైనల్ చేశారు. ఇక ‘కొమ్మా ఉయ్యాలా..’ గిరిజన బాలిక పాడే పాట. ఆ అమ్మాయి తల్లికి ఎంత కనెక్ట్ అయి ఉందో అని ఈ పాటలో చెప్పాం. ఆ అమ్మాయి జైలులో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కూడా తనకి భరోసా ఇస్తూ ఓ పాట పాడతాడు.. కానీ, నిడివి ఎక్కువ అయిందని ఆ పాట తీసేశారు. ఆ పాట కూడా నేనే రాశాను. ‘కొమురం భీముడో..’ పాట మాతృభూమితో, ‘కొమ్మా ఉయ్యాలా’ పాట మాతృమూర్తితో సంబంధం ఉన్నవి కాబట్టే ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ► మీ ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఇది. ఈ ట్రెండ్ రచయితలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? పాన్ ఇండియన్ సినిమా అని ఎక్కువ ఆలోచించి, ఓటీటీ సినిమాకి రాస్తున్నామని తక్కువ ఆలోచించి పాటలు రాసే భావదారిద్య్రం రచయితలకు ఉండదు. స్టార్ హీరోనా, కొత్త హీరోనా, స్టార్ డైరెక్టరా, కొత్త డైరెక్టరా? అని కాకుండా ఇచ్చిన సన్నివేశానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి? అని మాత్రమే రచయిత ఆలోచిస్తాడు. ► పాట మనిషి తేజస్సును పెంచుతుంది అంటారు. మీలోని తేజస్సుకు పాటే కారణమా? నిజమే.. పాట పసివాడిగా చేస్తుంది.. పడుచువాడిగానూ చేస్తుంది. వృద్ధాప్యం అనేది శరీరానికి సంబంధించినది కాదు.. ఆలోచనలకు సంబంధించినది. కొత్తదనం ఇవ్వాలనే తపన, తపస్సు వల్ల మనుషుల్లో కనిపించే తేజస్సు వేరుగా ఉంటుంది. ► రెండేళ్ల క్రితం మీకు లివర్ ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది. మీరు ఊపిరి పోసిన మీ అబ్బాయి మీకు ఊపిరి పోయడం గురించి..? జన్మనిచ్చిన పుత్రుడే (అర్జున్ తేజ) తిరిగి నాకు జన్మనివ్వడం నా జీవితంలో జరిగిన ఒక ఊహించని ఘటన. లివర్ ప్లాంటేషన్‌కి ఎవరూ ముందుకు రాక చనిపోయిన వారిని నేను చూశా. నా అదృష్టం ఏంటంటే.. నా కూతురు, నా కుమారులు లివర్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. కానీ వయసులో చిన్నోడు కాబట్టి అర్జున్ తేజని డాక్టర్లు సెలక్ట్ చేసుకున్నారు. మే 23కి ఆపరేషన్ జరిగి రెండేళ్లు అవుతుంది.. అలా కొడుకే తండ్రి అయిన సన్నివేశం నా లైఫ్‌లో జరిగింది. ► పాట సాహిత్యాన్ని శబ్దం డామినేట్ చేస్తున్న ఈ పరిస్థితి గురించి ఏమంటారు? నిజమే.. 1980 నుంచే ఆ ట్రెండ్ ఉంది. అక్షరాలతో కూడుకున్న దాన్నే పాట అంటారు. సంగీతం కలిసిన సాహిత్యమే గీతం. అలాంటిది అక్షరాలు వినిపించకపోతే మాకు ఎందుకు సంతోషం ఉంటుంది? నేను బాధపడ్డ క్షణాలు కొన్ని లక్షలుంటాయి. శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. అయితే కీరవాణిగారి సినిమాల్లో ప్రతి పాట అందరికీ వినిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఎవర్నీ తప్పుబట్టలేం.. ఎవరి ట్రెండ్ వారిది. ► మీ తల్లితండ్రుల పేరుతో ఇస్తున అవార్డు గురించి... మా తల్లితండ్రులు సుద్దాల హనుమంతు, జానకమ్మల పేరుతో ఓ ఫౌండేషన్ స్థాపించాను. మా నాన్నగారి పేరుతో గత పదేళ్లుగా జాతీయ పురస్కారం ఇస్తున్నాను. ► రచయితగా మీ నాన్న వారసత్వాన్ని మీరు తీసుకున్నారు.. మరి మీ వారసత్వాన్ని ఎవరు తీసుకున్నారు? పాటల విషయంలో నా వారసత్వాన్ని ఎవరూ తీసుకోలేదు.. కాకపోతే మా అమ్మాయి మాత్రం సంగీతం నేర్చుకుంది.. డిప్లొమా పాస్ అయింది. అమెరికా, లండన్‌లోని పిల్లలకు ఆన్లైన్లో సంగీత పాఠాలు చెబుతుంటుంది. ఒకరకంగా ఆమె నా బాటలో ఉన్నట్లు అనిపిస్తుంది. పాట నా జెండా.. కవిత్వం నా ఎజెండా.. శిఖరం నా నిచ్చెన లోయ నా విశ్రాంతి శయ్య ఓటమి నా ఆలోచనా మందిరం గెలుపంటారా.. చిన్న మలుపు మాత్రమే – సుద్దాల అశోక్‌తేజ -
సిరివెన్నెలను ఎక్కువగా శ్రమ పెట్టిన పాట ఏంటి..?
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ట్విటర్లో చేరి ఏడాది పూర్తయిన సందర్భంగా 2021, జూన్‌లో నెటిజనులతో ముచ్చటించారు. ఆ వివరాలు.. ‘సిరివెన్నెలను అడగండి’ అంటూ దాదాపు గంటసేపు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు–సమాధానాలు ఈ విధంగా.. ► అప్పట్లో ఉన్న పాటలు, సినిమాలు ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ప్రతీ కాలంలోనూ పాటలు, సినిమాలు అన్నీ అన్ని రకాలుగానూ ఉన్నాయి. ఏ రకం అభిరుచి ఉన్నవాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు. భిన్నంగా ఉన్నదాన్ని గురించి విసుక్కుంటారు. మన అభిరుచికి అనుగుణంగా ఉన్న పాటలను ఎంచుకునే అవకాశం మనకు ఉంది. విసుక్కునే చేదు మాని, మన అభిరుచిని ఆస్వాదించే తీపిని చవి చూద్దాం. ► త్రివిక్రమ్‌గారు మిమ్మల్ని రాత్రి ఉదయించే సూర్యుడు అని సంబోధించడానికి కారణం? మనకు ఇష్టమైన విషయాన్ని, మనకు తోచిన విధంగా వ్యక్తీకరిస్తాం. నేను సాధారణంగా రాత్రిపూట పని చేస్తాను. కాబట్టి దానిని ఆయన భాషలో ఆయన వ్యక్తీకరించారు. ► ‘లైఫ్ ఆఫ్ రామ్..’ పాట ఒక అద్భుతం. ఆ పాటలోని మీకు నచ్చిన ఒక లైన్ గురించి... ‘ఇలాగే కడదాకా ఒక ప్రశ్నై ఉండాలనుకుంటున్నా ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్ని అడుగుతు ఉన్నా’. అది నా ఆలోచనా ప్రపంచానికి కేంద్రబిందువు. ► మీరు రాసిన పాటల్లో మిమ్మల్ని అత్యధికంగా శ్రమ పెట్టిన పాట? పాట వచ్చే క్రమంలో శ్రమ అనే మాటకు చోటు లేదు ► దైవాన్ని నిర్వచించాలంటే? తనను తాను నిర్వచించుకోగలగాలి. ► మీకు బాగా నచ్చిన పుస్తకం? ‘భగవద్గీత’, ఖలీల్ జిబ్రాన్ రాసిన ‘ద ప్రాఫెట్’. ► వేటూరి సుందరరామ్మూర్తిగారికి మీరు రాసిన పాటల్లో ఏ పాట ఇష్టం? చాలా ఉన్నాయని వాళ్ళూ వీళ్ళూ అన్నారు. ‘నీలాల కన్నుల్లొ సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే’ అన్న పాటను ఆయన అత్యంత ఆత్మీయంగా విశ్లేషించి మెచ్చుకున్నారని బాలు అన్నయ్య నాకు చెప్పారు. ► మీరు మెలకువగా ఉన్న సమయంలో ఎక్కువగా ఏం చేస్తుంటారు? ఇప్పుడైతే ఎక్కువగా ఐపాడ్‌తో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాను. ► ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకమా? మనని జీవితం అనే ప్రశ్న వెంటాడి వేధించకపోతే, ఊరికే తెలివితేటలతో మాటాడాల్సి వస్తే, ఆ వాచాలతలో బూటకమే! ► తెలుగులో ట్వీట్ చేసినవారికే బదులు ఇస్తున్నారు? తెలుగులోనే నన్ను నేను స్పష్టంగా వ్యక్తపరుచుకోగలను అన్న కారణం వల్ల. అలానే టింగ్లీషు నాకు సరిగా రాదు. ► ఏకాగ్రతకు మీ నిర్వచనం? నేను తప్ప ఇంకేం కనిపించకపోవడం, నేను తప్ప ఇంకేం అనిపించకపోవడం. ► ఒక రచయితకి ఉండాల్సిన మొదటి లక్షణం? తానేం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో తనకి స్పష్టంగా తెలియడం. ► మళ్ళీ తెలుగు సాహిత్యపు స్వర్ణయుగాన్ని చూసేదెప్పుడు? రాను రాను పద ప్రయోగాలు తగ్గిపోతూ వచ్చి ఇంగ్లీష్ లేదా యాస పాటలు వచ్చేశాయి. మీ ప్రయోగాలను, అద్భుత కావ్యాలను ఎప్పుడు చూడగలం? సాహిత్యానికి ముందు తెలుగు అనో, మరోటనో చేర్చకూడదు. భాషతో సంబంధం లేనిది భావం. భావాలనేవి అన్ని విధాలుగానూ ఉంటాయి. ధాన్యం పొట్టుతో పాటే ఉంటుంది. దూగర దులిపి, గింజను ఏరుకోవడం ఎప్పుడూ జరగాల్సిన పనే. ఎప్పుడూ మనకు కావాల్సింది ఉంటుంది. మనం చేయాల్సింది ఏరుకోవడమే. ► దేవులపల్లిగారి సాహిత్యంలో మీకు బాగా నచ్చిన కవిత? ‘మ్రోయించకోయి మురళీ, మ్రోయించకోయి కృష్ణా... తియ్య తేనియ బరువు మోయలేదీ బరువు’ – వివరణ అనేది దాహం తీర్చుకునేవారి పాత్రతను బట్టి, పాత్రను బట్టి ఉంటుంది. ► ‘సామజ వర గమనా’ అన్న సమాసం వింటే త్యాగరాజస్వామి గుర్తుకు వచ్చేవారు. ఇప్పుడు అందమైన యువతి ఊరువులు, వాటిని మోహించే యువకుడు మదిలో మెదులుతున్నారు. తప్పంతా సామాజికుడిదేనంటారా? దృశ్యంలో లేదు. చూసే కన్ను వెనకాల ఉన్న సంస్కారంలో ఉంది. ► మీరు హేతువాది అయినప్పటికీ దేవుడు ఉన్నాడని మీరు ఎలా నమ్ముతారు? నేనున్నాను గనుక. ► రచయితలు – సాంఘికీకరణపై మీ అభిప్రాయం? ‘సరిగా చూస్తున్నదా నీ మది.. గదిలో నువ్వే కదా ఉన్నది..’ చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది no man is island.. ► లిరిక్స్ రాయడానికి మీకు ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందా? నా బుర్రలో అలజడి. ► ‘యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం?’ అన్నారు. నిజమా? తప్పే! మృగాలను అవమానించకూడదు. ► పాటలో నిరాశానిస్పృహలను వ్యక్తపరిచే సందర్భంలో కూడా, ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌ను దాటి ఓ ఆశావాద కోణం కూడా ఇనుమడింపజేస్తూ వచ్చారు. ఆ తూకం పాటించడానికి గల ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? ‘కాలం గాయాన్ని మాన్పుతుంది’ అన్న సత్యాన్ని గుర్తిస్తే ఏడుపైనా, నవ్వైనా, మరేదైనా మనం చెయ్యాలనుకున్నంత సేపు చెయ్యలేం. ఇది ముందే తెలుసుకుంటే, భావాల ఉద్ధృతిని మోతాదు మించనివ్వం. ‘‘నిన్న రాత్రి పీడకలను నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా? ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా?’’ ► తెలుగు భాష మీద పట్టు లేని కొంతమంది గాయకులు మీ కలం నుండి జారిన అద్భుతమైన పాటలను ఖూనీ చేసినట్టు గానీ, సంగీత దర్శకులు ఆ విషయాన్ని విస్మరించినట్టు గానీ మీకెప్పుడైనా అనిపించిందా ? బియ్యంలో రాళ్ళు ఏరుకుని వండుకుంటాం. అన్నంలో తగిలిన రాళ్ళను పక్కన పెట్టి తింటాం. ‘చూపులను అలా తొక్కుకు వెళ్ళకు...’ అని మీకూ తెలుసు... ఎవరినో ఎందుకు నిందించడం! ► మీరు ‘గాయం’లో పాడిన ‘నిగ్గదీసి అడుగు’ పాట నాకు చాలా ఇష్టం. ఇలాంటి పాటలను మళ్ళీ రాయాలని మీకు ఎందుకు అనిపించలేదు? అలాంటి భావాలున్న మిగిలిన పాటలను మీరెందుకు పరిశీలించరు? జిరాక్స్ కాపీని ఎందుకు అడుగుతున్నారు. ► ‘సిరివెన్నెలగారు’ పాటల రచయిత కాకపోయి ఉంటే? జరగాల్సిందే జరిగింది. జరగాల్సిందే జరుగుతుంది. -
సమాజం లెక్క తేల్చిన కథల మేష్టారు
ఆయన వృత్తిరీత్యా లెక్కల మాష్టారు. కాని సమాజంలో ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుందని, ఒక లెక్కను పెద్దవాళ్లు కలిసి నిర్ణయిస్తారని, ఆ పెద్దవాళ్లకు రెండు రెళ్లు ఆరనీ, కింద వాళ్లకు శేషం సున్నా అనీ ఆయన స్కూల్లో పిల్లలకు కాకుండా కథల్లో పాఠకులకు చెప్పారు. మనుషులు ఈసురోమని ఉంటే అందుకు కారణం ఆ సదరు మనుషులు కారని వెనుక ఎక్కడో ఉండే మనుషులని ఆయన చెప్తారు. తెలుగు కథను ఉన్నతీకరించిన కాళీపట్నం రామారావు 97వ ఏట జీవించి అస్తమించారు. ఆయన రచనలు, ఆయన రచనా పరిశ్రమ ప్రతి తెలుగు ‘ఫ్యామిలీ’కి తెలిసి ఉండాలి. పోస్ట్‌మేన్ ఇంటికి ఉత్తరాలు తెచ్చి ఇస్తాడు. పోలీసు ఇంటికి రక్షణ కల్పిస్తాడు. ఇంజినీరు ఇల్లు కడతాడు. ప్రభుత్వ అధికారి ఇల్లు నడవడానికి అవసరమైన సంఘపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తాడు. వీరంతా సమాజంతో ఉంటూ సమాజం కోసం పని చేస్తూ సమాజంలో భాగంగా ఉంటారు. కాని ఈ సమాజం ఎలా ఉందో ఎవరు చెప్తారు? కథకుడే చెప్తాడు. సమాజాన్ని చూసి సమాజానికి దానిని తిరిగి చూపిస్తాడు కథకుడు. సమాజం ఎలా ఉందో రాసేవాణ్ణి రచయిత అనొచ్చు. అలా ఎందుకు ఉందో రాసేవాణ్ణి మంచి రచయిత అనొచ్చు. అలా ఉండకుండా ఏమి చేయవచ్చో రాసి పాఠకులను ఆలోచనాశీలురుగా, కర్తవ్యోన్ముఖులుగా చేసే రచయితను గొప్ప రచయిత అనొచ్చు. కాళీపట్నం రామారావు అలాంటి గొప్ప రచయిత. మనం ఏం చేయాలో ముందు నిర్ణయించుకోవడం అందుకు తగ్గట్టుగా జీవితాన్ని నిర్మించుకోవడం అందరూ చేయరు. కాళీపట్నం రామారావు తన వివాహం అయ్యాక, 1947 నాటి కాలంలోనే 80 రూపాయల జీతం వచ్చే స్పోర్ట్స్ డిపోలోని ఉద్యోగానికి రాజీనామా చేశారు. కారణం అది కథలు రాసుకోవడానికి అవసరమైన టైమ్ ఇవ్వదని. 30 రూపాయల జీతం వచ్చే ప్రభుత్వ ఉపాధ్యాయుడి జీతం ఎంచుకున్నాడాయన. తెలుగు కథ తనకు అవసరమై ఆయన జీవితాన్ని రూపుదిద్దుకుందా అనిపిస్తుంది. 1979లో ఆయన రిటైరయ్యారు. అది కూడా కథ చేసుకున్న ఒక ఏర్పాటే. ఎందుకంటే ఆ తర్వాతి సమయమంతా ఆయన తెలుగు కథకే ఇచ్చారు. దాదాపు 30–35 ఏళ్లు తెలుగు కథ ప్రచారానికి, సేకరణకి, భద్రపరచడానికి వెచ్చించారు. దేని నుంచి పొందామో దానికే తిరిగి ఇవ్వడం చేసిన అరుదైన రచయిత కాళీపట్నం రామారావు. శ్రీకాకుళం చైతన్యధార ప్రపంచంలో గొప్ప రచయితలందరూ జీవితంలో రకరకాల పనులు చేసినవారే. శ్రీకాకుళం జిల్లా మురపాక ప్రాంతానికి చెందిన కాళీపట్నం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కుదురుకునేంత వరకూ రకరకాల పనులు చేశారు. టైపిస్ట్‌గా, డిస్ట్రిక్ట్ కోర్టులో చిరుద్యోగిగా, రేషనింగ్ ఆఫీసులో ఎంక్వయిరీ ఆఫీసరుగా ఇలా రకరకాల పనులు చేశారు. పత్రికల్లో పని చేయాలని ఆయనకు గట్టిగా ఉండేది. మద్రాసు (చెన్నై) వెళ్లి ప్రయత్నించినా జరగలేదు. సాహిత్యం పట్ల ఏర్పడిన ఆసక్తి ఆయనను కథకుడిగా ఉండమని కోరింది. 1943లో ఆయన మొదటి కథ ‘ప్లాట్‌ఫారమో?’ అచ్చయ్యింది. ఆ తర్వాత ఆయన కొన్ని కథలు రాసినా ఇవి కాదు కదా రాయాల్సింది అని అనిపించింది. ఆలోచన కలిగించనిది కథ ఎలా అవుతుంది అని ఆయన అనుకున్నారు. పాఠకులకు ఆలోచన కలిగించాలంటే రచయితకు చదువు, అవగాహన, జ్ఞానం, హేతువు, సైద్ధాంతిక భూమిక, ప్రాపంచిక దృక్పథం ఇవన్నీ ఉండాలి కదా అని అధ్యయనంలో పడ్డారు. 1955 నుంచి దాదాపు ఎనిమిదేళ్లు కథలు రాయకుండా పూర్తిగా అధ్యయనంలో ఉండిపోయారు. 1964లో ‘తీర్పు’ కథతో అసలైన కాళీపట్నం రామారావు తెలుగు పాఠకలోకానికి తెలిశారు. 1966లో ఆయన రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు సాహిత్యానికి చూపు, ఊపు ఇచ్చింది. ‘కథ ఎందుకు?’, ‘కథ ప్రయోజనం ఏమి?’, ‘కథ నడిచే మార్గం ఎలా ఉండాలి’ ఈ ప్రశ్నలన్నింటికి ఆ కథ ఒక మార్గదర్శిగా నిలిచింది. సామాజిక సమస్యలు, అంతర్గత ఆరాటాలు శరీరం మీద పీడన మనసు మీద పడుతుంది. మనసు పడే వొత్తిడి శరీరానికి హాని కలిగిస్తుంది. వ్యవస్థ గతి వ్యవస్థది మాత్రమే కాదు. ఆ గతిలో సమాజంలోని ప్రతి పౌరుడు భాగం. ఆ గతి మతి తప్పితే ఆ పౌరుడు బాధితుడవుతాడు. ఆ పౌరుడే ఇంటికొస్తే వ్యక్తిగా మారి అంటే తండ్రిగా, భర్తగా, కుమారుడిగా వొత్తిడి ఎదుర్కొంటాడు. ఈ రెంటినీ కాళీపట్నం రామారావు కథగా చేసి తెలుగు పాఠకులకు చూపారు. గుప్పిట విప్పేసినట్టుగా రాయడం ఆయన పద్ధతి కాదు. సూచించినట్టుగా పొరల చాటున దాచినట్టుగా ఆయన పరమసత్యాన్ని నిగూఢపరిచి దానిని తానే కనుగొన్న సంతృప్తిని పాఠకునికి ఇస్తారు. పౌరహితం కోరుతున్నట్టు కనిపించే ఈ సామాజిక వ్యవస్థ నిజానికి మేడిపండు. ఇది పైకి మంచిగా కనిపిస్తూ లోపల పీడితుల రక్తాన్ని తాగుతూ ఉంటుందని ఆయన రాసిన ‘యజ్ఞం’ కథ నాటి సామాజిక, ఆర్థిక మూలాల కఠినత్వాన్ని చూపింది. ఈ కథ ముగింపులో నిస్సహాయుని ఆగ్రహ ప్రకటనగా బాధితుడు తన ఇంటి పిల్లాడి తల నరకడాన్ని రచయిత చూపిస్తాడు. నేటికీ అదే జరుగుతోంది.. బలవంతుడైన పీడకునితో పోరాటానికి దిగితే మనకు ఆపద ఎదురవుతుంది. అప్పుడు మనవాళ్లే వచ్చి మన చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఆ పోరాటం నుంచి విరమింప చేస్తారు. అయితే పోరాటం వొద్దనా? కాదు ఒకరూ ఒకరూ ఒకరూ కాక అందరు కలిసినప్పుడు బలవంతుడు తోక ముడుస్తాడన్న సూచన ఉంది అందులో. ఆ భాష, ఆ సొగసు కాళీపట్నం రామారావు కేవలం ప్రగతిశీల కథ రాసి ఉంటే ఇంత ఖ్యాతి వచ్చి ఉండేది కాదు. ఆయన తాను పుట్టి పెరిగిన శ్రీకాకుళం మీద తన కథలను నిలబెట్టి ఆ స్థానికతే విశ్వజనీయత అనే భావనతో కథలు చెప్పారు. శ్రీకాకుళపు భాషను ఆయన సొగసుగా సంభాషణల్లో దించారు. ముఖ్యం శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికి మల్లే ఆయన కూడా స్త్రీల పాత్రలకు ఎంతో సజీవమైన సంభాషణలను సమకూర్చారు. ‘నో రూమ్’, ‘ఆర్తి’, ‘చావు’, ‘జీవధార’, ‘భయం’... ఈ కథలన్నీ ఇందుకు ఉదాహరణ. ‘జీవధార’ కథలో పైకి నీటి సమస్య వస్తువుగా కనపడుతుంది. మురికివాడ వాసులకు తాగునీళ్లు ఉండవు. దాపులో ఒక శ్రీమంతుల ఇంటిలో కావల్సినన్ని నీళ్లు. మురికివాడ ఆడవాళ్లు రోజు ఆ శ్రీమంతుల గేటు దగ్గరకు వచ్చి నీళ్లు అడుగుతూ ఉంటారు. ఆ శ్రీమంతులు చీదరించుకుంటూ ఉంటారు. చీదరించుకుంటూ ఉంటే ఆ ఆడవాళ్లు కొన్నాళ్లు పడతారు... మరి కొన్నాళ్లు సహిస్తారు... దప్పికతో ప్రాణం పోతుంటే ఏం చేస్తారు? తిరగబడతారు. అంతమంది తిరగబడితే ఆ శ్రీమంతులు నీళ్లేం ఖర్మ ఏమైనా ఇచ్చి తోక ముడవరూ? బాధితులందరూ కలిసి తిరగబడాలి... పీడితులందరూ కలిసి తిరగబడాలి... మైనార్టీ సమూహాలు అన్నీ కలిసి తిరగబడాలి... అని రచయిత సూచన. ఏదీ ఊరికే రాదు. ‘సాధించుకోవాలి’ ఈ వ్యవస్థ నుంచి. సాధించుకోవడం మెత్తగా సాధ్యం కాదు ఎప్పటికీ. దీపధారి కాళీపట్నం రామారావు ‘విరసం’ (విప్లవ రచయితల సంఘం) ఏర్పడినప్పటి నుంచి దాదాపు 15 ఏళ్లు అందులో క్రియాశీల సభ్యులుగా ఉన్నారు. రావిశాస్త్రి, వరవరరావు, కె.వి.రమణారెడ్డి వంటి ఉద్దండులతో ఆయన కలిసి పని చేశారు. తెలుగునాట విప్లవ కథ విస్తృతం కావడంలో అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి వంటి రచయితలు సిద్ధం కావడానికి మరోవైపు మధ్యతరగతి కథను ముందుకు తీసుకెళ్లడంలో వివిన మూర్తి, కవనశర్మ తదితరులు ముందంజ వేయడానికి కాళీపట్నం రామారావు స్ఫూర్తిగా నిలిచారు. ఆయనకు ‘సాహిత్య అకాడెమీ’ వచ్చినా తిరస్కరించారు. కొత్త కథకులను సిద్ధం చేసేందుకు ఊరూరు తిరిగి వర్క్‌షాపులు పెట్టారు. కథామెళకువలు చెప్పే వ్యాసాలు రాసి పుస్తకాలు వెలువరించారు. ఈ సమయంలోనే ఆయన ‘కథల మేష్టారు’గా గౌరవం పొందసాగారు. కథానిలయం 1996 ప్రాంతంలో నిజానికి ఎవరైనా సరే విశ్రాంత జీవనం కోరుకునే వయసులో ఆయన ‘కథానిలయం’ అనే బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఈ ఆలోచన చెప్పినప్పుడు ముందు హేళన, ఆ తర్వాత సంశయం, ఆ తర్వాత అంగీకారం పొందారు. తెలుగులో వచ్చిన కథలన్నీ ఒక్కచోట చేరాలి అని ఆయన చేసిన ఆలోచన ఇవాళ తెలుగువారికి ఒక విలువైన భాండాగారాన్ని సిద్ధం చేసింది. శ్రీకాకుళంలో ఆయన రెండస్తుల ‘కథా నిలయం’ కట్టడానికి కథాభిమానులు తలా ఒక ఇటుక ఇచ్చారు. ఇందుకోసమై హైదరాబాద్ రవీంద్రభారతిలో పెద్ద కార్యక్రమం చేసి కాళీపట్నంకు ‘లక్ష రూపాయల’ పర్స్ అందజేశారు. తెలుగులో వచ్చిన వీక్లీలు, మంత్లీలు, కథాసంకలనాలు, వాటితో పాటు రచయితల డేటా, వారు రాసిన కథల పట్టిక ఇవన్నీ చాలా పెద్ద పని. కాళీపట్నం తన భుజాల మీద వేసుకు చేశారు. ఆ తర్వాత ఆ ఆలోచన ఆ మొత్తం కథలను డిజిటలైజ్ చేయడం వైపు మళ్లింది. ఇవాళ ‘కథానిలయం’ వెబ్సైట్లో వేలాది కథలు డిజిటలైజ్ అయి ఉన్నాయి. విద్యార్థులకు, అధ్యయనం చేయాలనుకునేవారికి ఆ సైట్ ఒక అతి పెద్దసోర్స్. ఏనాటి కథలో, కథకులో తెలుసుకోవాలంటే ఆ సైట్‌కు వెళ్లక తప్పదు. మరో భాషకు ఇలాంటి సైట్ ఏమాత్రం లేదు. ఇది తెలుగువారి ఘనత. ఇందుకు కారకులు కాళీపట్నం. నిరంతర అధ్యయన శీలి కాళీపట్నం రామారావు నిరంతర అధ్యయనంలోనే ఉన్నారు. 96 ఏళ్లు వచ్చినా కన్ను కనిపించినంత సేపు చదవడానికే ఇష్టపడ్డారు. శ్రీకాకుళంలో కాళీపట్నం రామారావు తమ కథను చదివి మెచ్చుకుంటే అదే పెద్ద అవార్డుగా యువ కథకులు భావిస్తారు. ఆయన నిరంతరం కొత్త కథకులను ప్రోత్సహిస్తూనే వచ్చారు. 2006లో రాసిన ‘అన్నెమ్మ నాయురాలు’ ఆయన చివరి కథ. తెలుగు కథ పయనంలో కాళీపట్నం అస్తమయం వల్ల ఒక శకం ముగిసింది. అలాంటి రచయిత, కథా కార్యకర్త మరొకరు సిద్ధం కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. తెలుగు కథ ఉన్నంత వరకూ తప్పక కాళీపట్నం ప్రస్తావన, శ్రీకాకుళం ఉనికి ఉంటూనే ఉంటుంది. ఆ మహా కథకునికి నివాళి. కమిటెడ్ రైటర్ కాళీపట్నం రామారావును నిబద్ధ రచయితగా చెబుతారు. నిబద్ధతకు ఒక ఉదాహరణగా చూపుతారు. తన చేతిలో ఉన్న కథను, అక్షరాన్ని దేనికి నిబద్ధం చేయాలో ఎంత మేరకు చేయాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలని అంటారు. కనపడిందంతా, తోచిందంతా రాయడం కాళీపట్నం ఏనాడూ చేయలేదు. పొద్దుపోక రాయడం చేయలేదు. కాలక్షేపం కోసం రాయడాన్ని అసలు చేయలేదు. ఒక సత్యాన్ని కనుగొని ఆ సత్యానికి అవసరమైన కథను, పాత్రలను ఎంచుకుని, ఒక ప్రయోజనాన్ని ప్రతిపాదించి, ఒక చూపును ఇవ్వగలిగే కథ రాయగలిగినప్పుడే రాశారు. అందుకే ఆయన ముఖ్యమైన కథలు ఒక డజనుకు మించవు. అయినా సరే అవి వంద కథలకు సమానమైన ఖ్యాతి పొందాయి. – సాక్షి ఫ్యామిలీ