మోదీ దౌత్యం
* భారత జైలుకు జాలర్లు
* మత్స్యకారుల్లో ఆనందం
* జాలర్లకు ఉరిశిక్షను రద్దు చేయాలని ఆందోళన
చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంక ఆధీనంలోఉన్న కచ్చదీవుల్లో తమిళనాడు జాలర్లు చేపల వేటసాగిస్తూ హద్దుమీరుతున్నారని ఆ దేశం తరచూ ఆరోపణలు గుప్పిస్తోంది. అంతేగాక అదేపనిగా తమిళ జాలర్లపై దాడులకు పాల్పడుతూ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ దశలో రామనాథపురం జిల్లా రామేశ్వరం సమీపం తంగచ్చిమండపానికి చెందిన 8 మంది జాలర్లు హెరాయిన్ మత్తుపదార్థాలను చేరవేస్తున్నారంటూ 2011 నవంబరు 28న శ్రీలంక గస్తీదళాలు అరెస్ట్ చేశారుు. అప్పటి నుంచి అంటే గత 35 నెలలుగా 8 మంది జాలర్లు శ్రీలంక జైలులోనే మగ్గుతున్నారు. పట్టుబడిన 8 మంది తమిళ జాలర్లలో 5 గురికి ఉరిశిక్ష విధిస్తూ గత నెల 30న శ్రీలంక కోర్టు తీర్పు చెప్పింది.
ఈనెల 14 వ తేదీలోగా అప్పీలు చేసుకునే అవకాశం కల్పించింది. కక్షపూరిత వైఖరితో అమాయకులకు శ్రీలంక ఉరిశిక్ష విధించిందని తమిళనాడు ముక్తకంఠంతో ఖండించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న దృష్ట్యా బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు నిరసన గళం విప్పాయి. తీర్పు వెలువడిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం పరిస్థితి తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అన్ని కోణాల నుంచి ఒత్తిడి పెరగడంతో శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయసాగింది.
ఉరిశిక్ష పడిన జాలర్ల అంశంపై శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 9న టెలిఫోన్ ద్వారా సంభాషించారు. తమిళనాడులో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు చల్లబడేందుకుఐదుగురు జాలర్లను భారత దేశంలోని ఏదేని జైలుకు తరలించాలని కోరారు. రాజపక్సే అంగీకరించారు. రాజపక్సే మీడియా ప్రతినిధి మోహన్ సమీరనాయకే ఈ విషయాన్ని ధృవీకరించారు. భారత ప్రధాని మోదీ, రాజపక్సేతో చర్చించడం, తమిళ జాలర్లను భారత్కు తరలించేందుకు రాజపక్సే అంగీకరించిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే వారిద్దరి సంభాషణల్లోని పూర్తి వివరాలు తనకు తెలియవన్నారు.
ఆనందాలు-ఆందోళనలు: ఉరిశిక్ష పడడంతో ప్రాణాలతో తిరిగిరారనే ఆవేద నలో మునిగిపోయిన మత్స్యకార కుటుంబాలు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నాయి. శ్రీలంక చెర నుంచి ముందు బయటపడితే భారత ప్రభుత్వానికి నచ్చజెప్పి తమవారి ప్రాణాలను రక్షించుకోవచ్చనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఐదుగురి జాలర్లను మదురై జైలుకు తరలించాలని కోరుతూ మదురై హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తెలిసింది. మరోవైపు ఐదుగురు జాలర్ల ఉరిశిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మద్రాసు హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు.
న్యాయవాదుల ఆందోళన
టీనగర్: రామేశ్వరం తమిళ జాలర్లకు శ్రీలంక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ మద్రాసు హైకోర్టు న్యాయవాదులు సోమవారం ఆందోళన చేశారు. హైకోర్టు విధులను బహిష్కరించారు. దీంతో చెన్నై ప్యారిస్లోగల హైకోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం మోపిన అభియోగంపై ఐదుగురు జాలర్లకు కొలంబో న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది. ఈ ఉరిశిక్షను రద్దు చేయాలంటూ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. ఉరిశిక్షకు వ్యతిరేకత తెలుపుతూ మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఆర్సి పాల్ కనకరాజ్ ఆధ్వర్యంలో జరిగిన సంఘ సర్వసభ్య సమావేశంలో ధర్నా చేయడం, హైకోర్టు విధులను బహిష్కరించేందుకు నిర్ణయించారు.
మహిళా న్యాయవాదుల సంఘం అధ్యక్షురాలు నళిని ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ హైకోర్టు విధులను బహిష్కరించేందుకు తీర్మానించారు. దీంతో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో న్యాయవాదులందరూ మద్రాసు హైకోర్టు ఆవిన్ గేటు సమీపాన గుమికూడారు. న్యాయవాదుల సంఘం కార్యదర్శి అరివళగన్, ఉపాధ్యక్షుడు గిని మాన్యువేల్ ఆధ్వర్యంలోను, మహిళా న్యాయవాదుల సంఘం అధ్యక్షురాలు నళిని ఆధ్వర్యంలోను న్యాయవాదులు శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఆ తర్వాత ఎన్ఎస్సి బోస్ రోడ్డుపై రాస్తారోకో జరిపారు. హైకోర్టు విధులను బహిష్కరించడంతో హైకోర్టు, సెషన్స్ కోర్టులలో కేసుల విచారణలు స్థంభించాయి.