Indian Readership survey
-
సాక్షికి మరింత పాఠకాదరణ
సాక్షి, హైదరాబాద్: తెలుగు దినపత్రికలు చదువుతున్న సగటు పాఠకుల సంఖ్య భారీగా తగ్గిపోతున్న తరుణంలో సాక్షి దినపత్రిక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 2019–20 నాలుగో త్రైమాసికానికి సంబంధించి మరింత మంది పాఠక దేవుళ్ల ఆదరణ చూరగొంది. 2019–20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం గణాంకాలతో పోలిస్తే నాలుగో త్రైమాసికంలో సాక్షి తన ఆధిక్యతను ప్రదర్శించింది. ఇండియన్ రీడర్షిప్ సర్వే (ఐఆర్ఎస్) నాలుగో త్రైమాసికం గణాంకాలు విడుదల చేయడంతో ఈ విషయం స్పష్టమైంది. (చదవండి: మీ విశ్వాసాన్ని ‘సాక్షి’ కాపాడుకుంటుంది) 2019–20 మొదటి త్రైమాసికంతో పోలిస్తే సాక్షి దినపత్రిక నాలుగో త్రైమాసికంలో 30.79 లక్షల మంది సగటు పాఠకులతో (ఏవరేజ్ ఇష్యూ రీడర్షిప్) మూడు శాతం వృద్ధిని నమోదు చేసింది. తెలుగు దినపత్రికల సగటు పాఠకుల సంఖ్య 25 శాతం వరకు తగ్గితే సాక్షి మాత్రం 3 శాతం పెంచుకోవడం విశేషం. ఇదే కాలంలో ఈనాడు 20.15 లక్షల మంది పాఠకులను (30 శాతం) కోల్పోయింది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే సగటు పాఠకులు కోల్పోయిన సంఖ్య 33% ఉండగా నమస్తే తెలంగాణ దాదాపు సగం మంది పాఠకులను (49%) కోల్పోయింది. ఏపీలో భారీ వృద్ధి నమోదు.. ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి దినపత్రిక సగటు పాఠకుల సంఖ్యను భారీగా పెంచుకుంది. 2019–20 మొదటి మూడు నెలల కాలం (ఏప్రిల్–జూన్)తో పోలిస్తే చివరి మూడు నెలల కాలం (జనవరి–మార్చి 2020)లో ఈనాడు, సాక్షి పత్రికల మధ్య అంతరం 2.53 లక్షలకు పడిపోయింది. ఆ తేడా మొదటి త్రైమాసికంలో 17.86 లక్షలుగా ఉండేది. ఏపీ క్లస్టర్–1లో (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు) సాక్షి దినపత్రిక 13 శాతం సగటు పాఠకుల సంఖ్యను పెంచుకోగా ఈనాడు 46 శాతం మేర పాఠకులను కోల్పోయింది. అదే సమయంలో రాయలసీమ క్టస్టర్‌లో (చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలు) సాక్షి అత్యధికంగా 59 శాతం పాఠకుల ఆదరణ సంపాదించుకోగా ఈనాడు 33 శాతం మంది పాఠకులను కోల్పోయింది. హైదరాబాద్ పరిధిలో సాక్షి 27 శాతం వృద్ధి.. హైదరాబాద్ నగర పరిధి (ఆర్బన్ అగ్లామరేషన్)లోనూ సాక్షి దినపత్రిక 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2019–20 మొదటి క్వార్టర్‌తో పోలిస్తే నాలుగో క్వార్టర్లో సాక్షి మినహా మిగిలిన ప్రధాన పత్రికల సగటు పాఠకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. క్వార్టర్–1తో పోలిస్తే క్వార్టర్–4లో ఈనాడు 24 శాతం, నమస్తే తెలంగాణ 64 శాతం, ఆంధ్రజ్యోతి 28 శాతం క్షీణత నమోదు చేసినట్లు ఇండియన్ రీడర్షిప్ సర్వే వెల్లడించింది. లాక్డౌన్ సమయంలోనూ... కరోనా లాక్డౌన్ సమయంలోనూ సాక్షి భద్రతా ఏర్పాట్లను పక్కాగా పాటించి వాటిని పాఠకులకు ప్రదర్శించి వారిలో విశ్వాసాన్ని పాదుకొల్పింది. దీంతో మూడో దశ లాక్డౌన్ వచ్చేసరికి సాక్షి లాక్‌డౌన్‌కు ముందు ఉన్న ప్రింట్ ఆర్డర్‌ను (ముద్రించే కాపీలు) నిలబెట్టుకుంది. అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉన్న సాక్షి దినపత్రిక అగ్రస్థానానికి చేరుకోవడానికి ఇదో మంచి అవకాశంగా భావిస్తోంది. (వీడియో: వార్తా పత్రికలు శుభ్రమైనవి..) -
ఐఆర్ఎస్ సర్వే నిలుపుదల
సర్వే గణాంకాల వాడకాన్ని మార్చి 31 వరకు నిలిపేయాలని ఎంఆర్‌యూసీ, ఆర్ఎస్సీఐ నిర్ణయం త్వరలో సర్వే గణాంకాల పునర్ మూల్యాంకనం.. సాక్షి, హైదరాబాద్: దేశంలో వివిధ పత్రికల పాఠకుల సంఖ్యపై ఇండియన్ రీడర్షిప్ సర్వే(ఐఆర్ఎస్)-2013 తప్పుడు గణాంకాలు వెలువరించిన నేపథ్యంలో.. సర్వే వివరాల వాడకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. సర్వే నిర్వహణ సంస్థ ‘మీడియా రీసెర్చ్ యూజర్స్ కౌన్సిల్’(ఎంఆర్‌యూసీ) ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. పత్రికల పాఠకుల సంఖ్యపై ఐఆర్ఎస్-2013లో భారీగా తప్పులు దొర్లడంతో దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు ఖండించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఎస్సీఐ మేనేజింగ్ కమిటీ, ఎంఆర్‌యూసీ బోర్డు ముంబైలో సమావేశమై దీనిపై చర్చించాయి. సర్వే గణాంకాలను పునర్ మూల్యాంకనం చేయాలని సమావేశం నిర్ణయించింది. పునర్ మూల్యాంకనం పూర్తయ్యే వరకు సర్వే గణాంకాల వాడకాన్ని మార్చి 31 వరకు నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఐఆర్ఎస్ సర్వే గణాంకాలను పునర్ మూల్యాంకనం చేయడానికి ఒక ప్రక్రియ రూపొందిస్తున్నామని, ఇది ఈ నెల 24కల్లా ఖరారవుతుందని సమావేశం పేర్కొంది. మార్చి 31కల్లా పునర్ మూల్యాంకనం పూర్తవుతుందని, ఈ ప్రక్రియలో గుర్తించిన అంశాలను, తమ సిఫార్సులను ఏప్రిల్ తొలి రోజుల్లో ఆర్‌ఎస్‌సీఐకు సమర్పించనున్నట్లు ఎంఆర్‌యూసీ పేర్కొంది. ఆమోదం పొందిన సిఫార్సులను ఐఆర్ఎస్ భవిష్యత్ ప్రణాళికలో చేరుస్తారని ఓ ప్రకటనలో తెలిపింది. పునర్ మూల్యాంకనం పూర్తయ్యే వరకు సర్వే గణాంకాల వాడకాన్ని నిలిపేయాల్సిందిగా ఆర్ఎస్సీఐ, ఎంఆర్‌యూసీ, ఏబీసీలు చందాదారులు, సభ్యులకు సూచించాలని సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించింది. -
ఐఆర్ఎస్ గణాంకాలు తప్పులతడక
ప్రముఖ మీడియా సంస్థల ఖండన సర్వేను వెనక్కి తీసుకోవాలని డిమాండ్.. ఈ సర్వేను నమ్మొద్దని ప్రకటనకర్తలకు, మీడియా ఏజెన్సీలకు విన్నపం సాక్షి, హైదరాబాద్: వివిధ పత్రికల పాఠకుల సంఖ్యపై ఇండియన్ రీడర్షిప్ సర్వే (ఐఆర్ఎస్) తాజాగా వెలువరించిన గణాంకాలను దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు తీవ్రంగా ఖండిం చాయి. ఈ గణాంకాలన్నీ తప్పులతడకగా, అసంబద్ధంగా ఉన్నాయని పేర్కొన్నాయి. ఐఆర్ఎస్ 2013 సర్వేను కొత్త ఏజెన్సీ (ఈ సంస్థ రీడర్షిప్ సర్వేను చేపట్టడం ఇదే తొలిసారి) ద్వారా నిర్వహించారని, ఇందులో అనేక త ప్పులు, పొరపాట్లు దొర్లాయని సోదాహరణంగా వివరించాయి. సర్వే గణాంకాలను ఖండిస్తూ సాక్షి తెలుగు దినపత్రికతోపాటు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, దైనిక్ జాగరణ్ గ్రూప్, ఆనంద్ బజార్ గ్రూప్, లోక్మత్ గ్రూప్, దినకరణ్ గ్రూప్, దైనిక్ భాస్కర్ గ్రూప్, అమర్ ఉజాలా గ్రూప్, ద హిందూ గ్రూప్, డీఎన్ఏ గ్రూప్, ఇండియా టుడే గ్రూప్, ఔట్లుక్ గ్రూప్, మిడ్ డే, నయి దునియా, బర్తమాన్, ఆజ్ సమాజ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. సర్వే ఫలితాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సర్వేను నిర్వహించిన ఆర్ఎస్సీఐ, ఎంఆర్‌యూసీ సంస్థలను డిమాండ్ చేశాయి. ఇలా తప్పుదోవ పట్టించే సర్వేలను భవిష్యత్తులో ప్రచురించవద్దని కోరాయి. ఏబీసీ వెలువరించే సర్క్యులేషన్ గణాంకాలకు కూడా పూర్తి విరుద్ధంగా ఉన్న ఈ సర్వేను నమ్మొద్దని ప్రకటనకర్తలను, మీడియా ఏజెన్సీలను కోరారు. సర్వే తప్పులతడక అని చెప్పడానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు... - ఒక్క ఏడాదిలోనే పంజాబ్‌లో పాఠకుల సంఖ్య ఏకంగా మూడోవంతు తగ్గింది. అదే పొరుగున ఉన్న హర్యానాలో మాత్రం పాఠకుల సంఖ్య 17 శాతం పెరిగింది. - ఆంధ్రప్రదేశ్‌లో భాషలకు అతీతంగా వివిధ ప్రధాన పత్రికల పాఠకుల సంఖ్యలో 10 నుంచి ఏకంగా 65 శాతం తగ్గుదల నమోదైంది. - ముంబైలో పాఠకుల సంఖ్య 20.3% పెరిగింది. అదే సమయంలో అన్ని రంగాల్లో ముంబై కంటే వేగంగా దూసుకుపోతున్న ఢిల్లీలో పాఠకుల సంఖ్య 19.5% తగ్గింది. - నాగ్‌పూర్‌కు చెందిన ఇంగ్లిష్ పత్రిక ‘హితవాద’కు 60 వేలకుపైగా సర్క్యులేషన్ ఉన్నా ఒక్క పాఠకుడు కూడా లేడు! - ‘హిందూ బిజినెస్ లైన్’ పత్రికకు చెన్నైలో కంటే మణిపూర్‌లో మూడు రెట్లు ఎక్కువ సంఖ్యలో పాఠకులు ఉన్నారు.